Chandrababu On Jagan : సినిమా హీరోలను సీఎం జగన్ బెదిరించారు
Chandrababu Comments : రాష్ట్రంలో ఆక్వా కల్చర్ అంతా సంక్షోభంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. కానీ పెత్తనం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.
ఆక్వా రంగ సంక్షోభంపై టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో ఇదేం ఖర్మ ఆక్వా రైతాంగానికి పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు(Chandrababu) పాల్గొన్నారు. సదస్సుకు ఆక్వా రైతులు, ఆక్వా రంగం ప్రతినిధులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్ అంతా సంక్షోభంలో ఉందన్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని చెప్పారు. రాష్ట్రాన్ని ఎంతో మంది పరిపాలించారని, ఉన్న వ్యవస్థలను మెరుగుపరిచారని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి కారణంగా ఆక్వారైతుల(aqua farmers)కు ఈ అవస్థలు అని వ్యాఖ్యానించారు.
లాభం చూసుకుంటున్నారు..
'ప్రభుత్వం(Govt) చేసే ప్రతి పనిలో నాకేమి వస్తుంది అని జగన్ ఆలోచిస్తున్నారు. తన డబ్బు, లాభం చూసుకుని జగన్ తన గల్లా పెట్టె కోసమే పని చేస్తున్నారు. మూడున్నరేళ్లలో అన్ని ధరలు పెరిగిపోయాయి. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్(Petrol), డీజిల్ ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వంట గ్యాస్, నిత్యావసరాలు, కరెంట్ చార్జీలు కూడా దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇంటిపన్ను, మరుగుదొడ్డి పన్ను అంటూ రకరకాల పన్నులతో బాధేస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.
మేం ఆక్వాను ప్రొత్సహించాం
టీడీపీ హయాంలో వ్యవసాయంతో పాటు కోస్టల్ ఆంధ్రాలో(Coastal Andhra) ఆక్వాను ప్రోత్సహించామని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో(Rayalaseema) నీళ్లు ఇచ్చి రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నం చేశామని, పట్టిసీమ కట్టడం వెనక రాయలసీమ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి హార్టి కల్చర్ సాగును పెంచామని, ఇప్పుడు హార్టి కల్చర్, ఆక్వా కల్చర్...రెండూ దెబ్బతిన్నాయన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. వ్యవస్థల నాశనమే ఈ రోజు సంక్షోభాలకు కారణమని వ్యాఖ్యానించారు.
ఖర్చులు పెరిగాయి
2014లో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి ఏడాది ఆక్వా రంగంలో పురోగతి సాధించామన్నారు చంద్రబాబు(chandrababu). దేశంలో 60 నుంచి 70 శాతం వాటా మన రాష్ట్ర ఆక్వా సాధించిందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఆక్వా ఖర్చులు రెండు రెట్లు పెరిగాయన్నారు. రైతులపై ఎదురుదాడి చేస్తే సమస్య పరిష్కారం కాదని, చేతకాకపోతే రాజీనామా చేసి జగన్(Jagan) ఇంటికి వెళ్లిపోవాలన్నారు.
ప్రభుత్వం కరెంట్ నిరంతరాయంగా ఇవ్వకపోవడం వల్ల ఎకరానికి డీజిల్ ఖర్చు రూ.70,000 అదనపు భారంగా మారిందని చంద్రబాబు అన్నారు. నాడు నీటి పన్ను 1000 లీటర్లకు రూ.12 ఉండగా నేడు రూ.120 చేశారన్నారు. ఆక్వాలో కీలకమైన అన్ని వ్యవస్థలను నియంత్రించేందుకు సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ తీసుకువచ్చారన్నారు. నాడు ఉన్న చట్టాలతోనే ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.
24 గంటలు కరెంట్ ఇస్తాం
‘ఎక్కడైనా మంత్రుల ఉప సంఘం వల్ల మద్దతు ధర వచ్చిందా? దీనికి మంత్రులు సమాధానం చెప్పాలి. కర్నూలు(Kurnool)లో చిన్న పిల్లల నుంచి అన్ని వర్గాలు రోడ్డుపైకి వచ్చారు. నా రాజకీయ జీవితంలో చూడని స్పందన కర్నూలులో చూశాను. టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ పేరుతో ఆక్వా రైతు(aqua farmers)లను బెదిరిస్తున్నారు. మా అచ్చెన్నాయుడుని కూడా జైల్లో పెట్టారు. కానీ మేం భయపడ్డామా? అధికారంలోకి రాగానే నీటిపన్ను, ఎఎంసి సెస్, టాన్స్ ఫార్మర్ల ధరను పాత రేట్లకే అందేలా చేస్తాం. మీరు సంపద సృష్టించేందుకు సహకరిస్తాం. 24 గంటల పాటూ కరెంట్ ఇస్తాం. జగన్ నీకు ధైర్యం ఉంటే రైతాంగాన్ని ఆదుకో. ఇవన్నీ అమలు చెయ్యగలవా?’ అని చంద్రబాబు అన్నారు.
హీరోలను బెదిరించారు
సినిమా(Cinema) రంగాన్ని బెదిరించడంతో రాష్ట్రంలో థియేటర్లు అన్నీ మూసివేశారని చంద్రబాబు ఆరోపించారు. వారితో చర్చించి విధానాలు రూపొందించాలన్నారు. సినిమా హీరోలను కూడా బెదిరించిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రతి చోటా చర్చ జరగాలన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి మారకపోతే చరిత్ర హీనుడిగా మిగలిపోతాడన్నారు. సీఎంగా నా రికార్డును ఎవరైనా బ్రేక్ చెయ్యగలరా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.