Cricketer HanumaVihari: ఏసీఏలో క్రికెటర్ హనుమ విహారికి న్యాయం చేస్తామని ప్రకటించిన నారాలోకేష్
Cricketer HanumaVihari: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలతో కెప్టెన్సీ వదులుకుని వెళ్ళిపోయిన క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారాలోకేష్‌తో భేటీ అయ్యారు.
Cricketer HanumaVihari: మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మంగళవారం నారాలోకేష్‌తో హనుమ విహారీ భేటీ అయ్యారు.
క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన పి.శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించుకోవడంతో గత ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ‘రాజకీయ క్రీడ’ మొదలుపెట్టిందని లోకేష్ అన్నారు.
తమ పార్టీ నాయకుడి కుమారుడు, జట్టులో 17వ ఆటగాడు అయిన కుంట్రపాకం పృధ్వీరాజ్‌ను ప్రోత్సహించినందుకు అసమాన ప్రతిభాపాటవాలు ఉన్న హనుమ విహారి లాంటి క్రికెటర్ ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధించింది, అవమానించిందని ఆరోపించారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని, ఆ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, తాను స్పందించి, హనుమ విహారికి అండగా ఉన్నామని లోకేష్ గుర్తు చేశారు.
#WeStandWithHanuma పేరుతో సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు ఎందరో హనుమ విహారికి సంఘీభావం తెలిపారని, హనుమ విహారి తన క్రికెట్ అనుభవాన్ని ఇతరులకు నేర్పేందుకు కూడా ఆనాటి వ్యవస్థ అడ్డుపడిందన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించేలా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని, రాష్ట్రంలో కూటమి ప్రభంజనం చూసిన తర్వాతే హనుమ విహారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చన్నారు.
రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుంటుందని, అన్ని ఆటల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. క్రికెటర్ హనుమ విహారికి పూర్తి న్యాయం చేసేందుకు మాట ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని నారా లోకేష్ ప్రకటించారు.
గతంలో రాజకీయాలకు బలయ్యానని, వైసీపీ ప్రభుత్వం, ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఒత్తిడి చేసి కెప్టెన్ గా రాజీనామా చేయించారని హనుమ విహారి తెలిపారు. మంత్రి లోకేశ్ తనను తిరిగి ఏపీకి రావాలని ఆహ్వానించారనపి క్రికెటర్ హనుమ విహారి చెప్పారు.