Indrakeeladri : అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించిన ఇంద్రకీలాద్రి క్షేత్రం-indrakiladri kshetra where arjuna was blessed with pasupatastra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Indrakiladri Kshetra Where Arjuna Was Blessed With Pasupatastra

Indrakeeladri : అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించిన ఇంద్రకీలాద్రి క్షేత్రం

B.S.Chandra HT Telugu
Sep 26, 2022 06:51 AM IST

Indrakeeladri దేవీ శరన్నవరాత్రుల్లో బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే ఉత్సవాలకు విశిష్ట స్థానం ఉంది. దేవీ శరన్నవరాత్రి వేడుకల సమయంలో ఇంద్రకీలాద్రి క్షేత్రానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత ప్రధాన కారణం…

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ గోపురం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ గోపురం

కనక దుర్గా స్వరూపంగా అమ్మవారు అవతరించిన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులను కరుణిస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రూపంలో ఇక్కడ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి ఇంతటి వైభవం రావడం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది.

ద్వాపరయుగంలో అర్జునుడు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కొలిచినట్లు చెబుతారు. అమ్మవారి ఆజ్ఞతో పాశుపతాస్త్రాన్ని పొందడానికి అర్జునుడు ఇంద్రకీలాద్రిపై కఠోర తప్పస్సు చేశారని, అర్జునుడి భుజబలాన్ని, మనోధైర్యాన్ని పరీక్షించడానికి సతీసమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపంలో అర్జునుడితో వాదించి, మల్లయుద్ధం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. అర్జునుడి బలానికి మెచ్చి నిజరూప దర్శన మిచ్చిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినట్లు స్థల పురాణాలు చెబుతాయి.

మిగిలిన దుర్గా మాత ఆలయాలకు భిన్నంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి క్షేత్రపాలకుడిగా అభయాంజనేయస్వామి ఉంటారు. ఇంద్రకీలాద్రి క్షేత్రాన్ని అభయాంజనేయస్వామి భక్తుల్ని, ఆలయాన్ని రక్షిస్తారని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రి పర్వతానికి నాలుగు దిక్కులా క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు.

అసుర సంహారం తర్వాత దుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటంతో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా, శాంత స్వరూపిణిగా అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదిక స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంలో కుంకుమార్చన నిర్వహించారు. అప్పటి నుంచి అమ్మవారికి అదే విధానంలో నేటికి పూజలు నిర్వహిస్తున్నారు.

12వ శతాబ్దంలో లింగధారుడైన శ్రీపతి పండితారాధ్యుల వారు దుర్గామల్లేశ్వరులను పూజించి కొండ దిగువున జమ్మదొడ్డి ఉన్న ప్రాంతంలో వంట చేయడానికి స్థానిక ప్రజల్ని నిప్పు కోరడంతో వారు నిరాకరించినట్లు చెబుతారు. దీంతో శ్రీపతి పండితారాధ్యుల వారు అత్యంత భక్తి శ్రద్దలతో అగ్నిని పుట్టిచి దానిని తన ఉత్తరీయంలో పెట్టి నిప్పు మూటను జమ్మిచెట్టుకు ఉత్తరీయంగా కట్టినా జమ్మిచెట్టు కానీ, ఉత్తరీయం కానీ కాలిపోకుండా అలాగే ఉండటంతో స్థానికులు ఆయన్ని క్షమించాలని కోరినట్లు స్థల పురాణంలో పేర్కొన్నారు. తరతరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి దశమి వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. విజయదశమి రోజు హంస వాహనంపై దుర్గా మల్లేశ్వరులు కృష్ణా నదిలో జల విహారం చేస్తారు.

IPL_Entry_Point

టాపిక్