Municipal Schools : ఏపీలో మునిసిపల్ స్కూల్స్‌ విద్యాశాఖలో విలీనం-municipal schools merged in education department of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Municipal Schools : ఏపీలో మునిసిపల్ స్కూల్స్‌ విద్యాశాఖలో విలీనం

Municipal Schools : ఏపీలో మునిసిపల్ స్కూల్స్‌ విద్యాశాఖలో విలీనం

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 01:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలన్నింటిని విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు పురపాలక శాఖ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణలో సమస్యలు తలెత్తుతుండటంతో పాఠశాలలన్నింటిని ఒకే శాఖ పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక సంఘాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న పాఠశాలలన్నింటిని విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జడ్పీ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. పట్టణాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పాఠశాలల నిర్వహణ అయా స్థానిక సంస్థల పరిధిలో ఉంటోంది. దీని వల్ల ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమోషన్లు, బదిలీల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో మునిసిపల్ పాఠశాలల్ని కూడా విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2114 మునిసిపల్ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో 123 పురపాలక సంస్థలు, కార్పొరేషన్లలో 59 చోట్ల మాత్రమే మునిసిపల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1942 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మునిసిపల్ పాఠశాల్ని కూడా విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని కొద్ది కాలంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్త చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలన్నింటిని విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఉన్న నిబంధనలే ఇకపై మునిసిపల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు కూడా వర్తిస్తాయి.

మరోవైపు మునిసిపల్ స్కూళ్లలో టీచర్ల సర్వీసుల్ని విద్యాశాఖ పరిధిలోకి తీసుకు వచ్చినా, పాఠశాల భవనాలు, ఆస్తులు మాత్రంఅయా మునిసిపాలిటీలకే చెందుతాయని స్పష్టం చేసింది. సిబ్బంది నియామకాలు, పోస్టులు, ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే విద్యాశాఖ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

IPL_Entry_Point

టాపిక్