KTR Supports Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీను కాపాడుకోవాలని కేటీఆర్‌ పిలుపు-ktr wrote an open letter to save visakhapatnam steel plant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ktr Supports Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీను కాపాడుకోవాలని కేటీఆర్‌ పిలుపు

KTR Supports Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీను కాపాడుకోవాలని కేటీఆర్‌ పిలుపు

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 08:29 AM IST

KTR Supports Steel Plant: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అనీ, ఆ కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం తెలుగు వారంతా కలిసి రావడం అవసరమని మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను స్వార్థపూరిత శక్తుల ఎజెండాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ బలి కానివ్వబోమని ప్రకటించారు.

విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటూ కేటీఆర్ బహిరంగ లేఖ
విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటూ కేటీఆర్ బహిరంగ లేఖ (twitter)

KTR Supports Steel Plant: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేయడమే ఏకైక ఎజెండాగా కేంద్రం పనిచేస్తోందని కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. వర్కింగ్‌ కాపిటల్‌, ముడిసరకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్‌ ప్లాంట్‌ తాళాలను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం మార్చి 27న నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

రూ.5 వేల కోట్లు కేటాయించాలి…

'స్టీల్‌ ఉత్పత్తి రంగాన్ని నాన్‌ స్ట్రాటజిక్‌ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నిందని అందులో భాగంగానే స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్‌ ఓర్‌ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ తన ఉత్పత్తి ఖర్చులో 60% వ్యయాన్ని పూర్తిగా ముడి సరకుపైనే వెచ్చించాల్సి వస్తోందని, ప్రైవేట్‌ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్‌ ఓర్‌, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల.. వారి ఉత్పత్తి ఖర్చులో ముడి సరకుల వ్యయం 40% లోపలే ఉంటోందని వివరించారు.

నష్టాలను సాకుగా చూపించి, కార్పొరేట్‌ కంపెనీల కోసం, మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోదీకి.. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కనీస కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్‌ నిలదీశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి ముడి సరకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతోందని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే.. 100% సామర్థ్యంతో పని చేయడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. తద్వారా అది లాభాల బాట పడుతుందని, విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను బలోపేతం చేయాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.లక్ష కోట్లతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని గుర్తు చేవారు. ఈ సంస్థను వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌తో కలపవవచ్చని, తక్కువ ధరకి ప్రైవేట్‌ సంస్థలకు అమ్మడం కంటే.. కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెయిల్‌ సంస్థ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందని, సెయిల్‌ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్‌ చేస్తున్న బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌తో పాటు.. కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందన్నారు.

''వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ధి బిఆర్‌ఎస్‌ పార్టీకి ఉందని, కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులను, కార్మిక సంఘాల వారిని కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ శాఖ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్‌ సూచించారు.

తర్వాత కన్ను సింగరేణిపైనే….

''విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, 2021 నుంచే కార్మికులకు మద్దతుగా నా గళం వినిపిస్తున్నానని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపానని, తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడకపోతే తదుపరి మోదీ ప్రభుత్వం కన్ను పడేది సింగరేణిపైనే'' అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో త్వరలో భేటీ….

తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలే కాపాడుకోవాల్సిన రోజు వచ్చిందని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పిలుపుచిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలపై తెలంగాణా మంత్రి కె.టి. రామారావు విడుదల చేసిన ప్రకటనని డాక్టర్ తోట చంద్రశేఖర్ స్వాగతించారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడంపై భారత రాష్ట్ర సమితి మాత్రమే స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోందని, కేటీఆర్ ప్రకటన ఏపీ ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన వివిధ వర్గాల నేతలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు జరిపామని అతి త్వరలోనే ఈ అంశంపై స్పష్టమైన ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తామని డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొన్ని శక్తులు కుట్రపూరితంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని, లక్షన్నర కోట్ల ఆస్తులు కలిగిన ఈసంస్థకి పాతిక వేల కోట్లు మాత్రమే రుణాల మానిటైజేషన్ కి అవకాశం కల్పించి, ప్రైవేటు సంస్థలకు మాత్రం 70 వేల కోట్ల రూపాయల వరకు అవకాశం ఇవ్వడం దారుణమైన విషయంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోందని తోట చంద్రశేఖర్ అన్నారు. దేశం నిరుద్యోగం కోరల్లోకి జారిపోతోంది, గత మూడు నెలల్లో గరిష్టంగా 7.8 శాతం నిరుద్యోగిత దేశంలో నమోదైనట్టు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. 2022లో ఇది మరింత ఎక్కువగా నమోదైంది. కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితులకు కారణమని డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు.

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలే ఎక్కువగా నష్టపోతున్నాయని, దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లాంటి సంస్థలు ఇప్పటికే కనుమరుగు చేశారని ఇప్పుడు విశాఖ ఉక్కుకి అదే గతి పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు హెచ్చరించారు.

Whats_app_banner