తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jana Garjana Sabha Live Updates: కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ జన గర్జన సభ
తెలంగాణ కాంగ్రెస్ జన గర్జన సభ

Jana Garjana Sabha Live Updates: కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

02 July 2023, 18:31 IST

  • Khammam Jana Garjana Sabha Live Updates: ఆదివారం సాయంత్రం ఖమ్మం వేదికగా భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టారు. ఇందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇక పొంగులేటి, జూపల్లితో పాటు పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

02 July 2023, 18:31 IST

కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ... పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, మువ్వ విజయ్ బాబు, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పలువురు నేతలు హస్తం పార్టీలో చేరారు.

02 July 2023, 18:01 IST

ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరైన రాహుల్ గాంధీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ పాల్గొన్నారు.

 

02 July 2023, 17:55 IST

గన్నవరం చేరుకున్న రాహుల్ గాంధీ, కాసేపట్లో ఖమ్మం సభకు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ లో ఖమ్మం జనగర్జన సభకు బయలుదేరివెళ్లారు రాహుల్ గాంధీ.

02 July 2023, 16:26 IST

కాంగ్రెస్ సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ జనగర్జన సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని మండిపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు శనివారం రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారని, బస్సులను ఖమ్మంలోకి రాకుండా సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సభలకు ఆర్టీసీ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వస్తుంటే ఆ వాహనాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సభ నిర్వహిస్తామన్నారు. ఏదైనా జరిగితే ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే బాధ్యత అని కోమటిరెడ్డి హెచ్చరించారు.

 

 

02 July 2023, 16:34 IST

రేణుక చౌదరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు, బారికేడ్లు నెట్టుకుని వెళ్లిపోయిన రేణుక

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. దీంతో ఆమె బారికేడ్లను తోసుకుని ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రేణుక చౌదరి మాట్లాడుతూ... పోలీసులు బారికేడ్లు పెడితే నేను అగుతానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం వస్తుండడంతో కేసీఆర్ కు భయంపట్టుకుందని విమర్శించారు.

02 July 2023, 14:59 IST

కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం- ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే, బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఖమ్మం సభకు ప్రజలు, కార్యకర్తలు హాజరుకాకుండా చెక్ పోస్ట్ లు పెట్టి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హేయమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం ప్రవరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని కాంగ్రెస్ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

02 July 2023, 14:35 IST

పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం, డీజీపీకి ఫిర్యాదు

ఖమ్మం సభకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై డీజీపీ అంజనీ కుమార్‌కు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్‌ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్‌ రెడ్డి కోరారు. అయితే సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోవద్దని ఆదేశాలిస్తామని కాంగ్రెస్ నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు.

02 July 2023, 13:06 IST

బ్లూ ప్రింట్ సిద్ధమైంది…

"3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈరోజు ఖమ్మంలో మా 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు CLP నాయకుడు భట్టి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. పలువురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి మా బ్లూప్రింట్ సిద్ధమైంది" అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ చేశారు.

02 July 2023, 13:05 IST

1800 వాహనాలు సీజ్ - పొంగులేటి

"సభను ఫెయిల్ చేయాలని తాపత్రాయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. బస్సులు ఇవ్వకున్నా ఖమ్మం జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు సభకు రానున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా రాకుండా సీజ్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. 15 వేల వాహనాల్లో జనం రాబోతున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. పరిసర ప్రాంతాల్లో జిల్లాల్లో కూడా మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లను పెట్టారు. వాహనాలను సీజ్ చేస్తూ... వాహనదారులను భయభ్రాంతులను చేసే పనిలో పడ్డారు. 1800 వాహనాలను సీజ్ చేశారని సమాచారం ఉంది" అని పొంగులేటి అన్నారు.

02 July 2023, 12:29 IST

రేవంత్ రెడ్డి ట్వీట్

“నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

02 July 2023, 11:23 IST

కంటతడి

ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు ప్రజలు రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని పొంగులేటి ఆరోపించారు. ఇప్పటికే 1700 వాహనాలకు పైగా సీజ్ చేశారని అన్నారు. ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కంటతడి పెట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

02 July 2023, 11:11 IST

 హస్తం శ్రేణుల జోష్

ఖమ్మం నగరమంతా కూడా కాంగ్రెస్ జెండాలతో దర్శనమిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు.. ఖమ్మం వైపు బయల్దేరుతున్నాయి. 

02 July 2023, 10:26 IST

పొంగులేటి ఫైర్ 

కాంగ్రెస్ సభకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తావా కేసీఆర్? అని పొంగులేటి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా? అని ఫైర్ అయ్యారు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం అవుతుందన్నారు.

02 July 2023, 10:26 IST

సర్వంసిద్ధం…

కాంగ్రెస్ జనగర్జన సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. 

02 July 2023, 9:34 IST

భట్టి పాదయాత్ర..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర జూలై 2తో ముగియనుంది. అదిలాబాద్‌ జిల్లాలో మొదలైన ఈ పాదయాత్ర 17 జిల్లాలు, 36 నియోజక వర్గాలు, 1360 కిలోమీటర్లు చుట్టివచ్చి ఖమ్మం చేరుకోనుంది. ఇందులో భాగంగా జనగర్జన సభను తలపెట్టారు. ఈ సందర్భంగా భట్టిని అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సన్మానించనున్నారు.

02 July 2023, 9:30 IST

ఎన్నికల శంఖారావం….

ప్పటికే ఆపరేషన్ ఆకర్షన్ తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా... ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

02 July 2023, 9:29 IST

రాహుల్ షెడ్యూల్…

ఖమ్మం సభలో పాల్గొనేందుకు పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తారు. తర్వాత హెలికాప్టర్ ఎక్కి.. ఖమ్మం సభకు వస్తారు. సభా ప్రాంగణంలోనే హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.

02 July 2023, 9:29 IST

పార్టీలో చేరనున్న పొంగులేటి…

ఇక మాజీ ఎంపీ పొంగులేటి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు. ఖమ్మం సభకు 5 లక్షల మందిని తరలించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వీరిలో 2 లక్షల మంది కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. కుర్చీలు, గ్యాలరీలు ఉన్నాయి. అందరికీ కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక శనివారం రాత్రి ఖమ్మంలో భారీ వర్షం కురిసింది.

02 July 2023, 9:29 IST

భారీ ఏర్పాట్లు…

ఖమ్మం మొత్తం కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు, కటౌట్లతో కళకళలాడుతోంది. సిటీలోని SR గార్డెన్స్ వెనక ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్లేస్‌లో ఈ సభను జరుపుతున్నారు. పాదయాత్రగా వస్తున్న మల్లు భట్టి విక్రమార్కను ఇదే వేదికగా రాహుల్ గాంధీ సన్మాంచనున్నారు. 

02 July 2023, 9:30 IST

ఖమ్మం వేదికగా భారీ సభ

ఆదివారం సాయంత్రం ఖమ్మం వేదికగా భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టారు. ఇందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇక పొంగులేటి, జూపల్లితో పాటు పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి