Gold In Old Suitcase: ఆర్టీసీ బస్సులో పాత సూట్‌కేస్.. బయట పారేద్దామని తెరిస్తే…-an old suit case in an rtc bus when opened driver found gold ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gold In Old Suitcase: ఆర్టీసీ బస్సులో పాత సూట్‌కేస్.. బయట పారేద్దామని తెరిస్తే…

Gold In Old Suitcase: ఆర్టీసీ బస్సులో పాత సూట్‌కేస్.. బయట పారేద్దామని తెరిస్తే…

Sarath chandra.B HT Telugu
Oct 13, 2023 08:12 AM IST

Gold In Old Suitcase: ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన పాత సూట్‌కేసులో కళ్లు చెదిరే బంగారం బయటపడింది. బేల్దారి పనుల కోసం తెలంగాణ వెళుతున్న ప్రయాణికుడు మర్చిపోయిన సూట్‌కేస్‌ చివరకు డ్రైవర్ నిజాయితీతో క్షేమంగా చేరాల్సిన చోటుకు చేరింది.

నగల సూట్‌కేసును అప్పగిస్తున్న అద్దంకి డిపో సిబ్బంది
నగల సూట్‌కేసును అప్పగిస్తున్న అద్దంకి డిపో సిబ్బంది

Gold In Old Suitcase: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు వదిలేసిన సూట్‌కేసులో లక్షల విలువైన బంగారం ప్రత్యక్షమవ్వడం చూసి సిబ్బంది ఖంగుతిన్న ఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగింది. అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లు బేల్దారి మేస్త్రీగా పనిచేస్తూ తెలంగాణలోని కొత్తగూడెంలో నివాసంముంటున్నారు.

yearly horoscope entry point

మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చారు. బుధవారం ఉదయం తిరిగి కొత్తగూడెం బయల్దేరారు. అద్దంకి నుంచి విజయవాడకు ప్రయాణించిన వెంకటేశ్వర్లు తన చేతిలోని సూట్‌కేసును బస్సులోనే మరిచిపోయి, దిగి వెళ్లిపోయారు. విజయవాడ నుంచి అదే రోజు సాయంత్రం ఆర్టీసీ బస్సు అద్దంకి డిపోకు చేరింది.

డిపోలో అప్పగించే ముందు బస్సులో ఉన్న సూట్‌కేసును డ్రైవర్ ఎంఆర్‌ఎస్‌.రెడ్డి గుర్తించారు. పాత సూట్‌ కేసు కావడంతో చెత్తలో పడేద్దామని భావించాడు. దాని కోసం ఎవరైనా రావొచ్చనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఆర్టీసీ గ్యారేజిలో సెక్యూరిటీకి అప్పగించారు. వారి సమక్షంలో సూట్‌కేస్ తెరిచి చూస్తే అందులో బంగారు, వెండి ఆభరణాలు, విలువైన పత్రాలు ఉన్నాయి. పాతసూట్‌కేసులో నగలు ఉండటంతో అంతా షాక్ అయ్యారు.

అందులో ఉన్న నగలు సుమారు రూ.ఐదు లక్షల విలువైనవిగా అంచనా వేసిన సిబ్బంది విషయాన్ని డిపో మేనేజరు దృష్టికి తీసుకెళ్లారు.సూట్‌కేసులో ఉన్న ఆభరణాలతో పాటు రసీదులు పరిశీలించి బాధితుడికి సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు విజయవాడ నుంచి కొత్తగూడం చేరుకున్నారు. సూట్‌కేసు బస్సులోనే వదిలేసిన సంగతిని ఆర్టీసీ సిబ్బంది వివరించడంతో బాధితుడు కలవకూరులో నివసించే సోదరిని ఆర్టీసీ డిపోకు పంపించారు.

ఆభరణాల సూట్‌కేసుతో పాటు అందులో ఇతర వస్తువుల్ని ఆమెకు అప్పగించారు. నిజాయతీగా సూట్‌కేసును అప్పగించిన ఆర్టీసీ బస్సు చోదకుడు ఎంఆర్‌ఎస్‌.రెడ్డిని సిబ్బంది ప్రశంసించారు. ఆర్టీసీ డ్రైవర్‌ నిజాయితీని ఉన్నతాధికారులకు రివార్డు కోసం సిఫార్సు చేస్తామని డిపో అధికారులు తెలిపారు.

Whats_app_banner