AP BJP group politics: ఆంధ్రా బీజేపీలో గ్రూపు గొడవలు.. అధిష్టానానికి ఫిర్యాదులు
AP BJP group politics: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో గ్రూపు గొడవలు తారా స్థాయికి చేరాయి. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తుంటే ఆ పార్టీలో కొందరు నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
AP BJP group politics: ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా ఎదగాలని బీజేపీ ఎప్పటి నుంచో భావిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రాలో బీజేపీ ఒక్క నియోజక వర్గంలో కూడా సొంతంగా గెలిచే పరిస్థితి లేకపోవడంపై ఆ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఏపీలో బీజేపీ పాగా వేయడానికంటే ముందు పార్టీలో ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి ఆ పార్టీ అగ్రనేతలు ఎప్పుడో వచ్చారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా మార్పులు, సంస్కరణలు అమలు చేస్తున్నారు. పార్టీలో ఉంటూ పార్టీని బలపడకుండా చేస్తున్న వారిపై కన్నేసి ఉంచుతున్నారు. ఈ పరిణామాలన్ని బీజేపీ నేతలకు తెలిసినవే అయినా ఇటీవలి కాలంలో బీజేపీ పెద్దల ఆదేశాలకు భిన్నంగా సాగుతున్న కొందరి వైఖరిపై ఇతర నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో బీజేపీని బలోపేతం చేయడంపైనే బీజేపీ పెద్దలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఏ రాజకీయ పార్టీతోను పొత్తు పెట్టుకోకూడదని ఆ పార్టీ తాజాగా నిర్ణయించుకుంది. నిజానికి 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే అది ఏ స్థాయిలో ఉందో ఎవరికి తెలీదు. జనసేన, బీజేపీ కలిసి చేపట్టిన కార్యక్రమాలు కూడా లేవు. బీజేపీ నేతలు తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూనే, ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకూడదని పవన్ కళ్యాణ్ కండిషన్లు పెట్టడం బీజేపీకి రుచించడం లేదు. అదే సమయంలో వేచి చూసే ధోరణని బీజేపీ అవలంబిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున జనసేన మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాతే స్పందించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
మరోవైపు బీజేపీ-టీడీపీల మధ్య సయోధ్య కుదిర్చే పనిని కొందరు నేతలు భుజానికెత్తుకోవడంతో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా బీజేపీలో పావులు కదుపుతున్న వారి వ్యవహారశైలి ఇటీవల పార్టీలో చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పోరుబాట పట్టింది. ప్రతి నియోజక వర్గంలో సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పోరుబాట పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు నాయకులు మాత్రం ఏపీలో బీజేపీ తరపున రాయబార రాజకీయాలు నడపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ లైన్‌కు భిన్నంగా సాగుతున్న తీరుపై ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర పార్టీ నేతలు, బాధ్యులు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. అధికార, విపక్షాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తుంటే కొందరు నాయకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దీని వల్ల పార్టీకి మూడున్నర దశాబ్దాలుగా జరిగిన నష్టమే మళ్లీ జరుగుతుందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ ఏపీలో ఎదగకపోవడానికి ఏ పొరపాట్లు కారణమయ్యాయో మళ్లీ అవే పొరపాట్లను చేసేలా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ నాయకులు గత వారం ఢిల్లీ నేతలకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడకుండా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు నేతల స్వీయ ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని దీనిని చక్కదిద్దాల్సిందిగా పార్టీ పెద్దలకు విన్నవించారు. రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని రాష్ట్ర బిజేపి నాయకులు ఢిల్లీ పెద్దలకు వివరించారు.
బీజేపీ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. కొంతమంది నాయకులు తమ స్థాయికి మించి వ్యాఖ్యలు చేయడం, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, రాష్ట్ర నాయకత్వానికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా సొంత అజెండా అమలు చేస్తున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు, అవగాహనలు కుదుర్చుకోవడం వెనుక వారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని పార్టీ అధిష్టానానికి చెబుతున్నారు. దీనిపై పార్టీ అగ్రనాయకత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వారికి బదులుగా ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన వారు విధాన పరమైన నిర్ణయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనేది ఏపీ బీజేపీ నాయకుల ప్రధాన ఫిర్యాదుగా ఉంది.