తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Eco-friendly Rakhis: అద్భుతమైన రాఖీలు.. ఇంట్లోనే చేయడానికి ఉత్తమ ఐడియాలు..

DIY eco-friendly rakhis: అద్భుతమైన రాఖీలు.. ఇంట్లోనే చేయడానికి ఉత్తమ ఐడియాలు..

21 August 2023, 16:22 IST

  • DIY eco-friendly rakhi: ఈ రక్షాబంధన్ రోజున మీ సోదరుడికి మీరే సొంతంగా తయారుచేసిన పర్యావరణహిత రాఖీ కట్టొచ్చు. వాటిని ఎలా తయారుచేసుకోవాలో చూడండి. 

పర్యావరణహిత రాఖీల తయారీ మార్గాలు
పర్యావరణహిత రాఖీల తయారీ మార్గాలు (Pinterest)

పర్యావరణహిత రాఖీల తయారీ మార్గాలు

అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధాన్ని వేడుకలా జరుపుకునేదే ఈ రాఖీ పండగ. ఈ రోజు సోదరి, సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. ఈ రాఖీ ఏదో అలా తీసుకొచ్చి కట్టేయరు. వాళ్ల సోదరుడికి నచ్చే రాఖీ ఏదని ఆలోచించి ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. మనసు పెట్టి ఆలోచిస్తారు. అంత ముఖ్యమైన రాఖీని బయట కొనే బదులు ఇంట్లోనే మీరే, మీ చేతులతో తయారు చేసుకుంటే బాగుంటుంది కదూ. అదెలాగో చూసేయండి.

1. క్విల్టెడ్ రాఖీ:

క్విల్టెడ్ రాఖీ

పేపర్ క్విల్లింగ్ గురించి తెలిసే ఉంటుంది. రంగురంగుల కాగితాలు సన్నని స్ట్రిప్స్ లాగా దొరుకుతాయి. వాటితో రకరకాల ఆకారాలు సులువుగా తయారుచేసేయొచ్చు. మీకిష్టమైన ఆకారం ఏదైనా పేపర్ క్విల్లింగ్ చేసి తయారు చేయండి. దానిమీద పూసలు, కుందన్లు, బటన్లతో అలంకరించండి. మంచి రాఖీ సిద్ధమవుతుంది. కాగితంతో కాకుండా వెల్వెట్ వస్త్రంతో కూడా మంచి రాఖీ చేయొచ్చు. ఇష్టమైన ఆకారంలో రెండు సమాన ముక్కలుగా వెల్వెట్ వస్త్రం కట్ చేసుకుని వాటిని ఒకదానిమీద ఒకటి మధ్యలో దూది పెట్టి కుట్టేయాలి. చివరగా పూసలతో అలంకరిస్తే చాలు. మంచి రాఖీ సిద్ధం.

2. పామ్ పామ్ రాఖీ:

పామ్ పామ్ రాఖీ

కాస్త తక్కువ వయసున్న పిల్లల చేతికి పామ్ పామ్ రాఖీ భలేగుంటుంది. దీన్ని 5 నుంచి 10 నిమిషాల్లో తయారుచేసేయొచ్చు. బజార్లో దొరికే రెడీమేడ్ పామ్ పామ్ బాల్స్ వాడొచ్చు. లేదా ఇంట్లోనే ఉన్నితో చేసిన దారాన్ని ఒక అట్ట ముక్కకు చుట్టి పామ్ పామ్ బాల్స్ చేసుకోవచ్చు. బాల్స్ సిద్ధమయ్యాక వాటిని సూదీ దారం సాయంతో ఇష్టమైన రకంగా కుట్టుకుంటూ వెళ్లాలి. చివరగా పూసలతో, డోరీలతో అలంకరించాలి. అంతే.. చాలా ఆకర్షణీయంగా ఉండే రాఖీ సిద్ధం అవుతుంది.

3. రెజిన్ రాఖీ:

రెసిన్ రాఖీ

రెజిన్ తో చేసిన అలంకరణ వస్తువులు, ఆభరణాలు ఇప్పుడు చాలా ట్రెండింగ్. అందుకే రెజిన్ తో రాఖీ చేసి చూడండి. చాలా బాగుటుంది. అయితే చిన్నపిల్లలైతే పెద్దవారి సమక్షంలో చేయడం మర్చిపోవద్దు. ఒక అచ్చు తీసుకుని అందులో ఎండిన పూల రెక్కలు, పూసలు.. ఇంకేవైనా వేసి మీద రెజిన్ పోస్తే చాలు. అది గట్టిపడితే రెజిన్ రాఖీ సిద్దమవుతుంది. అది ఆరాక మీద మంచి గోల్డెన్ పెయింట్ తో పేరు కూడా రాయొచ్చు.

4. ఫొటో రాఖీ:

ఫోటో రాఖీ

మీ సోదరుడు, మీరున్న మంచి ఫొటో ఒకటి పెట్టి రాఖీ చేయొచ్చు. ఫొటో కన్నా మంచి గుర్తు ఏముంటుంది. ఫొటోను చిన్న ఫ్రేములో లేదా లాకెట్ లో పెట్టి దాన్ని రాఖీలాగా మార్చేస్తే చాలు. చివరగా ఫ్రేమును కాస్త సృజనాత్మకత ఉపయోగించి అలంకరించుకుంటే అద్భుతమైన రాఖీ రెడీ అవుతుంది.

5. క్లే రాఖీ:

క్లే రాఖీ

స్టేషనరీ షాపుల్లో దొరికే క్లే తో వీటిని చిన్నపిల్లలయినా సరే తయారుచేయొచ్చు. ఎయిర్ డ్రై క్లే తీసుకుంటే తయారీ సులభం అవుతుంది. క్లే ను ఇష్టమైన ఆకారంలో చేసుకుని ఆరిపోయాక మంచి రంగులతో పెయింటింగ్ వేసుకోవచ్చు. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందీ క్లే రాఖీ. ఇంకేం మీలో సృజనాత్మకతకు పదును పెట్టి ఉత్తమమైన రాఖీ ఇంట్లోనే తయారుచేసేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం