TS ICET 2024 Notification: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 4, 5 తేదీల్లో ఎంట్రన్స్…
TS ICET 2024 Notification: తెలంగాణ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జూన్ 4,5 తేదీలో ఐసెట్ 24 నిర్వహించనున్నారు.
TS ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే బీ అలర్ట్. కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి.
జూన్ 4, 5 తేదీల్లో మొత్తంగా మూడు సెషన్లలో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్ ఐసెట్–2024 కన్వీనర్ ప్రొఫెసర్ నరసింహచారి, కాకతీయ యూనివర్సిటీ Kakatiya University వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఫీజు ఎంతో తెలుసా..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024 నిర్వహించనుండగా.. మార్చి 7వ తేదీ అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750గా నిర్ణయించారు.
అప్పటికీ ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోని వాళ్లకు రూ.250 అపరాధ రుసుంతో మే నెల 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. రూ.500 ఫైన్ తో మే 27వ తేదీ వరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మే 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మే 28 నుంచి కాకతీయ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు.
4, 5న ఎగ్జామ్.. 15న ప్రైమరీ కీ
టీఎస్ ఐసెట్–2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఆన్ లైన్ లో నిర్వహించనుండగా.. ఈ పరీక్షను రెండు రోజుల్లో మూడు సెషన్ లలో పెట్టనున్నారు. జూన్ 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది.
జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు థర్డ్ సెషన్ నిర్వహించనున్నారు. కాగా జూన్ 15న ప్రైమరీ కీ విడుదల చేయనున్నారు. ఆ తరువాత 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఆ తరువాత జూన్ 28న తుది ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకవేళ అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ను కూడా సందర్శించవచ్చు.
20 ఆన్ లైన్ టెస్ట్ జోన్స్
ఈ టీఎస్ ఐసెట్–2024 పరీక్షను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో నిర్వహించనుండగా.. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 20 ఆన్ లైన్ టెస్ట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ 16 చోట్లా, ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్లా ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ సెంటర్లు ఎక్కడెక్కడ అనేది వర్సిటీ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
కేయూ ఆధ్వర్యంలో 15వ సారి
ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ 15వ సారి నిర్వహించబోతున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.నరసింహచారి వెల్లడించారు.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో 2005, 2006, 2013, 2014, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 14 సార్లు ఐసెట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాదితో 15వ సారి టీఎస్ ఐసెట్ నిర్వహించినట్లు అవుతుందని వివరించారు.
ఈసారి ఐసెట్ అప్లికేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2018లో 61,439 రిజిస్ట్రేషన్స్ రాగా.. గతేడాది 2023లో నిర్వహించిన పరీక్షకు 75,925 అప్లికేషన్స్ రావడం గమనార్హం.
గడిచిన ఐదేళ్ల నుంచి చూస్తే టీఎస్ ఐసెట్ లో క్వాలిఫైయింగ్ పర్సంటేజీ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. 2019లో దరఖాస్తు చేసుకున్నవారిలో 92.01 శాతం మంది క్వాలిఫై కాగా.. 2020లో 90.28 శాతం, 2021లో 90.09 శాతం, 2022లో 89.58 శాతం, 2023లో 86.17 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)