AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభం-efforts to instill enthusiasm in ap congress have begun ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Congress: ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభం

AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభం

Sarath Chandra HT Telugu
Jul 13, 2023 02:14 PM IST

AP Congress: ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత అధ్యక్షులు మారినా పార్టీ పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. కర్ణాటకలో గెలుపుతో ఏపీలో కూడా శక్తి పుంజుకోడానికి ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.

విజయవాడలో నిర్వహించిన మౌన దీక్షలో  కాంగ్రెస్ నాయకులు
విజయవాడలో నిర్వహించిన మౌన దీక్షలో కాంగ్రెస్ నాయకులు

AP Congress: ఏపీలో దాదాపుగా కనుమరుగైన కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మౌన సత్యాగ్రహం కార్యక్రమం విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి సత్యాగ్రహ కార్యక్రమం ఒక విధంగా ఊపిరి అందించింది.

2024 జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని సెమీ ఫైనల్స్‌గా ఆపార్టీ భావిస్తోంది. కర్ణాటక గెలుపుతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కర్ణాటక ఇచ్చిన విజయంతో మిగిలిన రాష్ట్రాలలో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది.

నాలుగు రాష్ట్రాల్లో ఓటర్లు కాంగ్రెస్ పక్షాన ఉంటే మాత్రం 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అవుతుందని అంచనా వేస్తున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతోనే రాహుల్ గాంధీకి కూడా బీజేపీని వ్యతిరేకించే రాజకీయాల పక్షాలకు నాయకత్వం వహించే అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.ఈ అంశాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్టానం తన సర్వ శక్తులూ ఒడ్డి పోరాడుతోంది.

కాంగ్రెస్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితులు కనబడకపోయినా.. అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన, ఏపీ ప్రధాన కార్యాలయంలో సందడి మొదలైంది. వారంలో నాలుగు రోజులు ఆంధ్రరత్న భవన్ లోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడూ సమావేశాలు, సమీక్షలూ నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో మూడు రోజులు రాష్ట్ర పర్యటనల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారుు.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నిస్తున్నారు.

2014 రాష్ట్ర విభజన తరువాత దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచింది. అప్ఫటి వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కనీసం కార్పొరేటర్ సీటు గెలవడం కూడా కష్టంగా మారింది. కార్యకర్తలు లేక, నేతలు రాక కొన్ని సంవత్సరాలు ఆంధ్రరత్న భవన్ వెలవెల బోయింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిన పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. తన అనుభవంతో గ్రూపు రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ పార్టీలో జవ సత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రరత్న భవన్ లోనే మకాం వేసి కార్యకర్తలకు తాను అండగా ఉంటానని సంకేతాలు పంపుతున్నారు.

విజయవాడ కేంద్రంగా రాష్ట్ర కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స చేసి మరలా పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉండే ప్రత్యేక సంస్కృతి భిన్నంగా గ్రూపుల్ని కట్టడి చేయడంలో అధిష్టానం కూడా గిడుగు రుద్రరాజుకు భరోసా ఇచ్చింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సహాయ, సహకారాలు అందిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉంటూ ప్రస్తుతానికి కొంత దూరమైన మైనార్టీలు, ఎస్సీలు, బీసీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని భావిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో 13 జిల్లాల మైనార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు.యూసీసీలో అభ్యంతరకరమైన అన్ని అంశాలపై చర్చించారు. ఎస్సీ, బీసీ నేతలతో కూడా నిరంతరం మంతనాలు జరుపుతూ పాత కేడర్ ను మరలా సొంత గూటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బోణీ కొట్టాలని భావిస్తున్నారు.

IPL_Entry_Point