Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లమన్న కేంద్ర మంత్రి-mos steel faggan singh kulaste announced that there is no idea of privatization of visakha steel plant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లమన్న కేంద్ర మంత్రి

Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లమన్న కేంద్ర మంత్రి

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 12:20 PM IST

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు.

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే (Sanjeev Gupta)

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం వర్కింగ్ క్యాపిటల్‌ సమీకరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోసం బిడ్లను ఆహ్వానించిన వేళ రాజకీయ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌ వ్యవహారంలో ఏపీలో అధికార వైసీపీ, బిఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి విశాఖ పర్యటనకు వచ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతున్న వేళ ఏపీకి ఊరటనిచ్చేలా కీలక ప్రకటన వెలువడింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పర్యటన కోసం వచ్చిన కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరింత సమయం వేచి ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త యూనిట్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని, కొత్త యూనిట్‌ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణకు ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి వివరించారు. స్టీల్‌ ప్లాంటుకు ప్రధాన సమస్యగా ఉన్న మైనింగ్, ఐరన్ ఓర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫగ్గన్ తెలిపారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి కొట్టి పారేశారు. సింగరేణి ప్రతినిధులు స్టీల్‌ ప్లాంట్‌ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక కోసం పర్యటిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో బిఆర్‌ఎస్‌ పార్టీది రాజకీయ ఎత్తుగడ మాత్రమే అన్నారు. మరోవైపు ఫగ్గన్ సింగ్ కులస్తే పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్న వేళ ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ‌్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్లాంటు యాజమాన్యంతో మంత్రి చర్చించనున్నారు. ప్రధానంగా నిధుల సమీకరణతో పాటు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్‌ను ప్రారంభించడానికి అవసరమైన వనరుల సమీకరణ స్టీల్ ప్లాంటు భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకు వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

880 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయని, పెట్టుబడుల ఉపసంహరణ తమ ప్రభుత్వ విధానమని కేంద్రం చెబుతున్న వేళ, కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం మంత్రి ప్రకటించడం శుభపరిణామం అని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. రూ.5వేల కోట్ల రుపాయల మూల ధన సమీకరణకు కేంద్రం సహకరిస్తే కర్మాగారాన్ని గాడిన పెట్టొచ్చనిచెబుతున్నారు. ఎన్‌ఎండిసి నుంచి గనులను స్టీల్‌ ప్లాంటుకు కేటాయించి స్టీల్ ప్లాంట్ వివాదాన్ని ప్రస్తుతానికి ముగింపు పలికే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point