ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆగష్టు 14, 2022 ఆదివారం ఉదయం ముంబై ఆసుపత్రిలో మరణించారు. ఉదయం 6.45 గంటలకు గుండెపోటు రావడంతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆయన వయసు 62 ఏళ్లు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు రూ. 46 వేల కోట్లు. ఇందులో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూనే సంపాదించారు. వీరి సొంత యాజమాన్యంలో రేర్ (RaRe) ఎంటర్‌ప్రైజెస్ అనే స్టాక్ ట్రేడింగ్ సంస్థను కూడా నడుపుతున్నారు. రాకేష్ సతీమణి రేఖ కూడా ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. వీరిద్దరి పేరు మీదుగా ఈ సంస్థ పేరు ఉంది. ఈయనకు మూడు డజనుకు పైగా కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. టైటాన్, స్టార్ హెల్త్, టాటా మోటార్స్, మెట్రో బ్రాండ్లు మొదలైన కంపెనీల్లో ఎక్కువ మొత్తంలో షేర్లు కలిగి ఉన్నారు. హంగామా మీడియా, ఆప్టెక్‌లకు చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇటీవలే 'ఆకాశ ఎయిర్' అనే విమానయాన సంస్థను ప్రారంభించారు.