తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో: ఆకాశాన అసని తెచ్చిన అద్భుతం

వీడియో: ఆకాశాన అసని తెచ్చిన అద్భుతం

11 May 2022, 15:55 IST

  • అసని తుపాను కారణంగా మచిలీపట్నం తీరంలో కనిపించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సముద్ర తీరంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుంటూ వస్తుండడం వీడియో కంటికి చిక్కింది. బుధవారం మధ్యాహ్నం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నుంచి బలహీనపడి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసని మరికొద్ది గంటల్లో అంతర్వేది సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. సాయంత్రానికి అసని తుఫాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని, యానాం సమీపంలోని సముద్రంలోకి మళ్లుతుందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్నా, ఈరోజు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 1 సెం.మీ నుంచి 6.5 సెం.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రాణనష్టాన్ని అరికట్టడంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.