తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మంగళగౌరీ వ్రతం ఎవరు తప్పక ఆచరించాలి? వ్రత కథ తెలుసుకోండి

మంగళగౌరీ వ్రతం ఎవరు తప్పక ఆచరించాలి? వ్రత కథ తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

18 August 2023, 10:02 IST

    • శావణమాసంలో మంగళవారం వ్రతంగా జరుపుకోవడం ఆచారం. పార్వతీ దేవికి మరోపేరు మంగళగౌరి. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి.
మంగళ గౌరీ వ్రతం ఎవరు చేయాలి?
మంగళ గౌరీ వ్రతం ఎవరు చేయాలి? (pixabay)

మంగళ గౌరీ వ్రతం ఎవరు చేయాలి?

మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా?.. పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోను, ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోను కొలువై ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూటవిషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్టు పార్వతీదేవి వైపు చూశాడు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదలను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము ఉంచి లోకవినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్నితన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

మంగళగౌరీ వ్రత దీక్ష ఫలితం ఏంటి?

అట్టి కరుణాంతర మూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళస్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి, ఐదు సంవత్సరాలు దీక్ష ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలు శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పెద్దలు చెబుతున్నారు.

మొదట శౌనకాది మహామునులకు మంగళగౌరి మహాత్యాన్ని సూతులవారు వివరించారు. నారదమహర్షి ఈ వ్రత మహాత్యాన్ని సావిత్రీదేవికి ఉపదేశించారు. శ్రీ కృష్ణుడు వ్రత విధానాన్ని, వ్రత మహాత్యాన్ని ద్రౌపదికి వివరించాడు. ఇక్కడ శ్రీ కృష్ణుల వారు ద్రౌపదికి బోధించిన కథావిధానము ఈ విధముగా ఉన్నది. ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించేముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు. అందువలనే ఆయన విజయాన్ని అందుకోగలిగారు. మంగళగౌరిని పూజించడం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశానికి చెందిన 'మండు” అనే మహారాజు గౌరీదేవి వ్రత ప్రభావముతో చాలాకాలం సర్వసంపదలతో రాజ్యాన్ని వలగలిగాడు.

మంగళ గౌరీ వ్రత కథ

'ఓ ద్రౌపదీ! గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న ఓ అదృష్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను” అంటూ శ్రీ కృష్ణుల వారు ఇలా చెప్పసాగారు.

వ్రతకథ: చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం? ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరకు పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయటద్వారం వద్ద నిలబడి 'భవతీ భిక్షాందేహి” అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

జయపాలుని భార్య పళ్ళెంలో సంభారాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. జరిగినదంతా ఆమె భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటిరోజు సన్యాసి రావడం, మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది.

ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక “సంతానము లేని నీ చేతి భిక్షను స్వీకరించనని” పలికేసరికి.. “అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి” అని వేడుకోగా, ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు “అమ్మా! నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలవస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో ఎక్కడ అతని నీలాశ్వం అలసటతో క్రిందపడుతుందో అక్కడ త్రవ్వమను. ఆ త్రవ్వకములో ఒక స్వర్ణ దేవాలయము బయటపడుతుంది. ఆ స్వర్ణదేవాలయములో ఉండే అమ్మవారిని శ్రద్దాభక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది” అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు.

ఈ విషయమంతా ఆమె భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు వైధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి ఆ రాజును ఇక్కడ గణపతి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమైంది.

జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది. “ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్బం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుగర్రవాడికి వయసు వచ్చింది. వివాహము జరిగితే కుమారుడి ఆయుష్షు పెరుగుతుందేమో అని భావించి కుమారుడుకి వివాహము చేద్దామని భర్తతో అన్నది.

కాశీవిశ్వేశ్వరుడిని దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి జయపాలుడు తన కుమారుడుని మేనమామతో కాశీకి పంపించాడు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోనికి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మ గారు మంగళగౌరీవ్రతం చేస్తారు. కాబట్టి మాకుటుంబంలో ఎవరూ వితంతువులు ఉండరు అని కోపంతో అన్నది. జయపాలుడి కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్బాయుష్ముడని అతని మేనమామకు తెలుసు. సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీ దేవి అనుగ్రహము లభించి పరిపూర్ణ ఆయుష్ముడు అవుతాదని భావిస్తాడు.

అతను ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు మీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా చాటుగా అంటాడు. దాంతో సుశీల, శివుడుల వివాహము జరిగిపోతుంది. పెళ్ళయిన ఆ కొత్తదంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువ రూపంలో సుశీల కలలో కనబడి “నీభర్త అల్బాయుష్ముడు. ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషము నివారించేందుకు ఒక మార్గము చెబుతాను విను. కొద్దిసేపట్లో ఒక కృష్ణసర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడా పాము కుండలో ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతోనీ భర్తకు ఆ గండము తప్పిపోతుంది” అని చెప్పి అంతర్దానమయ్యెను.

శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరుగుప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకు వెళతాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళగౌరీ వ్రత ప్రభావము అని చెప్పినది. శ్రావణమాసం రాగానే మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది సుశీల. పిదప భర్తతో కలసి అత్తవారింటికి వచ్చింది. అక్కడ ఆమెకు అందరూ సగౌరవంగా ఆదరించారు. నా కుమారుడిని ఎలా రక్షించావమ్మా అని శివుడి తల్లి సుశీలను అడిగింది. మీ అబ్బాయిని మంగళగౌరీదేవి కాపాడింది అని సమాధానమిచ్చింది సుశీల. అందరూ దేవిని స్తుతించారు.

ఇహలోకంలో సమస్త సుఖాలు అనుభవించిన తర్వాత పరలోకంలో శ్రీపురానికి చేరుకున్నారు శివుడు సుశీల దంపతులు. ఈ విషయముగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పెను. మనమందరం కూడా ఈ వ్రతాలను ఆచరించి సంతోషంగా గడుపుదాం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం