Annapurna devi: శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి
Annapurna devi: దేవీ శరన్నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రోధి నామసంవత్సరం అశ్వయుజశుద్ధ తదియ అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.వరుస సెలవులతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
Annapurna devi: “పురుషార్థప్రదాపూర్ణా భోగినీ భువనేశ్వరీ"
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశ పావనకరీ కాశికాపురాధీశ్వరీ
భిక్షాం దేహికృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
దసరాశరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన ఆశ్వయుజశుద్ధ తదిమయనాడు కనకదుర్గ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.
అన్నంపరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవాధానం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ. నిత్యాన్న దానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సకలజీవరాసులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది.
ఇలా జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణా దేవి నిజనివాసం ఆది స్మశానమైన వారణాసిక్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆ ఆదినాధుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనేకాశీ అన్నపూర్ణా అని పిలుస్తారు. ఈ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్యస్వరూపాల్లో ఒక రూపమే.
అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయటంలోని పరమార్థం ఏమిటి? అనంటే, సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిబిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకి బిక్షని ప్రసాదిస్తుంది. ఇదీ అలంకారంలోని దృశ్యం.
దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమంటే. తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపునిండా తిండిపెట్టుకోవాలను కుంటుంది. అందుకోసం ఎంతకష్టాన్నైనా పడుతుంది. అలాగే దుర్గమ్మకూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి, వారి ఆకలిని తీరుస్తోంది. అది అమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది.
అంటే ఈ లోకంలో అన్నార్తులైన వారందరినీ సాక్షాత్తు శివస్వరూపులుగా, మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపమే అవుతాం. ఆ అన్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకూ అన్నార్తులు అలమటించి పోకుండా కాపాడాలి. అందుకే ఒక్కసారి ఆ నిత్యాన్న దానేశ్వరి అన్నపూర్ణాదేవి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మని మనసారా భక్తితో ప్రార్ధించండి.
నిత్యానందకరీ వరాభయకరీ సాందర్య రత్నాకరీ
నిర్దూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావకరీ కాశీపురాధీశ్వరి
భిక్షాందేహి కృపావంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అంటూ అమ్మవారిని ధ్యానిస్తూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటారు.