తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Assembly Elections 2023 Live Updates : తెలంగాణలో ముగిసిన ఎన్నికల పోలింగ్‌ - డిసెంబరు 3న ఫలితాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Telangana Assembly Elections 2023 Live Updates : తెలంగాణలో ముగిసిన ఎన్నికల పోలింగ్‌ - డిసెంబరు 3న ఫలితాలు

30 November 2023, 22:12 IST

  • Telangana Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

30 November 2023, 22:12 IST

డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు

డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

30 November 2023, 22:07 IST

పోలింగ్ శాతంపై ఈసీ ప్రకటన

పలుచోట్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి వివరాలను రేపు వెల్లడించినున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు.

30 November 2023, 22:06 IST

ఈటల కామెంట్స్…

ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయని అన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రంలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

30 November 2023, 21:32 IST

ఓటు వేసేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్​ - బాలిక మృతి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల కూతురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట సమీపంలో గురువారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామానికి చెందిన బోడకుంట్ల రాంబాబు కుటుంబంతో కలిసి హనుమకొండలోని గుడిబండల్​ ఏరియాలో ఉంటున్నాడు. రాంబాబుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. నగరంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలాఉంటే రాంబాబు అయ్యప్ప భక్తుడు కావడంతో తనతో పాటు తన పెద్ద కూతురు సింధువైష్ణవి(7) కూడా ఇటీవల అయ్యప్ప స్వామి మాలధరించారు.

30 November 2023, 21:09 IST

Telangana Assembly Elections Polliing : రేవంత్ రెడ్డి ట్వీట్

“కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు విజ్ఞప్తి. పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీని డిమాండ్ చేస్తున్నాను” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

30 November 2023, 21:00 IST

Telangana Assembly Elections Polliing : తమ్మినేనికి చుక్కెదురు..

రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు సొంత ఊరిలోనే చుక్కెదురైంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా పోటీలో నిలిచిన తమ్మినేని తన సొంతూరు తెల్దారుపల్లిలో ఓటు వేయలేకపోయారు. గతంలో హైదరాబాద్‌ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకునేవారు. కాగా తమ్మినేని ఇటీవల తన ఓటును సొంతూరు అయిన ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి మార్చుకున్నారు. అయితే ఓటు బదిలీ అయినట్లు భావించిన ఆయన గురువారం పోలింగ్ రోజున ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో పేరు పరిశీలించిన అధికారులు ఓటు వినియోగానికి ఇబ్బందికర పరిస్థితిని గమనించారు. హైదరాబాద్ నుంచి తమ్మినేని ఓటు మార్చుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓటు బదిలీ కానట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులో అడ్రస్‌ మారినప్పటికీ నియోజకవర్గం మారకపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకపోయింది.

30 November 2023, 20:38 IST

ఎగ్జిట్ పోల్స్….

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. అయితే కొన్ని సర్వేలు స్పష్టమైన మెజార్టీని సూచిస్తే… మరికొన్ని సర్వేలు హంగ్ ను సూచించాయి.

30 November 2023, 19:50 IST

Telangana Assembly Elections Polliing :64.05 శాతం పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64.05 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. తుది పోలింగ్ శాతం వివరాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది.

30 November 2023, 19:16 IST

Telangana Assembly Elections Polliing : మెదక్ జిల్లాలో

మెదక్ జిల్లా

1. మెదక్ లో 81.72 శాతం పోలింగ్ నమోదు

2. నర్సాపూర్ లో 78.89 శాతం పోలింగ్ నమోదు

సిద్దిపేట జిల్లా

1. దుబ్బాకలో 82.75 శాతం పోలింగ్ నమోదు

2. సిద్దిపేటలో 73.03 శాతం పోలింగ్ నమోదు

3. గజ్వేల్ లో 76.17 శాతం పోలింగ్ నమోదు

30 November 2023, 19:37 IST

Telangana Assembly Elections: పోలింగ్ వివరాలు

సంగారెడ్డి జిల్లా

1. సంగారెడ్డిలో 70.10 శాతం పోలింగ్ నమోదు

2. పటాన్ చెరులో 69.72 శాతం పోలింగ్ నమోదు

3. ఆందోల్ లో 76.12 శాతం పోలింగ్ నమోదు

4. నారాయణఖేడ్ లో 75.34 శాతం పోలింగ్ నమోదు

5. జహీరాబాద్ లో 79.84 శాతం పోలింగ్ నమోదు

30 November 2023, 19:15 IST

Telangana Elections 2023 Live Updates: అత్యధికంగా పోలింగ్

జనగాం - 83.34%

నర్సంపేట - 83%

నకిరేకల్ - 82.34%

భువనగిరి - 81%

పాలకుర్తి - 81%

జహీరాబాద్ - 79.8%

నర్సాపూర్ - 78.89%

డోర్నకల్ - 79.32%

వైరా - 79.20%

30 November 2023, 18:52 IST

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది - రేవంత్ రెడ్డి

తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ పార్టీకి 25 సీట్లు దాటవని జోస్యంచెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చిందని… కేటీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్టే అని అన్నారు.

30 November 2023, 18:29 IST

70 కిపైగా సీట్లు మావే

తెలంగాణలో తమకు 70కి పైగా సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను తప్పు అని నిరూపిస్తామని చెప్పారు. గతంలో కూడా తమకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చారని చెప్పారు.

30 November 2023, 18:28 IST

కేటీఆర్ కామెంట్స్

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడవద్దన్నారు మంత్రి కేటీఆర్. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

30 November 2023, 17:40 IST

సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్‌

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్‌ నమోదైంది. క్యూలైన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు.

30 November 2023, 17:34 IST

ఎగ్జిట్ పోల్స్ విడుదల

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

30 November 2023, 17:20 IST

టైం ముగిసింది…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు.

30 November 2023, 17:04 IST

ముగిసిన సమయం

ఎన్నికల సంఘం విధించిన పోలింగ్ గడువు ముగిసింది. దీంతో తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసినట్లు అయింది.

30 November 2023, 17:03 IST

దాడి జరగలేదు - రాచకొండ పోలీసులు

ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా భర్త మహేందర్ రెడ్డిపై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు.

30 November 2023, 16:45 IST

ఈ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్…

భద్రాచలం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది.

30 November 2023, 16:46 IST

కాసేపట్లో ముగియనున్న పోలింగ్

మరికాసేపట్లో తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మరోవైపు క్యూలైనల్లో భారీగా ఓటర్లు ఉన్నారు.

30 November 2023, 16:19 IST

ఈ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్..

సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తోంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌.. ఉమ్మడి కరీంనగర్‌లో మంథని.. ఉమ్మడి వరంగల్‌లో భూపాలపల్లి, ములుగు.. ఉమ్మడి ఖమ్మంలో పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు సమస్యాత్మక సెగ్మెంట్లుగా గుర్తించారు.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే పనిలో పడ్డారు అధికారులు.

30 November 2023, 16:05 IST

హైదరాబాద్ లో అత్యల్పంగా పోలింగ్

ముషీరాబాద్‌లో 27.98శాతం, మలక్‌పేట్‌లో 29.16%, అంబర్‌పేట్‌లో 34.3 శాతం పోలింగ్

ఖైరతాబాద్‌లో 37%, జూబ్లీహిల్స్‌లో 35.3 %, సనత్ నగర్‌లో 39 శాతం పోలింగ్.

నాంపల్లిలో 22.7%, కార్వాన్‌లో 32.4%, గోషామహల్‌లో 35 శాతం పోలింగ్

చార్మినార్‌లో 29.83%, చాంద్రాయణగట్ట లో 24.6%, యాకుత్‌పురాలో 20.09%, బహదూర్ పురాలో 30.41%, సికింద్రాబాద్‌లో 36.31 పోలింగ్ శాతం నమోదు

30 November 2023, 16:03 IST

టాప్ ప్లేస్ లో మెదక్

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతం నమోదైట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఉదయం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ… మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇక హైదరాబాద్ లో గతం మాదిరిగానే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అన్ని జిల్లాలో 50 శాతం వరకు పోలింగ్ శాతం నమోదైతే… గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో మాత్రం…. 50 లోపే ఉంది. కేవలం హైదరాబాద్ జిల్లాలో చూస్తే… కేవలం 31.17 శాతం మాత్రమే నమోదైంది.

30 November 2023, 15:47 IST

జిల్లాల వారీగా చూస్తే

మధ్యాహ్నం 3 గంటల వరకు... జిల్లాల వారీగా చూస్తే

ఆదిలాబాద్ - 62.34

భద్రాద్రి - 58

హన్మకొండ - 49

హైదరాబాద్ - 31

జగిత్యాల - 58

జనగాం - 62

30 November 2023, 15:37 IST

మూడు గంటల వరకు 51.89 శాతం ఓటింగ్

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు గంటల వరకు 51.89 శాతం ఓటింగ్ నమోదైంది.

30 November 2023, 15:24 IST

మంత్రిపై కేసు నమోదు

నిర్మల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పై కేసు నమోదైంది. పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లటంతో… ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంత్రిపై కేసు నమోదైంది.

30 November 2023, 15:18 IST

ఆలేరులో ఉద్రిక్తత… రాళ్ల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో మహేందర్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్షికంగా కారు. ధ్వంసమైంది.

30 November 2023, 15:09 IST

పోలింగ్ ప్రక్రియ

మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. ఓటర్లు భారీగా కేంద్రాలకు తరలివస్తున్నారు.

30 November 2023, 14:59 IST

పాతబస్తీలో ప్రశాంతంగా ఓటింగ్

పాతబస్తీ యాకుత్‌పురాలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

30 November 2023, 14:48 IST

2018లో పోలింగ్ శాతం

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఈసారి ఎంత అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ప్రధాన పార్టీలు ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు.

30 November 2023, 14:43 IST

కామారెడ్డిలో పోలింగ్

కామారెడ్డిలో ఓటింగ్ కొన‌సాగుతోంది. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి సోద‌రుడు పోలింగ్ కేంద్రాన్ని సంద‌ర్శించ‌డాన్ని బీఆర్ఎస్ శ్రేణులు త‌ప్పుబ‌ట్టాయి. కొంత ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.అయితే పోలీసులు ఇరు స‌మ‌క్షాల‌కు న‌చ్చజెప్పి అక్క‌డి నుంచి పంపించేశారు. కామారెడ్డిలో 11 గంట‌ల వ‌ర‌కు మొత్తం 24.56 శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది. జుక్క‌ల్‌లో 22.43, ఎల్లారెడ్డి 25.24, కామారెడ్డి 26.02 శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది.

30 November 2023, 14:43 IST

నిజామాబాద్‌లో ఊపందుకున్న పోలింగ్‌

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. పోలీసుల క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌త న‌డుమ ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మ‌య్యింది. అయితే ఉద‌యం నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని కేంద్రాల్లో అరగంట ఆల‌స్యంగా పోలింగ్ ప్రారంభమ‌య్యింది. ఉద‌యం మంద‌కొడిగా ప్రారంభ‌మైన పోలింగ్‌... 12 గంట‌ల నుంచి ఊపందుకుంది. ప్ర‌స్తుతం అన్ని కేంద్రాల్లో ఓట‌ర్లు క్యూలైన్ల‌లో నిల‌బ‌డి ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, విక‌లాంగుల కోసం అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. వీల్‌చైర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్ర‌తి కేంద్రంలో ఆశా కార్య‌క‌ర్త‌ల‌తో మందులు అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ లో ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు ఆర్మూరు(8 శాతం), బోధ‌న్‌(14.29), బాన్సువాడ‌(13.36), నిజామాబాద్ అర్బ‌న్‌(6.82), నిజామాబాద్ రూర‌ల్‌(8.74), బాల్కొండ‌(7.3 శాతం) ఓటింగ్ న‌మోద‌య్యింది. అయితే 11 గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ శాతం పెరిగింది. ఆర్మూరులో 16.74 శాతం, బాల్కొండ 23.10, బాన్సువాడ‌28.51, బోధ‌న్ 24.32, నిజామాబాద్ రూర‌ల్ 22.80, నిజామాబాద్ అర్బ‌న్ 14.65 శాతం ఓటింగ్ జ‌రిగింది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

30 November 2023, 14:41 IST

అత్యధికంగా మెదక్ లో పోలింగ్

మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ 51.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 20.79 శాతం పోలింగ్ నమోదైంది.

30 November 2023, 14:38 IST

నియోజకవర్గాల వారీగా…

మహబూబాబాద్46.89 శాతం

మహబూబ్ నగర్ 44.93 శాతం

రంగారెడ్డి 29.79శాతం, సంగారెడ్డి 42.17 శాతం,

సిద్దిపేట 44.35 శాతం, సూర్యాపేట 44.14 శాతం,

వికారాబాద్ 44.85 శాతం, వనపర్తి 40.40 శాతం, వరంగల్ 37.25 శాతం, యాదద్రి 45.07శాతం

మంచిర్యాల 42.74 శాతం,

మెదక్ 50.80 శాతం, మేడ్చల్ 26.70 శాతం,

ములుగు 45.69 శాతం, నాగర్ కర్నూల్ 39.58 శాతం, నల్గొండ 39.20 శాతం, నారాయణపేట 42.60 శాతం, నిర్మల్ 41.74 శాతం, నిజామాబాద్ 39.66 శాతం, పెద్దపల్లి 44.49 శాతం, సిరిసిల్ల 39.07శాతం పోలింగ్ నమోదైంది.

30 November 2023, 14:36 IST

భాగ్యనగరంలో మంద‌కొడిగా పోలింగ్

హైదరాబాద్ నగరంలో మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదుకాగా… హైద‌రాబాద్‌లో అత్య‌ల్పంగా కేవ‌లం 20.79 శాతం పోలింగ్ మాత్రమే అయింది.

30 November 2023, 14:27 IST

మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం పోలింగ్

తెలంగాణలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతంగా నమోదైంది.

30 November 2023, 14:16 IST

బీఆర్ఎస్ పై ఫిర్యాదు

బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సీఈసీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమిగూడుతున్నారని… బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని తెలిపారు.

30 November 2023, 13:56 IST

నర్సాపూర్‌లో ఉద్రిక్తత

నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ పోలింగ్ నేపథ్యంలో అక్కడిక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు వాహనాలపై కర్రలు రాళ్లతో దాడులు చేయడంతో హింసాత్మక ఘటనలకు దారితీసాయి. గురువారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి చిన్న కుమారుడు శశిధర్ రెడ్డి కౌడిపల్లి మండల పరిధిలోని బిట్ల తండా గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమంలో తండా వాసులు అడ్డుకున్నారు. ఇదే విషయంలో మాట మాట పెరగడంతో ఆగ్రహించిన తండావాసులు శశిధర్ రెడ్డి ఇన్నోవా వాహనం పై రాళ్లతో దాడి చేయడంతో వాహనం ముందు భాగంలోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇదే విషయమై ఆయన కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

30 November 2023, 13:42 IST

ప్రశాంతంగా పోలింగ్

హైదరాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. సినీ తారలు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొంటున్నారు. నటులు రాజేంద్ర ప్రసాద్, కళ్యాణ్ రామ్, శివాజీ రాజా, యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నటుడు రాజేంద్రప్రసాద్ కోరారు. సాయంత్రం 5 గంటలలోగా భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

30 November 2023, 13:33 IST

సాయంత్రం ఐదున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. సాయంత్రం 5.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి ఈసీ అనుమతించింది.

30 November 2023, 13:29 IST

పోలీసులపై మధుయాస్కీ ఆగ్రహం

పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై మధు యాష్కీ ఫైర్ అయ్యారు. పోలింగ్ కేంద్రం బయట కూడా మాట్లాడొద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంపై యాస్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్మెల్యే సపోర్టుతో రెచ్చిపోవద్దంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఎల్బీనగర్ లో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

30 November 2023, 13:26 IST

ఇంకా పోలింగ్ శాతం పెర‌గాలి – సిఇవో

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ కొన‌సాగుతోంది. కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫిర్యాదులను ప‌రిశీలిస్తున్నామ‌ని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అర్బ‌న్ , రూర‌ల్ ప్రాంతాల నుంచి ఓట‌ర్లు భారీ ఎత్తున త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని భావిస్తున్నామ‌న్నారు. రూర‌ల్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగింద‌ని , ఇక అర్బ‌న్ ప్రాంతాల‌లో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

30 November 2023, 13:14 IST

పాతబస్తీలో ఘర్షణ

పాతబస్తీలో ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఎంబీటీ అభ్యర్థి ఖలీద్‍ఖాన్, ఎంఐఎం నేత యాసిర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

30 November 2023, 12:45 IST

ఉద్రిక్తతలపై ఆరా తీసిన ఎన్నికల సంఘం

తెలంగాణ పలు చోట్ల ఉద్రిక్తతలపై ఎలక్షన్ కమిషన్ ఆరా తీసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణలపై డీజీపీతో న సీఈవో వికాస్‍రాజ్ మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డీజీపీకి ఆదేశించారు. ఘర్షణలు అదుపు చేయాలని అధికారులకు సీఈవో ఆదేశించారు.- జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో ఘర్షణలపై సీఈవో వికాస్ రాజ్ ఆరా తీశారు.

30 November 2023, 11:37 IST

21శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11గంటలకు 21శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో 12శాతం పోలింగ్ నమోదైంది. తొలి రెండు గంటల్లో 9శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్‌ 30శాతం, భద్రాద్రిలో 22శాతం పోలింగ్ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో తొలి రెండు గంటల్లో 4శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది.

30 November 2023, 11:36 IST

జనగామలో ఉద్రిక్తత

జనగామలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

30 November 2023, 11:29 IST

ఓటు హక్కు వినియోగించుకున్న నాగార్జున కుటుంబ

అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌లో ప ల్గొనేందుకు సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఓటు హక్కును వినియోగించుకుంది. జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున, అమల, నాగ చైతన్య క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. హీరోలు రానా, సాయి ధరమ్ తేజ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

30 November 2023, 11:18 IST

మధిరలో ప్రశాంతంగా పోలింగ్

మధిరలో 268 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మధిర నియోజక వర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా తరలి వచ్చారు. గత ఎన్నికల్లో 92శాతం పోలింగ్ మధిరలో నమోదు అయ్యింది. ఈ సారి కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి.

30 November 2023, 11:16 IST

కామారెడ్డిలో ఉద్రిక్తత

కామారెడ్డిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పర్యటించడంపై బిఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు.కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపేశారు. మరోవైపు కామారెడ్డిలో ఉదయం 11గంటలకు 17శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 70శాతం పోలింగ్ నమోదైంది.

30 November 2023, 11:07 IST

విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్

అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు రాకపోకలు సాగించే ఓటర్లతో రద్దీగా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ఏర్పడింది. రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

30 November 2023, 11:06 IST

బిఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ వాడుకునే కుట్రలు చేస్తోందన్న బండి సంజయ్

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. టీఆర్‍ఎస్‍ను బీఆర్‍ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చేందుకు కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోందని, ప్రజలు వాటిని నమ్మోద్దని బండి సంజయ్ కోరారు.

30 November 2023, 10:46 IST

ఖానాపూర్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో ఘర్షణ చేటు చేసుకుంది. ఓవైపు పోలింగ్‌ జరుగుతుండగా.. రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. పోలింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పించారు.

30 November 2023, 10:45 IST

గ్రామాలకు తరలి వెళుతున్న ఓటర్లు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వస్థలాలకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు నిండిపోయాయి. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కొద్ది బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండంతో స్థలం సరిపోక.. బస్సులపైకి ఎక్కి స్వస్థలాలకు చేరుకుంటున్నారు.

ఎన్నికల నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో, రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు భారీ తరలివెళ్తున్నారు.

30 November 2023, 9:48 IST

8.38శాతం పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 8.38శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి రెండు గంటల్లో పోలింగ్ సాధారణ పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది.

30 November 2023, 9:46 IST

హైదరాబాదీలు ఓటేయాలన్న కేటీఆర్

ఏ ప్రభుత్వం కావాలో ఆ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యావంతులు, యువత ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని, అంతా ఓటు హక్కు వాడుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు భావోద్వేగాలకు గురి కాకుండా ఓటు హక్కు వాడుకోవాలన్నారు. దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.

30 November 2023, 9:42 IST

ఓటు హక్కు వినియోగించుకున్న బర్రెలక్క

కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష (బర్రెలక్క) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బర్రెలక్క కోరారు.

30 November 2023, 10:54 IST

నిజమాబాద్, ఆదిలాబాద్‌లో ఓటు వేసిన అభ్యర్థులు

నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి తన స్వ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బిజెపి అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్ లో చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మల్ హై స్కూల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు, నేరేడిగోండ మండలం రాజురా గ్రామంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాధవ్, బోధ్ మండలం ఘన్పూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపురావ్.., లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, వేల్పూర్ మండలం వేల్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి , ఆర్మూర్ మామిడిపల్లి హై స్కూల్ లో 37 వ బూత్ లో బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ( 130 పోలింగ్ బూత్ లో ) ముదోల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్, కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం పోలింగ్ బూత్ నంబర్ 93లో ఎమ్మెల్యే అభ్యర్థి డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

30 November 2023, 9:30 IST

కాగజ్‌నగర్‌లో ఓటు వేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం పోలింగ్ బూత్ నంబర్ 93లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థి డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

30 November 2023, 9:18 IST

ఏపీ పోలీసులు వెనక్కి వెళ్లాలి

సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీ పోలీసులు వెనక్కి వెళ్లాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. - విభజన చట్టం ప్రకారం సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ ఆధీనంలో ఉందని, ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఏపీ చర్యలు దురాక్రమణ, దండయాత్రను తరలిస్తున్నాయని, - తెలుగుప్రజల మధ్య ఘర్షణలు సృష్టించొద్దని ఏపీని కోరుతున్నానన్నారు. పోలింగ్ రోజు సెంటిమెంట్ పండించాల్సిన అవసరం బీఆర్‍ఎస్‍కి లేదని, సాగర్ ప్రాజెక్ట్ పై ఏపీకి ఎలాంటి అధికారం లేదన్నారు.

30 November 2023, 9:11 IST

కుట్రల్లో ఓటర్లు చిక్కుకోవద్దన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ఎప్పుడుప్రయత్నించలేదని, కేసీఆర్‌ వెళ్లిపోయే సిఎం అని, ఆయనకు వ్యక్తిగత ఆసక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిసెంబర్ 9న అధికారంలోకి వస్తుందన్నారు. వ్యూహాత్మకంగా చేశారని, సాగర్ ఎక్కడికి పోదని, పోలింగ్‌కు ముందు ఇలాంటి అంశాలను తెర లేపడానికి ఎవరు, ఎందుకు, ఏమి ఆశించి చేస్తున్నారో ప్రజలకు తెలుసు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

30 November 2023, 12:09 IST

గ్యాస్‌ సిలిండర్‌కు పొన్నం పూజలు

హుస్నాబాదులో గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ పూజలు చేవారు. 500 నోట్లతో అలంకరించారు. అలంకరణ తో పూజలు నిర్వహించిన పొన్నం కాంగ్రెస్ వస్తే 500/- కే సిలిండర్ వస్తుందని సందేశం పంపారు.

30 November 2023, 8:45 IST

సాగర్‌ వ్యవహారం పోలీసులు చూసుకుంటారు - సీఈఓ వికాస్ రాజ్

నాగార్జునసాగర్ వివాదంపై తెలంగాణ సీఈవో వికాస్‍రాజ్ స్పందించారు. నాగార్జునసాగర్ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని, ఆందోళన అవసరం లేదన్నారు. రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని, నేతలెవరూ నిబంధనలు అతిక్రమించొద్దని వికాస్ రాజ్ హెచ్చరించారు.

30 November 2023, 12:09 IST

అయ్యప్ప మాలలో పోలింగ్ కేంద్రానికి చిరంజీవిత

జూబ్లిహిల్స్‌లో సినీ నటుడు చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవితో పాటు సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజ జూబ్లిహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయ్యప్ప మాలలో ఉండటంతో మాట్లాడేందుకు చిరంజీవి నిరాకరించారు. పోలింగ్ కేంద్రంలో చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

30 November 2023, 8:30 IST

సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న ఈవిఎంలు

తెలంగాణలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. బోయిన్‍పల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్‍లో ఈవీఎం మొరాయించింది. ధర్మపురిలో 39వ పోలింగ్ బూత్‍లో, ఉప్పల్ చిలుకానగర్ సెయింట్ మార్క్ స్కూల్‍లో, సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, నాగార్జున సాగర్‍లో, జోగులాంబ జిల్లా గద్వాలలో ఎంఏఎల్‍డీ డిగ్రీ కాలేజ్‍లో ఈవీఎం మొరాయించింది. మెదక్ జిల్లా ఎల్లాపూర్‍లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు.

30 November 2023, 10:55 IST

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో హీరో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్‍ఆర్ నగర్‍లో నటుడు ప్రకాష్ రాజ్, జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్‍లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్‍పేట్‍లో డీజీపీ అంజనీకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా నారాయణపురంలో పొంగులేటి - బంజారాహిల్స్ లో ఎమ్మెల్సీ కవిత ఓటు వేశారు.

30 November 2023, 8:00 IST

బారులు తీరిన ఓటర్లు - వికాస్ రాజ్

తెలంగాణ వ్యాప్తంగా ఉత్సాహంగా పోలింగ్ జరుగుతోందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌లో పాల్గొనేందుకు వికాస్ రాజ్ వచ్చారు. అసిపాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సిఈఓ తెలిపారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

30 November 2023, 12:09 IST

ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని, ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని, తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాన్ని విమర‌్శించే ముందు ఓటు హక్కు ముఖ్యమైనదని, ఓటు వేయకుండా ఎవరిని విమర్శించే అవకాశం రాదన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యం ప్రభావంతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలన్నారు. ఎవరికి భయ పడకుండా ఓటు వేయాలన్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం స్పందించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

30 November 2023, 7:39 IST

మొరాయించిన ఈవిఎంలు

రాష్ట్ర వ్యాప్తం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయించడంతో ఓటర్లు ఎదురు చూస్తున్నారు. పటాన్‌చెరు, జూబ్లిహిల్స్‌ సహా పలు ప్రాంతాలలో ఈవిఎంలు మొరాయించడంతో వాటిని సరిచేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

30 November 2023, 12:09 IST

అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి - తుమ్మల

ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా పరిపాలన లేకపోవడం, అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రజలు బాధలకు గురవుతున్నారని తుమ్మల ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

30 November 2023, 7:21 IST

నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

నాగార్జున సాగర్ డ్యామ్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గురువారం అర్థరాత్రి ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్‌ 13వ నంబర్ గేటు వద్ద కంచెలు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు ధ్వంసం చేసి డ్యామ్‌లో సగం భాగంలో హద్దులు ఏర్పాటు చేశారు. సాగర్ నీటి విడుదలపై కొంత కాలంగా ఏపీ తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

30 November 2023, 12:09 IST

ఓటు హక్కును వినియోగించుకోండి… హీరో సుమంత్

ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని హీరో సుమంత్ పిలుపునిచ్చారు. ఓటు వినియోగించుకోవడం ప్రజలందరి బాధ్యత అన్నారు.

30 November 2023, 12:09 IST

సెలవు రోజు కాదు, పోల్ డే - ఎమ్మెల్సీ కవిత

క్షేత్ర స్థాయిలో బిఆర్‌ఎస్‌ బలంగా ఉందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌పై ఓటర్లు అనాసక్తిగా ఉండటం మంచిది కాదన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

30 November 2023, 12:09 IST

కొడంగల్‌లో పోలింగ్ ప్రారంభం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేస్తున్న కొడంగల్‌లో 275పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 112 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లు రువ్వుకోవడంతో అదనపు బలగాలను మొహరించారు.

30 November 2023, 12:09 IST

గుర్తింపు కార్డులుగా వీటిని అనుమతిస్తారు

ఆధార్‌ కార్డు

పాన్‌ కార్డు

బ్యాంకు పాస్‌ బుక్‌

ఉపాధిహామీ జాబ్‌ కార్డు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ , పాస్‌పోర్టు

ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు

యూనిక్‌ డిసెబిలిటీ కార్డు

ఫొటో పెన్షన్‌ డాక్యుమెంట్‌

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రార్‌ జారీ చేసిన కార్డులను ఓటరు గుర్తింపు కార్డులుగా అనుమతిస్తారు.

30 November 2023, 7:03 IST

తెలంగాణలో ఓటర్లు 3.26కోట్లు

రాష్ట్రంలో ఓటర్లు : 3,26,18,205

పురుషులు : 1,63,13,268

మహిళలు : 1,63,02,261

ట్రాన్స్‌జెండర్లు : 2,676

సర్వీస్‌ ఓటర్లు : 15,406

రాష్ట్రంలో నియోజకవర్గాలు : 119

ఎస్సీ నియోజకవర్గాలు : 19

ఎస్టీ నియోజకవర్గాలు : 12

బరిలో ఉన్న అభ్యర్థులు : 2290

బరిలో ఉన్న పురుషులు : 2068

బరిలో ఉన్న మహిళలు : 221

బరిలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు : 01

రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలు : 35,655

సమస్యాత్మక కేంద్రాలు : 12,000

వెబ్‌క్యాస్టింగ్‌ కేంద్రాలు : 27,094

ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు

దివ్యాంగులు నిర్వహించేవి : 120

మహిళలు నిర్వహించేవి : 597

యువత నిర్వహించేవి : 119

మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు : 644

30 November 2023, 12:09 IST

క్యూలో వెయిటింగ్‌ కూడా తెలుసుకోవచ్చు.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 15 నియోజకవర్గ ఓటర్ల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ లైన్ ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. https:// ghmcbls.in/poll-queue-status వెబ్‌సైట్‌ ద్వారా ఎంతమంది వేచి ఉన్నారో ఓటర్లు తెలుసుకోవచ్చు.

30 November 2023, 12:09 IST

ఈవిఎంలతో పోలింగ్

అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీవీప్యాట్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీకి ఓటు వేశారో ఓటరు స్లిప్‌లో ప్రింట్ అవుతుంది. ఏడు సెకండ్ల పాటు ప్రింట్‌ కనిపిస్తుంది. ఎన్నికల కోసం 2.50 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. లక్ష మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నారు.

30 November 2023, 7:02 IST

తెలంగాణలో 3.26కోట్ల ఓటర్లు

తెలంగాణలో 3.26 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.5 లక్షలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. భద్రతా విధుల్లో లక్షమంది పోలీసులు పాల్గొంటున్నారు. తెలంగాణ పోలీసులతో పాటు ఏపీ, చత్తీసగడ్‌, కేంద్ర, పారా మిలిటరీ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.

30 November 2023, 7:01 IST

అక్కడ పోలింగ్ నాలుగింటి వరకే

రాష్ట్రంలోని 13 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

30 November 2023, 7:00 IST

పోలింగ్ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఐదున్నరకే మాక్‌ పోలింగ్ పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదులోపు క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు.

30 November 2023, 12:09 IST

చింతమడకలో కేసీఆర్ ఓటు

సిద్దిపేట జిల్లా చింతమడకలోని 13వ పోలింగ్‌ కేంద్రం లో ఓటు హక్కు వేసేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం ఉదయం గ్రామానికి రానున్నారు. సీఎంఆయన సతీమణి శోభ సైతం ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.

30 November 2023, 12:09 IST

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2290మంది అభ్యర్థులు తమ అదృష్టాన్నిపరీక్షించు కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది పోలీసులతో పాటు రెండున్నర లక్షలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి