Facial Recognition : అటెండెన్స్ కష్టాలు… ఉపాధ్యాయులకు ఊరట-andhra pradesh govt solves facial recognition attendance issue of teachers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Facial Recognition : అటెండెన్స్ కష్టాలు… ఉపాధ్యాయులకు ఊరట

Facial Recognition : అటెండెన్స్ కష్టాలు… ఉపాధ్యాయులకు ఊరట

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 09:36 AM IST

ఏపీలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌ కష్టాలను పరిష్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్‌తో అటెండెన్స్‌ నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తప్పదని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల అభ్యంతరాల నేపథ్యంలొ మొబైల్ అప్లికేషన్‌లో కొన్ని మార్పులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం (Amritanshu/HT Tech)

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం తీసుకువచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్‍లో పాఠశాల విద్యాశాఖ మార్పులను తీసుకువచ్చింది. టీచర్ల హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో యాప్‌లో కొన్ని మార్పులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

గతంలో ఉదయం 9 గంటల తర్వాత ఫేస్ యాప్‍లో అటెండెన్స్ నమోదు చేయడానికి అవకాశం లేదు. ప్రస్తుతం పది నిమిషాలు ఆలస్యమైనా అటెండెన్స్ నమోదు చేసుకోడానికి అవకాశం కల్పించారు. ఇంటర్‍నెట్ లేకపోయినా ఆఫ్‌ లైన్‌లో హాజరు నమోదు చేసుకునే వీలు కల్పించారు. మొబైల్ నెట్‌వర్క్‌ లేదా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల అటెండెన్స్‌ సింక్రనైజ్ అవుతుంది. టీచర్లలో ఎవరికైనా ఆండ్రాయిడ్‌ ఫోన్ లేకపోతే హెచ్‍ఎం ఫోన్‍లో అటెండెన్స్ నమోదు చేసే అవకాశం కల్పించారు. నెలాఖరు వరకు పైలెట్ ప్రాజెక్ట్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్‌ను పరిశీలించి ఆ తర్వాత అవసరమైతే మరిన్ని మార్పులు చేస్తారు. నెలాఖరులోగా ‍ అప్లికేషన్‌ను అందరూ డౌన్‍లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

వచ్చే నెల 1 నుంచి ఫేస్ యాప్ ద్వారానే టీచర్ల అటెండెన్స్ నమోదు చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. ఏపీలో ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్‌ నమోదు చేస్తున్నారు. ఇటీవల ఫేసియల్ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా దశల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలో ఈ విధానం తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఉపాధ్యాయులు, యూనియన్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం స్వల్ప మార్పులకు అనుమతించింది. ఒక్క నిమిషం ఆలశ్యం నిబంధనను సవరించి పది నిమిషాల మినహాయింపు ఇచ్చింది. ఎవరి ఫోన్‌ నుంచి ఎవరైనా అటెండెన్స్‌ నమోదు చేసుకోడానికి అవకాశం కల్పించారు.

దీంతో పాటు సెలవులు దరఖాస్తు చేసుకోడానిక ఓ మాడ్యూల్ అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. సెలవు మాడ్యూల్‌లో డిప్యూటేషన్, ట్రైనింగ్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ఆగష్టు 25న కొత్త మాడ్యూల్ విడుదల చేస్తారు. హెడ్మాస్టర్లు, టీచర్లు ఏకీకృత మొబైల్ అప్లికేషన్‌ను ఫోన్లలో అటెండెన్స్‌ నమోదు చేయడం తప్పనిసరి చేశారు. కొత్త విధానంలో ఉపాధ్యాయుల అటెండెన్స్ నేరుగా ట్రెజరీలకు చేరుతుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఫేషియల్ అటెండెన్స్‌ తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

IPL_Entry_Point

టాపిక్