తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  March 13 Telugu News Updates :ఆస్కార్ అందుకున్న నాటునాటు
ఆస్కార్ స్వీకరించిన వేళ చంద్రబోస్, ఎంఎం కీరవాణి
ఆస్కార్ స్వీకరించిన వేళ చంద్రబోస్, ఎంఎం కీరవాణి (AP)

March 13 Telugu News Updates :ఆస్కార్ అందుకున్న నాటునాటు

13 March 2023, 20:41 IST

  • ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని “నాటు నాటు” పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును  దక్కించుకుంది. 95వ అవార్డుల ప్రధానోత్సవంలో ఆస్కార్‌ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ వెళ్లి అవార్డును స్వీకరించారు. నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది.  

13 March 2023, 20:41 IST

మాజీ మంత్రి విజయరామారావు మృతి

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏటూరునాగారంలో జన్మించిన ఆయన.. 1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో చేరి, ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్ గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన పి.జనార్దన్ రెడ్డిపై గెలిచి మంత్రి అయ్యారు.

13 March 2023, 18:26 IST

ప్రశ్నాపత్రాల లీక్ కేసు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంలో మరో కోణం వెలుగు చూసింది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు.. అసిస్టెంట్ ఇంజినీరింగ్‌ పరీక్ష పత్రం లీకైనట్లు తేల్చారు. మార్చి 5న ఈ పరీక్ష జరగగా... పరీక్షకు రెండ్రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు గుర్తించారు. దీనితో పాటుగా టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా లీకైనట్లు గుర్తించారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ సహా మరో 7 ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షని రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.

13 March 2023, 16:29 IST

ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా మరో 9 మందిని అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడుని కూడా అదుపులోకీ తీసుకున్నారు. ప్రశ్నాపత్రం కొనుగులు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

13 March 2023, 16:25 IST

పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 16 వరకు పిళ్లైకి ఈడీ కస్టడీ పొడిగించింది. మరోవైపు ఇప్పటికే బుచ్చిబాబుకి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 15న పిళ్లైతో కలిపి అతడిని విచారించనుంది. మార్చి 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ రోజు అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.

13 March 2023, 15:50 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ - గవాస్కర్ సీరిస్ చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో 4 మ్యాచ్ ల సీరిస్ ను భారత్ 2 -1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా.. బదులుగా భారత్ 571 స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో చివరి రోజు 175 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికే సమయం ముగియడంతో టెస్ట్ డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరింది. జూన్ 7న ఓవల్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.

13 March 2023, 15:44 IST

తీర్పు రిజర్వు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి... సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా.. సోమవారం (మార్చి 13) వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు రిజర్వు చేసింది. తదుపరి విచారణపైనా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తూ నిర్ణయం వెలువరించింది. తీర్పు వెల్లడించే వరకు అవినాశ్ ని అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

13 March 2023, 12:14 IST

ఉపాధ్యాయుల ఓట్ల గల్లంతు

విజయనగరం జిల్లాలో ఉపాద్యాయుల ఓట్లు గల్లంతయ్యాయి.  2 రోజుల క్రితం ఓట్లు ఉన్నాయని, చివర్లో తొలగించారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పోలింగ్ బూత్‍లో ఒకే వ్యక్తి పేరుతో 25 ఓట్లు ఉన్నాయని,  కంటోన్మెంట్ ఏరియాకు చెందిన రాజేశ్వరి పేరుతో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.  నకిలీ ఓట్లపై  అభ్యంతరం ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డబుల్ ఎంట్రీలు, తొలగింపులతో ఓట్లు గల్లంతయ్యాయి. ఓట్ల గల్లంతుపై  సమాధానం చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు.  

13 March 2023, 12:11 IST

పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు భేటీ

టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై చర్చించారు.  భారీగా బోగస్ ఓట్ల చేర్చడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు తెరలేపిందని మండిపడ్డారు.  వివిధ ఘటనలపై కడప, తిరుపతి ఎస్పీలు, కలెక్టర్లకు చంద్రబాబు ఫోన్ చేశారు.  పోలింగ్‍లో అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

13 March 2023, 10:02 IST

గాంధీ ఆస్పత్రిలో ఆత్మహత్య

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది.  ఆస్పత్రి భవనం ఎనిమిదవ అంతస్తులో  ఒక రోగి సహాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  సెక్యూరిటీ గార్డుల వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

13 March 2023, 9:59 IST

పోలింగ్ బూత్‍ వద్ద ఉద్రిక్తత

తిరుపతిలో  సంజయ్‍గాంధీ కాలనీ 228 పోలింగ్ బూత్‍ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  దొంగ ఓటర్లను పోలింగ్ బూత్‍లోకి  వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్తుండటంతో టీడీపీ నేతలు  అడ్డుకున్నారు.  వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. 

13 March 2023, 9:57 IST

కీరవాణి కృతజ్ఞతలు

నాటునాటు పాటను అవార్డుకు ఎంపిక చేసినందుకు  ఆస్కార్ అకాడమీకి సంగీత దర్శకుడు కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు.  ఆర్‍ఆర్‍ఆర్.. దేశాన్ని గర్వపడేలా చేసిందని, తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందన్నారు. ఆహుతులకు  నమస్తే అంటూ గీత రచయిత చంద్రబోస్ అభివాదం తెలిపారు. 

13 March 2023, 9:55 IST

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.  నాలుగు స్థానిక సంస్థలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

13 March 2023, 9:54 IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

గుంటూరు జిల్లా పెద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు  అరెస్ట్ చేశారు.  రెయిన్ ట్రీ పార్క్ వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల  నుంచి 4.30లక్షలు 4ల్యాప్ టాప్స్,బెట్టింగ్ కి వాడే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.  బెట్టింగ్ కోసం  వాడే  29 కీ ప్యాడ్"సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి