AP BJP : ఏపీ బీజేపీలో కలకలం …. సత్యకుమార్‌ వ్యవహారంపై చర్చ-bjp hi command clarify on ysrcp support in president elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp : ఏపీ బీజేపీలో కలకలం …. సత్యకుమార్‌ వ్యవహారంపై చర్చ

AP BJP : ఏపీ బీజేపీలో కలకలం …. సత్యకుమార్‌ వ్యవహారంపై చర్చ

HT Telugu Desk HT Telugu
Jul 12, 2022 08:05 AM IST

సొంత పార్టీ నాయకుడి వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం ఖండించడంపై ఏపీ బీజేపీలో కలకలం రేగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ మద్దతు కోరలేదన్న బీజేపీ జాతీయ కార్యదర్శి వ్యాఖ్యల్ని బీజేపీ పెద్దలు తప్పు పట్టడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు బిత్తరపోయారు. ఇంతకీ బీజేపీ అధిష్టానం ఆగ్రహానికి కారణాలేమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ఏపీ బీజేపీలో చిచ్చు రేపిన సత్యకుమార్ వ్యవహారం
ఏపీ బీజేపీలో చిచ్చు రేపిన సత్యకుమార్ వ్యవహారం

ద్రౌపది ముర్ముని గెలిపించడం కోసం ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న సత్యకుమార్‌ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో సత్యకుమార్‌ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును బరిలో దింపిన తర్వాత ఆమె అభ్యర్ధిత్వానికి వైసీపీ మద్దతు ప్రకటించింది. వైసీపీ మద్దతును బీజేపీ కోరలేదని బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నట్లు ప్రజల్ని మభ్య పెడుతోందని సత్యకుమార్‌ ఆరోపించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ సహకారాన్ని తమ జాతీయ నాయకత్వం కోరలేదని ప్రకటించారు. కేంద్ర మంత్రులతో కలిసి ఫోటోలు దిగి ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఢిల్లీలో ఓ రకంగా, ఏపీలో మరో రకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు మద్దతు ప్రకటించి రాష్ట్రంలో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హోదాలో సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వ్యవహారంపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందించింది. సత్యకుమార్‌ ఎవరో తమకు తెలియదని ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీమంత్రి పేర్ని నాని కొట్టి పారేశారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పిఎంవోలు పలుమార్లు రాష్ట్రపతి ఎన్నికలపై ముఖ్యమంత్రితో మాట్లాడారని వివరించారు. సత్యకుమార్‌ వ్యాఖ్యల్ని పట్టించుకోవట్లేదని వైసీపీ ప్రకటించినా తెర వెనుక మాత్రం బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ అసంతృప్తితో బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సహకారం కీలకం కావడంతో వివాదాన్ని పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డారు. సత్యకుమార్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ముర్ము అభ్యర్ధిత్వం నుంచి నామినేషన్ దాఖలు వరకు వైఎస్సార్సీపీకి సమాచారాన్ని అందించినట్లు షెకావత్ స్పష్టం చేశారు. సత్యకుమార్‌ వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ సత్యకుమార్….

బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ కొన్నేళ్ల క్రితం వరకు ఎవరికి పెద్దగా తెలియదు. రాజకీయ వర్గాలు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్ట్ సర్కిల్స్‌లో మాత్రమే సత్యకుమార్‌ గురించి తెలుసు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ అనుబంధం ఉంది. అధికార వర్గాలకు సైతం సత్యకుమార్ శక్తి సామర్ధ్యాలు బాగా తెలుసు. వెంకయ్య నాయుడి దగ్గర చాలా కాలం పనిచేయడంతో పాటు దగ్గరి బంధుత్వం కూడా ఉందని చెబుతారు. మహారాష్ట్రకు చెందిన సత్యకుమార్ కుటుంబం చాలా కాలం క్రితం కడపలో స్థిరపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్‌ బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ఆంధ్రాలో సాగింది.

ఏబీవీపీ విద్యార్ధి విభాగంలో చురుగ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఐదు భాషల్లో అనర్ఘళంగా మాట్లాడే సామర్ధ్యం ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడతారు. వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఎదగడం ప్రారంభించాక సత్యకుమార్‌ ఆయనకు ఆంతరంగికుడు అయ్యారు. ఢిల్లీలో ఏ పనైనా చక్కబెట్టగలిగిన సామర్ధ్యం ఆయన సొంతమని ఎరిగిన వారు చెబుతారు. వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాలకు దూరమైన తర్వాత సత్యకుమార్ స్వీయ అస్తిత్వాన్ని వెదుక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు.

వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి పదవి నుంచి ఉపరాష్ట్రపతిగా మారిన తర్వాత సత్యకుమార్‌ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఓఎస్డీ అయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఐఏఎస్‌ క్యాడర్ అధికారులు మాత్రమే ఆ పదవుల్లో ఉండేందుకు అర్హులు కావడంతో సత్యకుమార్‌ ఆ పదవిలో చేరలేకపోయారు. వెంకయ్యనాయుడు కూడా అధికారానికి దూరం కావడంతో సత్యకుమార్‌ పార్టీలో ఎదిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

స్వల్ప ప్రయత్నాల తర్వాత ఆయన బీజేపీలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో ఆ‍యనకు మంచి అవకాశాలే దక్కాయి. జాతీయ స్థాయిలో మీడియాలో చర్చల్లో కనిపించే సత్యకుమార్‌ తరచూ పత్రికల్లో పార్టీ తరపున వ్యాసాలు కూడా రాస్తుంటారు. పార్టీలో చేరిన తర్వాత పలు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో ఆయనకు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. వాటిని విజయవంతంగా నిర్వర్తించారు. అయా రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల వెనుక సత్యకుమార్‌ పాత్ర ఉందనే ప్రచారం కూడా బాగానే జరిగింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో సత్యకుమార్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తరచూ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము అభ్యర్ధిత్వానికి వైసీపీ మద్దతు కోరలేదనే సత్య కుమార్ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటనే చర్చ బాగా జరుగుతోంది. మరోవైపు ఏపీలో ఉన్న బీజేపీ నాయకుల్లో రెండు మూడు వర్గాలుగా చీలిపోవడం కూడా తెరపైకి వచ్చింది. టీడీపీ అనుకూల వర్గం, వైసీపీ అనుకూల వర్గం, ఒరిజినల్ బీజేపీ అభిమానులుగా ఆ పార్టీ నేతల్లో గ్రూపులు ఉన్నాయి.

బీజేపీని బలోపేతం చేయడం కంటే ఈ గ్రూపులు ఎవరి ఆసక్తులకు అనుగుణంగా అవి పనిచేస్తాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోడానికి ఏ చిన్న సందర్భం వచ్చినా విడిచిపెట్టవు. సత్యకుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్‌ అవ్వడానికి ఆ పార్టీ నేతల ఫిర్యాదులు కూడా కారణంగా తెలుస్తోంది. అయితే సుదీర్ఘ కాలం బీజేపీ నేతలతో దగ్గర సంబంధాలు ఉండటం, అన్ని స్థాయిల్లో నాయకులతో ఉన్న సంబంధాల సత్యకుమార్‌ వంటి నాయకుడికి ఇలాంటి సమస్యల నుంచి బయటపడటం పెద్ద సమస్య కాదని కూడా చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్