తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Polling Live Updates : ప్రశాంతంగా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్

Munugodu Polling Live Updates : ప్రశాంతంగా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్

03 November 2022, 22:57 IST

  • మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మరోవైపు నవంబర్ 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. పోలింగ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఈ పేజీని ఫాలో అవ్వండి..

03 November 2022, 22:56 IST

మునుగోడు పోలింగ్

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతంగా పోలింగ్ నమోదైంది. 1,44,878 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 77.55గా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు 92.5 శాతంగా పోలింగ్ నమోదైంది.

03 November 2022, 22:56 IST

కొనసాగుతున్న పోలింగ్

మునుగోడులోని 13 కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకూ 86 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి టోకెన్లు అందించారు. వారినే ఓట్లు వేసేందుకు అనుమతి ఇచ్చారు.

03 November 2022, 22:56 IST

మునుగోడు ఉపఎన్నిక వేళ పలుచోట్ల ఉద్రిక్తతలు

మునుగోడు ఉపఎన్నిక వేళ పలుచోట్ల ఉద్రిక్తతలు జరిగాయి. మర్రిగూడ మండలంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులు ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన స్థానికేతరులు కొందరిని బయటకు లాక్కొని రావడంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం నడిచింది.

03 November 2022, 22:56 IST

ముగిసిన పోలింగ్ సమయం.. ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు

సాయంత్రం 6 గంటల పూర్తికావడంతో మునుగోడులో పోలింగ్ సమయం ముగిసింది. కొత్తగా పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించట్లేదు. ఇప్పటికీ ఓటు వేసేందుకు క్యూ లైన్లలో బారులు తీరిన వారికి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఉంది.

03 November 2022, 22:56 IST

పోలింగ్ బహిష్కరించిన ఆ గ్రామస్థులు

గట్టుప్పల్ మండలం రంగంతండాలో పోలింగ్ ను బహిష్కరించారు గ్రామస్థులు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలదని ఆరోపించారు. స్పష్టమైన హామీ ఇస్తే.. ఓటు వేస్తామని చెప్పారు.

03 November 2022, 22:56 IST

సీనియర్ జర్నలిస్టు కేఎల్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కె.ఎల్.రెడ్డి, జర్నలిస్టుగా నిరాడంబర జీవితాన్ని గడిపారు. పత్రికా రంగానికి అందించిన నిస్వార్థ సేవలను, సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు బంధు మిత్రులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

03 November 2022, 22:56 IST

ఎన్నికల అధికారిని కలిసిన టీఆర్ఎస్ నేతలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. మునుగోడులో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. కలిసిన వారిలో బడుగుల లింగయ్య, దాసోజు శ్రవణ్, రమేశ్ రెడ్డి ఉన్నారు.

03 November 2022, 22:56 IST

3 గంటల వరకు 59.92 శాతంగా పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.92 శాతంగా పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 1,44,878 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

03 November 2022, 13:33 IST

ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్….

Telangana's Munugode Bypoll Live Updates: మునుగోడులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 298 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నడుస్తోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ... అధికారులు సరిదిద్దారు. పోలింగ్ ప్రక్రియకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారు.ఉదయం పెద్దగా క్యూలైన్‌లు కనిపించకపోయినా.. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బూత్‌ల ముందు భారీ క్యూలైన్‌లు కనిపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదయినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు ఇది మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.

03 November 2022, 12:35 IST

ఈసీకి ఫిర్యాదు 

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ పై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ గెలవలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

03 November 2022, 11:33 IST

ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం

మునుగోడులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్‌ నమోదైంది.  పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. 

03 November 2022, 10:41 IST

నగదు పట్టివేత…

నాంపల్లి మండలంలో భారీగా నగదును పట్టుకున్నారు. కారులో తరలిస్తుండగా మల్లప్పరాజుపల్లిలో రూ. 10 లక్షలు దొరికాయి. మరోవైపు చండూరులోనూ రూ.2 లక్షలు దొరికాయి.

03 November 2022, 10:32 IST

రూ. 2 లక్షలు స్వాధీనం

చండూరులో రూ. 2 లక్షలు దొరికాయి. ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నించే క్రమంలో డబ్బులు వదిలి పారిపోయారు.

03 November 2022, 10:32 IST

ఈవీఎం మొరాయింపు

చండూరు మండలం కొండాపురంలో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎం మొరాయింపుతో అరగంట నుంచి పోలింగ్ ప్రక్రియ ఆగింది.

03 November 2022, 9:51 IST

పోలింగ్ శాతం…

మునుగోడులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరోవైపు ఓటర్లు భారీగా తరలివచ్చారు.

03 November 2022, 8:47 IST

ఈవీఎంలలో సమస్యలు…

మునుగోడులో పోలింగ్ కొనసాగుతోంది. మునుగోడు మండల పరిధిలో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే వెంటనే సిబ్బంది సరి చేసింది. పలు మండలాల్లో పోలింగ్ బాగానే జరుగుతున్నప్పటికీ.. నాంపల్లి మండల పరిధిలో మందకొడిగా సాగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును నారాయణపురం మండల కేంద్రంలో వినియోగించుకున్నారు.

03 November 2022, 8:06 IST

రేసులో ఉన్నది వీరే… 

Munugode By poll Polling : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ కొనసాగుతోంది. 298 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది. నియోజకవర్గవ్యాప్తంగా 2 లక్షల 41 వేల 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేసులో ఉండగా... తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల పోరులో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచారి, 10 మంది ఇతర పార్టీల అభ్యర్థులు, 33 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.

03 November 2022, 7:38 IST

కొనసాగుతున్న పోలింగ్… 

మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మునుగోడులో మొత్తం 2,41,805 ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,21,672.. మహిళలు 1,20,126 ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

03 November 2022, 7:08 IST

పోలింగ్ షురూ… 

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 

03 November 2022, 6:14 IST

సామాజికవర్గాల వారీగా చూస్తే...

ఎస్సీలు- 35,411 (15.6 శాతం), ఓసీలు- 20,290 (8.9 శాతం), ఎస్టీలు- 13,000 (5.7 శాతం), మైనార్టీలు- 8000 (3.5 శాతం), బీసీల వైపు చూసుకుంటే.. గౌడ: 38,000, గొల్ల కురుమ: 35,000, ముదిరాజ్: 34,500, పద్మశాలి: 19,000, వడ్డెర: 8,300, విశ్వబ్రాహ్మణ: 7,800, కుమ్మరి: 7,800

03 November 2022, 6:14 IST

మొత్తం అభ్యర్థులు...

ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు.

ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉన్నారు. ఇందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది, మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు.

అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా.. 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు 32,120 మంది.. 26 నుంచి 30 ఏళ్ల మధ్యలో 28,204 మంది ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది.

03 November 2022, 6:13 IST

సర్వం సిద్ధం

Munugode Bypoll: మునుగోడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఈసీ పర్యవేక్షించనుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి