తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  August 11 Telugu News Updates: చీకోటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోండి.. హైకోర్టు
తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

August 11 Telugu News Updates: చీకోటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోండి.. హైకోర్టు

11 August 2022, 17:22 IST

  • August 11 Telugu News Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్స్ సంక్షిప్తంగా ఎప్పటికప్పుడు మీకోసం..

11 August 2022, 17:19 IST

చీకోటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోండి.. హైకోర్టు

ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలని చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలని హైకోర్టు పేర్కొంది. దరఖాస్తును వారంలోపు పరిగణనలోకి తీసుకోని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి తెలిపింది. ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలని చీకోటి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ విచారణలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయట పెట్టినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని చీకోటి ప్రవీణ్ అన్నారు.

11 August 2022, 17:12 IST

విజయమ్మకు తప్పిన ప్రమాదం

సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా కర్నూలు సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయమ్మ వేరే వాహనంలో వెళ్లారు.

11 August 2022, 14:47 IST

ఏఐసీసీ కార్యదర్శులకు లోక్ సభల వారీగా పని విభజన

ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జవీద్, రోహిత్ చౌదరీకి లోక్ సభల వారీగా పని విభజన చేశారు. ఈ మేరకు చేసిన ఏఐసీసీ ఇన్ఛార్జి మనిక్కమ్ ఠాగూర్ ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్సీ బోసు రాజుకు నల్గొండ, భువనగరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్ చేవెళ్ల బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే నదీమ్ జవీద్ కు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, జహీరబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ బాధ్యతలు ఇచ్చారు. రోహిత్ చౌదరికి కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ అప్పజెప్పారు.

11 August 2022, 13:22 IST

రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడతారనే భరోసా భావన రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని సిఎం కేసీఆర్ అన్నారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సీఎం పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

11 August 2022, 13:17 IST

నాగార్జునసాగర్ గేట్లు తెరిచిన అధికారులు

శ్రీశైలం నుంచి 4.30 లక్షల క్యూసెక్కుల భారీ వరద నీరు రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

11 August 2022, 13:13 IST

ఆత్మహత్యాయత్నం చేసిన కుమార్ మృతి

రెండు రోజుల క్రితం వరంగల్లులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుమార్ ఈ ఉదయం నిమ్స్‌లో మృతి చెందాడు. దొంగతనం ఆరోపణలతో పోలీసులు హింసించారని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసుల హింస తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నందున తమ కుటుంబానికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

11 August 2022, 12:30 IST

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం

భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సేవలు అందించారు.

11 August 2022, 11:07 IST

మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు తుది దశకు చేరుకుంది. కసరత్తు కోసం గాంధీ భవన్‌లో నేడు పీసీసీ నేతలు సమావేశం కానున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చెరకు సుధాకర్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించనున్నారు. అయితే చెరకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పైనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసమ్మతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరకు సుధాకర్ అభ్యర్థిత్వం పరిశీలించడం మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది.

11 August 2022, 9:14 IST

Andhra updates: నేడు జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ. 694 కోట్ల మేర విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నేడు పంపిణీ చేయనున్నారు.

<p>ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకం నిధుల పంపిణీ.. అక్కడే బహిరంగ సభలో మాట్లాడనున్న ముఖ్యమంత్రి</p>
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకం నిధుల పంపిణీ.. అక్కడే బహిరంగ సభలో మాట్లాడనున్న ముఖ్యమంత్రి (HT_PRINT)

11 August 2022, 9:10 IST

మునుగోడు అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న అంశంపై అధికార టీఆర్ఎస్ సర్వే జరిపించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలలో ఎవరైతే బాగుంటుందన్న అంశంపై సర్వే జరపగా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు జనం మొగ్గినట్టు సమాచారం.

11 August 2022, 9:08 IST

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే అధిష్టానం మొగ్గు

మునుగోడు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి రాగం తీస్తున్న నేతలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. పార్టీ టికెట్ ఆశావహులతో అధిష్టానం నేరుగా చర్చలు జరిపే అవకాశం ఉంది.

11 August 2022, 9:03 IST

weather alert: రెండు రోజుల పాటు వర్షాలు

రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే 40నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైతం రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.

11 August 2022, 8:46 IST

కళాశాలలకు ర్యాంకింగ్ ఇవ్వనున్న ఉన్నత విద్యామండలి

తెలంగాణలో కళాశాలలకు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యనిర్వాహక మండలి సమావేశంలో నిర్ణయించింది. జాతీయస్తాయిలో ఇస్తున్న ర్యాంకుల తరహాలో కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇవ్వనున్నట్టు తెలిపింది.

11 August 2022, 8:41 IST

మునుగోడు బరిలో దిగేందుకు పార్టీల కసరత్తు

మునుగోడు ఉప ఎన్నికకు పార్టీలు భారీ కసరత్తు చేస్తున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో టీఆర్ఎస్ పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. అలాగే మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో చావో రేవో అన్నరీతిలో కాంగ్రెస్ కదనరంగంలో దూకుతోంది. ఇక మునుగోడు గెలిస్తే తెలంగాణ ఎన్నికల్లో గెలుపు సులభమని బీజేపీ సర్వశక్తులు ఒడ్డనుంది.

11 August 2022, 8:30 IST

వజ్రోత్సవాల ప్రత్యేక సమావేశాలు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా తెలంగాణ మంత్రి మండలి చర్చించనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది.

11 August 2022, 8:29 IST

మరిన్ని భూముల అమ్మకం

సంక్షేమ పథకాల అమలు, విస్తరణ కోసం తెలంగాణ కేబినెట్ నేడు నిధుల సమీకరణ లక్ష్యంగా చర్చించనుంది. హౌజింగ్ బోర్డుల పరిధిలో ఉన్న భూములు, ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు అమ్మడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనుంది. ఇటీవలే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో కొన్ని లేఅవుట్లలో అమ్మకాలు చేపట్టి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది.

11 August 2022, 8:27 IST

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం నేడు జరగనుంది. ఇంకో ఏడాది పైచిలుకు కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ఉన్న పథకాల విస్తరణకు నిధులు అవసరం. ఈ నిధుల సమీకరణకు తెలంగాణలో ఉన్న వనరుల వినియోగం ఎలా అన్న అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి