Tspsc Paper Leak: టిఎస్‌పిఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్..
Tspsc Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. చైన్ లింకు మాదిరి సాగిన వ్యవహారంలో హైటెక్ కాపీయింగ్‌తో పరీక్షలు రాసిన ఇద్దరిని సిట్ బృందం అరెస్ట్ చేసింది.
Tspsc Paper Leak: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్ అతని కుమార్తె సాహితీలను సిట్ తాజాగా అరెస్ట్ చేసింది. పోల రమేష్ సహకారంతో హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్‌లో నిందితురాలు సాహితీ ఏఈఈ పరీక్ష రాసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
కుమార్తె పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయ్యేందుకు పోల రమేష్‌తో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.దీంతో తండ్రి కుమార్తెలిద్దరినీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. పోల రమేష్ నుంచి ఏఈఈ పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాలు కొనడానికి పోల రమేష్‌కు నగదు బదిలీ చేసినట్టు ఆరుగురి బ్యాంకు లావాదేవీల ద్వారా అధికారులు గుర్తించారు. తాజా అరెస్టులతో కలిపిఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 80కి చేరింది.
ఎలక్ట్రికల్ డీఈ రమేష్ బ్లూటూత్, ఎలక్ట్రానికి డివైజ్‌ల ద్వారా పేపర్లను లీక్ చేసినట్టుగా గుర్తించారు. ఛార్జి షీట్ వేసేందుకు సిట్ సిద్ధమైన సమయంలో డీఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రాల లీక్‌తో పాటు మాస్ కాపీయింగ్ కూడా జరిగినట్లు ఆధారాలు లభించడంతో నిందితుల్నిగుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో బొమ్మకల్ కు చెందిన మద్దెల శ్రీనివాస్ తో పాటు తిమ్మాపూర్ మండలానికి చెందిన వారి గురించి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్ మండలానికి చెందిన వారిని అదుపులోకి తీసుకున్న సిట్ , బుధవారం మద్దెల శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను అరెస్ట్ చేసింది.వీరిని గురువారం కోర్టులో హాజరు పరచనున్నారు.
రెండో విడత దర్యాప్తుతో మద్దెల శ్రీనివాస్ ఫ్యామిలీ అందుబాటులో లేకపోడంతో సిట్ బృందాలు తీవ్రంగా గాలించాయి. బుధవారం ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లుగా పని చేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయాలతో పేపర్ ఇచ్చేందుకు డీఈ రమేష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బొమ్మకల్ గ్రామానికి చెందిన ఇంజనీర్‌కు, డీఈ రమేష్ కాళేశ్వరం నిర్మాణంలో పనిచేశారు.ఈ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో మద్దెల శ్రీనివాస్ కూతురి కోసం పేపర్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.
మద్దెల శ్రీనివాస్ తన కూతురు కోసం పేపర్ కావాలని అడగడంతో రూ. 70 నుండి 80 లక్షలకు బేరం జరిగింది. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో మరో అభ్యర్థిని కూడా తమతో కలుపుకున్నారు. మద్దెల శ్రీనివాస్ మాత్రం తన కూతురుకు ఉద్యోగం వచ్చిన తరువాతే డబ్బులు ఇస్తానని డీఈతో ఒప్పందం చేసుకున్నాడు. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటి వరకు మొత్తం 80 మందిని సిట్ అరెస్ట్ చేసింది. కేసు దర్యాప్తు తుది దశకు చేరడంతో త్వరలో ఛార్జిషీటువేసే అవకాశాలు ఉన్నాయి.