AIIMS Road: మంగళగిరి ఎయిమ్స్ రోడ్డులో సాధారణ వాహనాలు రాకపోకలపై నిషేధం, సెలవు రోజుల్లోరోడ్డు పూర్తిగా మూసివేత
AIIMS Road: మంగళగిరి ఎయిమ్స్ మీదుగా సాధారణ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి నుంచి మంగళగిరి వైపు వెళ్లే వాహనాలు షార్ట్‌కట్ మార్గంగా వినియోగిస్తుండటంతో ఎయిమ్స్ ప్రాంగణంలో రద్దీ పెరుగుతోంది. దీంతో సాాధారణ వాహనాలను ఎయిమ్స్ మార్గంలో అనుమతించకూడదని నిర్ణయించారు.
AIIMS Road: మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ ప్రాంగణంలో ఉన్న రహదారిలో సాధారణ ప్రజల రాకపోకల్ని నిషేధిస్తూ ఎయిమ్స్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దాదాపు ఐదేళ్లుగా మంగళగిరిలో ఎయిమ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 3వేలకు పైగా ఔట్ పేషెంట్ సేవల్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఎయిమ్స్‌కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సాయంత్రం ఆరు తర్వాత వాహనాల రాకపోకల్ని పశ్చిమ ద్వారం వైపు నిలిపివేయనున్నారు.
చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై కొలనుకొండ-మంగళగిరి మధ్య ఉన్న డీజీపీ కార్యాలయం, ఏపీఎస్పీ ప్రాంగణం వెనుక నుంచి ఎయిమ్స్‌కు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి కొండకు అవతలి వైపు ఊరు విస్తరించి ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా వచ్చే వారు విజయవాడ -చెన్నై పాత గ్రాండ్ ట్రంక్ మార్గంలో కూడా ఎయిమ్స్‌కు చేరుకోవచ్చు. మంగళగిరి నుంచి విజయవాడ వచ్చే మార్గంలో మంగళగిరి శివార్లలో ఎయిమ్స్ పశ్చిమ ద్వారం ఉంటుంది. దానికి సమీపంలోనే వైద్యులు, సిబ్బంది క్వార్టర్లు, విద్యార్ధుల వసతి గృహాలు ఉంటాయి.
ఎయిమ్స్ సేవలు చాలా కాలం క్రితమే ప్రారంభమైనా రోడ్డు నిర్మాణం మాత్రం బాగా జాప్యం జరిగింది. ఏపీఎస్పీ వెనుక నుంచి కొండల్ని తొలచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో జాతీయ రహదారి నుంచి మంగళగిరి వైపు ప్రయాణించడానికి దగ్గర మార్గం ఏర్పడింది. సర్వీస్ ఆటోలు మొదలుకుని, కార్లు, ద్విచక్ర వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిపోయింది. దీంతో వాటి రాకపోకలపై ఎయిమ్స్ అధికారులు ఆంక్షలు విధించారు.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ AIIMS, మంగళగిరి క్యాంపస్ ఆవరణలోని రోడ్లలో NH 16 (విజయవాడ -గుంటూరు) నుంచి NH 544F మంగళగిరి - విజయవాడ మధ్య ఉన్న హైవేలకు రాకపోకల కోసం ఉపయోగించరాదని ఎయిమ్స్ స్పష్టం చేసింది.
AIIMS లో వైద్య చికిత్స పొందని సాధారణ ప్రజానీకం, ప్రయాణికులు ఈ మార్గాన్ని వ్యక్తిగత పనుల కోసం వినయోగించకూడాదని ప్రకటించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. AIIMS ప్రాంగణంలోని రోడ్లు నియంత్రిత జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ మార్గాలను అధ్యాపకులు, ఆసుపత్రి పరిపాలన సిబ్బంది, విద్యార్థులు మరియు రోగులకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 14 నుంచి మూసివేత…
భద్రతా కారణాల దృష్ట్యా AllMS క్యాంపస్ వెస్ట్ గేట్‌ను సెప్టెంబర్ 14 శనివారం నుండి నిత్యం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేస్తారు. ఆదివారాలు, ప్రభుత్వ గెజిటెడ్ సెలవు రోజుల్లో ఆ గేటును పూర్తిగా మూసివేయనున్నారు. రోగులతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ కేసులకు AIIMS క్యాంపస్ తూర్పు ద్వారం 24 గంటలు తెరిచి ఉంచనున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటించారు.