తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం.. అన్నవరం ఆలయ విశిష్టత తెలుసుకోండి

శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం.. అన్నవరం ఆలయ విశిష్టత తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

17 August 2023, 10:52 IST

    • శ్రావణ మాసంలో చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. భక్తులు ఎక్కువగా అన్నవరం ఆలయంలో ఈ వ్రతం ఆచరిస్తారు. ఈనేపథ్యంలో ఆలయ విశిష్టతను ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం
అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం

అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం

కలియుగంలో ప్రతీ మానవుడికి జీవితములో కష్టసుఖములు రెండూ కలుగుతాయి. కష్టములు కలిగాయని క్రుంగిపోకుండా, సుఖములు కలిగాయని పొంగిపోకూడదు. రెండిటిని సమానంగా చూస్తూ భగవంతుడు అనేటువంటి శక్తిని నమ్మి కష్టనష్టములన్నీ ఆయన యొక్క ఆజ్ఞానుసారమే కలుగుతున్నాయి. దీనిని గ్రహించి ప్రతీ మానవుడు అధ్యాత్మిక చింతనతో మోక్ష సాధన కోసం భగవత్‌ తత్త్వము అలవర్చుకొనుట కోసం జీవితాన్ని కొనసాగించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మానవ జీవితంలో ఎదురయ్యేటు వంటి కష్టములకు, ప్రశ్నలకు సమాధానం సత్యనారాయణ స్వామి వ్రతములో మనకు దొరుకుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం వలన అనుకున్న పనులు కచ్చితముగా నెరవేరతాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారికి జాతకములో ఉన్న కష్టములు తొలగి సుఖ సంతోషములు కలుగుతాయని చిలకమర్తి పంచాంగకర్తగా నేను నా పాఠకులకు తెలియచేస్తున్నాను. శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించేముందు భక్తులు అన్నవరం ఆలయ మహత్యం కూడా తెలుసుకోవాలి.

నూతనంగా వివాహం అయినవారు, గృహారంభ, గృహ ప్రవేశం వంటి నూతన కార్యక్రమములు ఆచరించినవారు సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించి నట్లయితే వారికి శుభములు కలుగుతాయని పెద్దలు తెలియచేశారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. శ్రీ సత్యదేవస్వామి కీర్తి, గొప్పతనాన్ని స్కాందపురాణం యొక్క రేవాఖండములో వర్ణించారు. శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు మరియు శివుడు మరొకవైపు కలిగి ఉన్నారు. అన్ని దివ్యక్షేత్రాలవలే అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి వారు వెలసిన కొండను తాకుతూ పంపానది ప్రవహిస్తోంది.

స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తున్నారు. కావున ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు, శివ భక్తులు, వేలాది మంది యాత్రికులు స్వామి వారిని దర్భించుకుంటున్నారని చిలకమర్తి తెలిపారు.

అన్నవరం ఆలయ చరిత్ర

స్థలపురాణం ప్రకారం పర్వత శ్రేష్థులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్పకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామరాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామారాయణం వారికీ ఏకకాలంలో కలలో కనపడి “రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్టించి సేవించుము” అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖర నామ సంవత్సర శ్రావణ శుక్ష పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామి వారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతిమహా వైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891లో ప్రతిష్టించారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

స్వామి వారి పీఠం పంచాయతనంలో అలంకరించబడి ఉండటంవలన స్వామి వారి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. నాలుగు చక్రాలు కలిగిన రథం వలే ప్రధాన ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం సుమారు 18 అడుగుల ఎత్తులో స్థూపాకారంలో ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం మరియు కళ్యాణ మండపం ఎడమవైపున ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి.

ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం నాలుగు మూలల నాలుగు చక్రాలుతో ఒక రథ రూపంలో నిర్మించారు. ప్రధాన అలయం ముందు కళ్యాణ మండపం అత్యాధునిక శైలిలో నిర్మించారు, ఆ దారిలో వెళ్తున్న కొద్దీ రామాలయం చూడవచ్చును. అలాగే ముందుకి వెళ్తే గొప్పగా ఆరాధించే వన దుర్గ విగ్రహాన్ని చూడవచ్చు, ఆ వన దుర్గ ఈ నాటికీ ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటున్నట్టు చెప్పుకుంటారని చిలకమర్తి తెలిపారు.

ఆలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. క్రింది అంతస్థులో యంత్రం మరియు స్వామి వారి పీఠం ఉంటుంది. యంత్రం నాలుగు వైపులా నలుగురు దేవతలు గణపతి, సూర్యనారాయణస్వామి, బాలా త్రిపురసుందరి మరియు మహేశ్వరస్వామి పంచాయతనం కలిగి ఉన్నది. ఒకటవ అంతస్థులో సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్‌ మధ్యలో ఉంది. శ్రీ అనంత లక్ష్మి అమ్మవారు కుడివైపున మరియు శివుడు ఎడమ వైపున ఉన్నారు. విగ్రహాలు అన్నీ అందంగా, బంగారు కవచములతో అలంకరింపబడి ఉన్నాయి. శ్రీ రాముడు శ్రీ సత్యదేవ స్వామికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు. శ్రీ సత్యనారాయణ వ్రతం భారతదేశం అంతటా భరక్తులందరు సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం చేస్తారు.

శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో (బ్రహ్మ, విష్ణు, శివ) అన్నవరం వద్ద రత్నగిరి కొండల మీద ఉన్నారు. ఈ క్షేత్రాన్ని, స్వామి వారిని దర్శించుకోవడానికి యాత్రికులు వందల వేల సంఖ్యలో వస్తున్నారు. సగటున రోజుకు ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు. ఏకాదశి తిథి వ్రతములకు చాలా పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది. వ్యక్తిగతంగా భక్తులు కూడా ఇతర సౌకర్యవంతంగా ఉన్న రోజుల్లో వచ్చి వ్రతాలు నిర్వహించుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం