తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Elections: పవర్ కోసం పాట్లు..ఇంటిల్లిపాది ప్రచారంలోనే..!

TS Elections: పవర్ కోసం పాట్లు..ఇంటిల్లిపాది ప్రచారంలోనే..!

HT Telugu Desk HT Telugu

20 November 2023, 13:39 IST

    • TS Elections: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఓట్ల పండుగ దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు జనాల వద్దకు పరుగులు తీస్తున్నారు.
పరకాలలో ప్రచారం నిర్వహిస్తున్న చల్లా జ్యోతి
పరకాలలో ప్రచారం నిర్వహిస్తున్న చల్లా జ్యోతి

పరకాలలో ప్రచారం నిర్వహిస్తున్న చల్లా జ్యోతి

TS Elections: తెలంగాణలో మరో 10 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఉన్న కొద్దిసమయంలో అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులు యువజన సంఘాలు, కుల సంఘాలు, వివిధ యూనియన్ల నాయకులతో సమావేశాలతో గ్రామాల్లో ప్రచార సభలు నిర్వహిస్తుంటే.. వారి కుటుంబ సభ్యులు కూడా అభ్యర్థులకు ధీటుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఇంటిల్లి పాది ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

పతుల కోసం సతులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థుల భార్యలు కూడా నిత్యం ప్రచార కార్యక్రమాలతో ఓటర్లను కలుస్తున్నారు. పార్టీ కండువాలతో పాటు ప్రచార కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ తిరుగుతున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి రేవతి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తన భర్తను మరోసారి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

భర్త తరపున ప్రచారం చేస్తున్న రేవతి

కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమా కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ ఈస్ట్ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు భార్య రేణుక కూడా ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. కమలం గుర్తుకు ఓటేయాలంటూ వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్నారు.

భార్యతో కలిసి ప్రచారం చేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు

మరోవైపు పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి దయాకర్రావు సతీమణి ఉషా కూడా నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న తన భర్త గెలుపు కోసం మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భార్య చల్లా జ్యోతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే ఓ వైపు వెళ్తే.. మరోవైపు గ్రామాలను ఆమె చుట్టివస్తున్నారు.

భార్యతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ప్రచారం

భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించాలంటూ ఆయన భార్య, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రంగంలోకి దిగారు. ప్రతి గడపను చుట్టి వస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కమలాపూర్ మండలంలో బీఆరెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి దంపతులు ఇద్దరూ కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తన భర్తను ఎమ్మెల్యే గా గెలిపించాలంటూ కొంగు చాచి మరీ ఓటర్లను అభ్యర్థించారు.

మరో వైపు కుటుంబ సభ్యులు

ఎన్నికల్లో నిలబడిన తమ భర్తల కోసం మహిళలు ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇంకొన్ని చోట్లా కుటుంబ సభ్యులంతా ఇంటింటికీ తిరుగుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశస్వినీ రెడ్డి పోటీ చేస్తుండగా.. అన్నీ ఆమె అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డి చూసుకుంటున్నారు. ప్రచారాల నుంచి చేరికలు, సమావేశాల వరకూ అన్నింట్లోనూ కోడలి వెన్నంటే ఉంటూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.

పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులంతా రోజూ ఉదయాన్ని ప్రచార బాట పడుతున్నారు. ప్రకాశ్ రెడ్డి ఓ వైపు వెళ్తే.. కుటుంబ సభ్యులు ఇంకో వైపు వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ నిలబడగా.. ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెరవెనుక రాజకీయ నడిపిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో రేవూరిప్రకాష్ కుటుంబ సభ్యులు

అదృష్టం వరించేదెవరినో..

ఇప్పటికే ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకోగా.. ప్రధాన పార్టీలో పాటు ఇండిపెండెంట్లు కూడా హోరాహోరీ తలపడుతున్నారు. కాగా అభ్యర్థుల గెలుపు కోసం వారివారి భార్యలు, కుటుంబసభ్యులు ఓటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాల్లో కలిసిపోతూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ వాళ్లను గెలిపించి, పొలిటికల్ పవర్ ను తమ ఇంట్లోకి తీసుకొచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ నెల 30వ తేదీనే ఎలక్షన్లు జరగనుండగా.. కుటుంబ సమేతంగా ప్రచారాలు చేస్తున్న అభ్యర్థుల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే.

(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం