తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

Haritha Chappa HT Telugu

10 May 2024, 7:00 IST

    • West Nile Fever: వెస్ట్ నైల్ వైరస్ ఇప్పుడు మనదేశంలో వ్యాపిస్తోంది. కేరళలో ఎంతో మంది ఈ జ్వరం బారిన పడుతున్నారు. ఈ జ్వరం… ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది ప్రాణాంతక నాడీ సమస్యలకు దారితీస్తుంది. 
వెస్ట్ నైల్ ఫీవర్
వెస్ట్ నైల్ ఫీవర్

వెస్ట్ నైల్ ఫీవర్

మనదేశంలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కేరళలోని మూడు జిల్లాలైన మలప్పురం, కోజికోడ్, త్రిస్సూర్ లలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు కనీసం పది మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. వెస్ట్ నైల్ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే ఫ్లావి వైరస్. ఇది ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.

వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి?

వెస్ట్ నైల్ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే ఫ్లావి వైరస్. ఇది మనుషుల్లోనే కాదు, పక్షులలో కూడా ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా, ఉత్తర అమెరికాలో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది కేరళతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ జ్వరం కనిపిస్తోంది.

వైరస్ సోకిన దోమ మనుషులను కరవడం ద్వారా ఇతర మనుషులకు వ్యాపిస్తుంది. కేరళలో సాధారణంగా కనిపించే క్యూలెక్స్ దోమలు రాష్ట్రంలో వెస్ట్ నైల్ వైరస్ ను విపరీతంగా వ్యాపించేలా చేస్తున్నాయి . వెస్ట్ నైల్ వైరస్ సోకిన చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా దోమ కాటు తరువాత 2 నుండి 14 రోజుల్లో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వెస్ట్ నైల్ జ్వరం అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఈ వైరస్ తీవ్రమైన, ప్రాణాంతక నాడీ సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ జ్వరం బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

వెస్ట్ నైల్ జ్వరం లక్షణాలు

వెస్ట్ నైల్ వైరస్ సోకిన తరువాత జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అరుదైన సందర్భాల్లో వెస్ట్ నైల్ వైరస్ సంక్రమణ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న పొరల వాపు) లేదా ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) వంటి తీవ్రమైన నాడీ అనారోగ్యానికి దారితీస్తుంది.

చికిత్స ఎలా?

వెస్ట్ నైల్ వైరస్ సంక్రమణ ఆపడానికి వ్యాక్సిన్ లేదా చికిత్స లేదు. ఆరుబయట ఉన్నప్పుడు పొడవాటి చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి. ముఖ్యంగా దోమలు ఎక్కువగా చురుకుగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం జాగ్రత్తగా ఉండాలి. టైర్లు, బకెట్లు, పూల కుండీలు, ఇతర కంటైనర్లలో నీరు నిలవ లేకుండా జాగ్రత్త పడాలి. వెస్ట్ నైల్ ఫీవర్ సోకిన తరువాత జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. అవసరం మేరకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం