Amaravati Protest : అమరావతి రాజధాని కోసం మహా పాదయాత్ర…-amaravati farmers second phase protest walk will starts soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Protest : అమరావతి రాజధాని కోసం మహా పాదయాత్ర…

Amaravati Protest : అమరావతి రాజధాని కోసం మహా పాదయాత్ర…

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 12:47 PM IST

రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతుల ఐక్య కార్యచరణ సమితి రెండో విడత మహా పాదయాత్రకు సిద్ధమవుతోంది.

మరోమారు పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు
మరోమారు పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు

అమరావతి రాజధాని సాధన కోసం రెండో విడత మహా పాదయాత్ర షెడ్యూల్‌ను అమరావతి రైతుల ఐకాస విడుదల చేసింది. సెప్టెంబర్​ 12 నాటికి రైతుల ఆందోళనలు వెయ్యి రోజులకు చేరుకోనున్న నేపథ్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు రాజధాని రైతులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఓ విడత తిరుపతికి పాదయాత్ర చేసిన రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

60 రోజులపాటు సాగే పాదయాత్రలో ప్రతి 8 రోజులకోసారి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.రాజధాని వికేంద్రీకరణను ప్రకటించిన తర్వాత గత 1000 రోజులుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై రాజధాని రైతుల పోరాటం కొనసాగిస్తున్నారు. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా, ఎన్ని చీవాట్లు పెట్టినా మళ్లీ ఏదో ఒక రూపంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తోందని రాజధాని ఐకాస ఆరోపిస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, రాజధాని ప్రజలు తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం సెప్టెంబరు 12కి వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.

తుళ్లూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర-2 మొత్తం 60రోజులు పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఐకాస నాయకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగనుంది. ప్రతి ఎనిమిది రోజులకోసారి యాత్రకు విరామాన్ని ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుంది.

యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. యాత్ర సమయంలో ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్, బయోటాయ్​లెట్ల వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్