తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  December 31st Telugu News Updates : కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

December 31st Telugu News Updates : కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

31 December 2022, 19:49 IST

  • ఏపీ, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి..

31 December 2022, 19:44 IST

544 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ నిరుద్యోగులను ఖుషీ చేస్తూ.. సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా.. కళాశాల విద్యాశాఖలో 544 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 29న గ్రూప్ 2, డిసెంబర్ 30న గ్రూప్ 3, డిసెంబర్ 31న కళాశాల విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలతో.. ఆశావాహుల న్యూ ఇయర్ సంబరాలను రెట్టింపు చేసింది.

31 December 2022, 18:40 IST

సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణలో గత 9 ఏళ్లలో 7,069 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... రాష్ట్రంలో సగటున రోజుకి ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణాలకు పాల్పడ్డ వారిలో ఎక్కువ మంది కౌలు రైతులేనని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళారులు పత్తి రైతుని దగా చేస్తున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. పత్తికి క్వింటాల్ కు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విధానాలే రైతును సంక్షోభంలో పడేశాయని.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని విమర్శించారు. అన్ని పథకాలను కౌలు రైతులకి వర్తింపజేయాలని .. రైతులకి తక్షణం రూ. లక్ష రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

31 December 2022, 18:27 IST

తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొత్త ఏడాది జనవరిలో పలు వేడుకలు జరగనున్నాయి. విశేష పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు.. తేదీ వారీగా జరగనున్న వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. జనవరి 2వ తేదీన తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని వెల్లడించింది. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రస్నానం.... జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.... అదే రోజు నుంచి 13 వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం... జనవరి 14న భోగీ పండుగ.... జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం, మకర సంక్రాంతి.... జనవరి 16న కనుమ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేం చేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేం చేపు... శ్రీ గోదా పరిణయోత్సవం జరుగుతాయి. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం మరియు వసంత పంచమి వేడుకలు... జనవరి 28న రథసప్తమి నిర్వహిస్తారు.

31 December 2022, 17:48 IST

మందు బాబులకి గుడ్ న్యూస్

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఏపీలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో రాత్రి 12 వరకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. బార్లు, హోటళ్లు, ఈవెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చంది. డిసెంబరు 31తో పాటు జనవరి 1న కూడా రెండ్రోజుల పాటు మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

31 December 2022, 16:33 IST

గ్రూప్ - 4 లో తగ్గిన పోస్టులు

గ్రూప్ - 4 ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత ప్రకటించింది. అయితే.. సాంకేతిక కారణాలు, వివిధ శాఖల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా దరఖాస్తుల స్వీకరణను డిసెంబర్ 30 కి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం నుంచి అప్లికేషన్ లింక్ అందుబాటులోకి వస్తుందని అభ్యర్థులు ఎదురు చూశారు. అయితే.. అర్ధరాత్రి తర్వాత దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ.. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ ను వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చింది. తొలుత ప్రకటించిన 9,168 ఖాళీలు కాకుండా.. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో 8,039 ఖాళీలనే భర్తీ చేస్తున్నట్లు పేర్కొని.. ఆశావాహులకి టీఎస్పీఎస్సీ షాక్ ఇచ్చింది. దీంతో... అంతకముందు ప్రకటన కన్నా.. 1,129 పోస్టులు తగ్గినట్లైంది.

31 December 2022, 15:37 IST

విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు..

నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొదటిసారి రూ. 10 వేల జరిమానా.. 6 నెలల జైలు శిక్ష.. రెండోసారి దొరికితే రూ. 15 వేల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని, రెండో సారి దొరికిన వారి లైసెన్స్ కూడా రద్దు అవుతుందని తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.

31 December 2022, 14:34 IST

షర్మిల ఫైర్

బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ" అన్నట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలటం లేదన్నారు. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు ఉండగా... ఇప్పుడు అప్పు 4.50లక్షల కోట్లుగా ఉందని ఆక్షేపించారు. చేసిన అప్పులకు ఎనిమిదేళ్లుగా ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు అంటూ ట్వీట్ చేశారు.

31 December 2022, 13:42 IST

ఫైర్

వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ విధ్వంసాలే అన్నట్లుగా పాలన సాగిందన్నారు. మీడియా సహా అన్ని వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక సీఎం జగన్ ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు. శనివారం నెల్లూరు జిల్లా రాజుపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా విధ్వంసాల సంవత్సరమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోల్పోయారని అన్నారు. అందరూ కూడా ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని చెప్పారు

31 December 2022, 13:09 IST

అంతుచిక్కలేదు

భార్య, భర్త... వారికి ఇద్దరు పాప, బాబు..! ఇంతవరకు హ్యాపీ.. కానీ ఓ అంతుచిక్కని రోగానికి వారంతా బలైపోయారు. మొదట పిల్లలకు రాగా... అది కాస్త తల్లి, తండ్రికి కూడా చేరింది. వారు కూడా అనంతలోకానికి వెళ్లిపోయారు. కేవలం ఇదంతా 45 రోజుల్లోనే జరిగిపోయింది. ఈ తీరని విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

31 December 2022, 10:56 IST

ప్రమోషన్స్ 

ఏపిలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు లభించాయి. పి.వి.సునీల్‌కుమార్ స‌హా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల‌కు డీజీపీ ర్యాంకులు ఇచ్చారు. మ‌హేష్ దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌, పి.వి.సునీల్‌కుమార్‌ల‌కు డీజీపీ ర్యాంకులు ఖ‌రారయ్యాయి.

31 December 2022, 10:50 IST

హాల్ టికెట్లు విడుదల

AP Group 1 preliminary exam date 2022: మరోవైపు గ్రూప్ 1 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 8న ప్రిలిమనరీ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌-1 పరీక్ష ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. /psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయనున్నారు.

31 December 2022, 10:50 IST

మెయిన్స్

దేవదాయ ఈవో ఉద్యోగాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలను ఇవ్వగా... మెయిన్స్ పరీక్ష తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

31 December 2022, 8:27 IST

మళ్లీ షాక్

TS High Court On Hyderabad Pubs:హైదరాబాద్ పరిధిలోని పబ్ నిర్వాహకులకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. రాత్రి పది తర్వాత సౌండ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదే లేదని స్పష్టం చేసింది.

31 December 2022, 8:26 IST

దారుణం

ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త లారీ డ్రైవర్. సీన్ కట్ చేస్తే భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ టైం చేసుకుని అతనితో పాటు పిల్లలను తీసుకెళ్లి ఇంట్లో నుంచి పారిపోయింది. భార్య సమాచారం తెలుసుకున్న భర్త... ఆమె ఉంటున్న నివాసానికి వెళ్లాడు. అక్కడ కుమారుడు కనిపించలేదు. భార్య పొంతన లేని సమాధానాలు చెప్పుకోచ్చింది. వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. ఏకంగా కుమారిడి ప్రియుడితో కలిసి తల్లి చంపినట్లు తేలింది. ఈ దారుణ ఘటన కడప జిల్లా బద్వేల్ లో వెలుగు చూసింది.

31 December 2022, 7:20 IST

టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని 6 నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

31 December 2022, 7:20 IST

మంచి ఛాన్స్

తాజా గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా... వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్‌ కేటగిరీలో లేదు. కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే...ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు. ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్‌ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్‌ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్‌ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా ఈ నోటిఫికేన్ లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. తద్వారా 350 పోస్టులు వారికే దక్కనున్నాయి.

31 December 2022, 7:20 IST

మళ్లీ పొత్తు..!

TDP - BJP Alliance in Telangana: ఎన్నికల ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చేసింది తెలంగాణ...! ఇక ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి. టార్గెట్ పై బీఆర్ఎస్, బీజేపీలు ఏకంగా లెక్కలు వేసి చెప్పేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కార్యాచరణపై క్లారిటీ రావాల్సి ఉంది. మిగతా పార్టీలు కూడా లైన్ లోకి వచ్చే పనిలో పడ్డాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు... మళ్లీ తెలంగాణపై ఫోకస్ చేసే పనిలో పడ్డారు. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించిన తెలుగుదేశం.. వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే.... బీజేపీ, టీడీపీ పొత్తుపై తెగ వార్తలు వస్తున్నాయి. దోస్తీ పక్కా అంటూ పలు విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తుండటంతో ఈ అంశం అత్యంత ఆసక్తిని రేపుతోంది. ఈ వాదనను రాష్ట్ర బీజేపీ చీఫ్ కొట్టిపారేశారు. అసలు పొత్తే ఉండదని స్పష్టం చేశారు. అయితే వీరి పొత్తు అంశం ఎందుకు చర్చకు వస్తోంది..? ఢిల్లీ పెద్దలు నిజగానే... ఆ దిశగా ఆలోచిస్తున్నారా..? చంద్రబాబు ప్లానేంటి..?వంటి అంశాలు రాజకీయవర్గాలను ఆలోచనలో పడేస్తున్నాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి