తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Brs: ఖమ్మంలో బిఆర్‌ఎస్‌కు మళ్లీ నిరాశ.. ఈసారి కూడా సింగల్ డిజిట్ విజయమే

Khammam BRS: ఖమ్మంలో బిఆర్‌ఎస్‌కు మళ్లీ నిరాశ.. ఈసారి కూడా సింగల్ డిజిట్ విజయమే

HT Telugu Desk HT Telugu

04 December 2023, 6:46 IST

    • Khammam BRS: కాకతాళీయమో లేక యాదృచ్చికమో తెలియదు గానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ బాస్ కు ఎప్పుడూ చుక్కెదురవుతోంది. గత రెండు పర్యాయాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
భద్రాచలంలో విజయం సాధించిన బిఆర్‌ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు
భద్రాచలంలో విజయం సాధించిన బిఆర్‌ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు

భద్రాచలంలో విజయం సాధించిన బిఆర్‌ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు

Khammam BRS: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఒకే ఒక్క అభ్యర్థిని గెలుచుకుంది. సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకొని ఎన్నికల్లోకి దిగిన గులాబీ బాస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే ఒక్క సీటుకు పరిమితం కావాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు కొత్తగూడెం నుంచి పోటీచేసి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు టీఆర్ఎస్ అధికారం చేపట్టి ఐదేళ్లు పరిపాలించింది. ఆ తర్వాత 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పథకాలు, అభివృద్ధి మంత్రంతో బరిలోకి దిగిన ప్రభుత్వానికి ప్రజలు మళ్లీ పట్టం కట్టారు.

కాగా ఆ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, రెండు స్థానాల్లో టీడిపి, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖమ్మం నుంచి పోటీచేసి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

మళ్లీ ఒక్క స్థానానికే పరిమితం

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క సీటును దక్కించు కోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచింది. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, సిపిఐతో పొత్తు పెట్టుకున్న కొత్తగూడెం స్థానంలోనూ విజయదుందుభి మోగించింది.

ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, పినపాక, అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాగా కేవలం భద్రాచలం నియోజకవర్గం లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగలిగింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావు ఒక్కరే స్వల్ప ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించగలిగారు.

ఖమ్మం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది..

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి చెయ్యి ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఆసరాగా 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రం మొత్తం కేసీఆర్ పై విశ్వాసం చూపగా ఖమ్మం ప్రజలు మాత్రం ఆయనను విశ్వసించలేదు.

2018లో జరిగిన ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు కేసీఆర్ ను గట్టెక్కించినా ఖమ్మం మాత్రం గులాబీ నేతను వ్యతిరేకించి ఒక్క స్థానానికే పరిమితం చేసింది. తాజాగా 2023 ఎన్నికల్లోనూ ఖమ్మం ఇదే ఫలితాన్ని తిరిగి బీఆర్ఎస్ కు కానుకగా ఇచ్చింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ కు ఆసరాగా నిలిచింది. తెల్లం వెంకటరావు ఈ ఎన్నికల్లో గెలవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఆయనే ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం