తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  January 24 Telugu News Updates : కొండగట్టుకు పవన్ కళ్యాణ్… నాచుపల్లిలో మీటింగ్
కొండగట్టు ఆలయం వద్ద పవన్ కళ్యాణ్‌
కొండగట్టు ఆలయం వద్ద పవన్ కళ్యాణ్‌

January 24 Telugu News Updates : కొండగట్టుకు పవన్ కళ్యాణ్… నాచుపల్లిలో మీటింగ్

24 January 2023, 19:22 IST

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత కొండగట్టు ఆలయంలో తన ప్రచారం వాహనం వారాహికి పూజలు నిర్వహించి సమీపంలోని రిసార్ట్స్‌లో కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ధర్మపురి లక్ష్మీనారసింహ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.  ధర్మపురి నుంచి పవన్ కళ్యాణ్  నారసింహ యాత్రను చేపడుతున్నారు. 

24 January 2023, 19:22 IST

ఆస్కార్ లో.. ఆర్ఆర్ఆర్...

ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత దక్కించుకుంది. చిత్రంలోని పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఇదే పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

24 January 2023, 19:18 IST

షర్మిలతో పొంగులేటి భేటీ..

జనవరి 28 నుంచి ప్రజా ప్రస్థానయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గతంలో పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో.. తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతామని స్పష్టం చేశారు. తన యాత్రను ఆపి కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారని... ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ పాదయాత్ర కేసీఆర్ పాలిట అంతిమ యాత్రగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు... బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సుమారు గంట పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా... పార్టీలో చేరాలని వైఎస్ షర్మిల... పొంగులేటిని ఆహ్వానించినట్లు సమాచారం.

24 January 2023, 17:06 IST

తెలంగాణలో పోటీ చేస్తాం : పవన్

తెలంగాణ లో 25 నుంచి 40 అసెంబ్లీ... 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని... కానీ మద్దతు మాత్రం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పాలన బాగుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరని.. రెండింటినీ పోల్చి చూడలేమని చెప్పారు. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నాచుపల్లిలో జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశం పాల్గొన్న పవన్... తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని చెప్పారు.

24 January 2023, 16:57 IST

హైదరాబాద్ సీబీఐ…

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించిన దస్త్రాలు.. హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు చేరాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఫైళ్లు చేరాయి. 3 పెట్టెల్లో సీబీఐ కోర్టుకు ఛార్జ్‌షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను అధికారులు తరలించారు. కడప కోర్టులో ఐదుగురు నిందితులపై సీబీఐ 2 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుని తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి.. విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది.

24 January 2023, 16:52 IST

పొత్తులపై .. పవన్

కొండగట్టు సాక్షిగా ఏపీలో పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. పొత్తులపై మూడు ఆప్షన్స్ వెల్లడించిన ఆయన... ఎన్నికల ముందు స్పష్టత వస్తుందని... స్పష్టం చేశారు. ఇప్పటికే తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని.. మున్ముందు కూడా ఉంటామని తెలిపారు. ఒకే వేళ వారు కాదంటే ఒంటరిగా వెళ్తామని చెప్పారు. కొత్త పొత్తుల కోసం ముందుకు వచ్చే పార్టీతో కలిసి వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమని పవన్ పునరుద్ఘాటించారు. ఇందుకోసం అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానన్న జనసేనాని... వైఎస్సార్సీపీ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధించారు.

24 January 2023, 16:51 IST

తీర్పు రిజర్వ్..

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ అంశంలో పిటిషనర్లు, ప్రభుత్వం తరపున వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం... తీర్పుని రిజర్వ్ చేసింది. జీవో నంబర్ వన్ ను సవాలు చేస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయగా.. వాటిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ముందుగా ఆయా పార్టీల తరపున న్యాయవాదులు ప్రభుత్వ ఉత్తర్వులపై తమ అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం... ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. వీటికి సమాధానంగా... పార్టీల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అందరి వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.

24 January 2023, 12:53 IST

నారా లోకేష్ పాదయాత్రకు షరతులు

టీడీపీ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు 29 షరతులు విధించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలీసుల నిబంధనలను తిరస్కరించిన టీడీపీ,  ఇన్ని నిబంధనలతో పాదయాత్ర సాగడం కష్టమంటోంది.  ఏది ఏమైనా పాదయాత్రకు సిద్దమని, పోలీసుల షరతులకు తలొగ్గేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

24 January 2023, 12:43 IST

ఓబుళాపురం కేసు నుంచి తొలగించండి

తెలంగాణ హై కోర్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిటిషన్ వేశారు.  ఓబుళాపురం గనుల కేసు నుంచి తనను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు.  ఓఎంసీ కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ ఇటీవల  సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో  సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో సబిత పిటిషన్ వేశారు.  తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై స్టే విధించాలని కోరారు. 

24 January 2023, 12:16 IST

ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు....

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ధిక్కార స్వరాన్ని వినిపించడంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. మీడియా కథనాలు, వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ కమిటీ నివేదిక మేరకు నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం గవర్నర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీటీవోలు ప్రసాద్, మెహర్ కుమార్‌, సంద్య, గడ్డం ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

24 January 2023, 11:59 IST

శామీర్‌పేటలో కాల్పుల కలకలం

మేడ్చల్ జిల్లా శామీర్‍పేటలో అర్ధరాత్రి కాల్పులు  కలకలం రేపాయి.   ఓ వైన్‍షాపు దగ్గర గాల్లోకి దుండగుల కాల్పులు  జరిపారు.  మూడు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు,  వైన్‍షాపు యజమానిని గన్‍లతో బెదిరించి రూ.2 లక్షలు దోపిడీ చేశారు. మూడు చింతలపల్లి మండలం ఉద్దమర్రిలో ఘటన జరిగింది. 

24 January 2023, 11:57 IST

పాదయాత్రకు రంగం సిద్ధం….

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.  27 వ తేదీ ఉదయం 11.03కి  పాదయాత్రలో  తొలి అడుగు వేయనున్నారు.  రేపు హైదరాబాద్‍లోని ఎన్టీఆర్ ఘాట్‍లో నివాళులర్పించనున్న నారా లోకేశ్ , రేపు  సాయంత్రం  కడపలో దర్గా, చర్చ్ లకు వెళ్లనున్నారు.  ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  శ్రీవారి దర్శనం అనంతరం కుప్పంకు వెళ్తారు.  26న మధ్యాహ్నానానికి కుప్పం చేరుకోనున్నారు.  కుప్పం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు  యువగళం పాదయాత్ర సాగనుంది. 

24 January 2023, 11:54 IST

విద్యార్ధినుల అదృశ్యం

నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు.  గురుకుల పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థినులు  అదృశ్యమయ్యారు.   విద్యార్థినులు జ్యోతి, నాగమణి, అంకిత మాయం కావడంతో  పాఠశాల సిబ్బంది పీఎస్‍లో ఫిర్యాదు చేశారు.

24 January 2023, 11:53 IST

కన్నా గైర్హాజరు…

బీజేపీ కార్యవర్గ భేటీలకు కన్నా లక్ష్మీనారాయణ హాజరవుతారని భావిస్తున్నానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.  కన్నాతో హైకమాండ్ మాట్లాడుతోందని,  ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.  విశాఖ వస్తే నారా లోకేష్ ను తానే కలుస్తానని,  వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని పవన్ అంటున్నారని, బీజేపీ అభిప్రాయం కూడా అదేనని విష్ణుకుమార్ రాజు చెప్పారు. 

24 January 2023, 11:52 IST

గడువు తక్కువగా ఉండటంతో రాలేనని చెప్పా….

సీబీఐ నోటీసులపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రమ్మంటే ఎలా అని,  షెడ్యూల్ ప్రకారం నాలుగైదు రోజులు కార్యక్రమాలున్నాయన్నారు.  పులివెందుల నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని,  ముందస్తు నిర్ణయించిన  కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశానని చెప్పారు. తన లేఖపై సీబీఐ అధికారులు మళ్లీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నందున  తదుపరి నోటీసు తీసుకుని విచారణకు హాజరవుతా అన్నారు.  వివేకా హత్య కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి