తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Cpi : మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే పువ్వాడపైనైనా చర్యలు - సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

Khammam CPI : మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే పువ్వాడపైనైనా చర్యలు - సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu

24 November 2023, 20:18 IST

google News
    • Telangana Assembly Elections 2023: మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే పువ్వాడపైనైనా చర్యలు ఉంటాయని చెప్పారు  సీపీఐ జాతీయ కాదరర్శి నారాయణ. పొత్తు ధర్మాన్ని పాటించాలని స్పష్టం చేశారు.
సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ

సీపీఐ నారాయణ

Telangana Assembly Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నేపథ్యంలో మిత్ర ధర్మాన్ని విస్మరించేది లేదని, ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ తో పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే వారిపై చర్యలు తప్పవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఇందుకు ఎవరూ అతీతులు కాదని, పుత్ర వ్యామోహంతో మిత్ర ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పువ్వాడ నాగేశ్వరరావు పై సైతం పార్టీపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవన్ లో జరిగిన నియోజక వర్గ స్థాయి సమావేశంలో నారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి అభ్యర్థులను అత్యథిక మెజార్టీతో గెలిపించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్న సిపిఐ ఓట్లు పువ్వాడ తన కుమారుడికి వేయిస్తారన్న చర్చ జోరుగా సాగింది. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వరరావు రహస్యంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు సైతం ఏర్పాటు చేసి తన కుమారుడికి ఓట్లు వేయాలని మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

నియోజకవర్గ కన్వీనర్ ఎస్ కె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మత పరమైన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇదే సమయంలో అవసరమైన ప్రతిసారీ బీజీపీకి వంతపాడుతూ కేసిఆర్ తెలంగాణను పాలిస్తున్నారని దుయ్యబట్టారు. బయటకి వేర్వేరు పార్టీలుగా కనిపించినప్పటికీ బీఆర్ఎస్, బీజెపీ, ఎంఐఎం పార్టీలు ఒకే తాను ముక్కలని నారాయణ వ్యంగ్య ప్రసంగం చేశారు. ఇలాంటి స్థితిలో బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలను ఓడించేందుకు కాంగ్రెస్ తో జట్టు కట్టామని ఆయన తెలిపారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం