Passport Slots: సరైన కారణాలుంటేనే అడ్వాన్స్ పాస్‌పోర్ట్ స్లాట్ కేటాయింపు
Passport Slots: పాస్‌పోర్ట్ స్లాట్ మార్పు కోసం దరఖాస్తుదారుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వస్తుండటంతో అన్నింటిని అమోదించలేమని పాస్‌పోర్ట్ కార్యాలయం స్పష్టం చేసింది. అత్యవసర కారణాలు ఉంటేనే స్లాట్ తేదీలను మారుస్తామని ప్రకటించింది.
Passport Slots: సహేతుకమైన కారణాలు ఉన్నదరఖాస్తులను మాత్రమే పాస్‌పోర్ట్ స్లాట్ మార్పుకు అనుమతిస్తామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రకటించింది. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనలకు తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ స్లాట్ మార్పు అభ్యర్థించేందుకు తగిన ఆధారాలుంటేనే పాస్‌పోర్టు అడ్వాన్స్ మెంట్‌కు అవకాశం కల్పించనున్నారు. విదేశాల్లో అత్యవసర వైద్యం, ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు మినహా మరే ఇతర కారణాలను అడ్వాన్స్ తేదీల కోసం చేసే వినతుల్లో పరిగణనలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అభ్యర్థులు తమ అభ్యర్థనతో పాటు సంబంధిత ధ్రువపత్రాలు చూపిస్తేనే స్లాట్ రీషెడ్యూల్‌కు అనుమతిస్తామని చెబుతున్నారు. విద్యార్థులైతే విశ్వవిద్యాలయాల్లో పొందిన అడ్మిషన్ పత్రాలు, వైద్య కారణాలపై వెళ్తున్నవారైతే వైద్యుల అపాయింట్‌మెంట్ ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. కొత్త పాస్‌పోర్టులు, రెన్యూవల్, రీఇష్యూ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అనేక మంది రీజినల్ పాస్‌పోర్టు ఆర్పీవో కార్యాలయానికి వస్తున్నారు. ముందస్తు రెన్యూవల్‌కు అవకాశమున్నా చివరి నిమిషం వరకు ఆ పని చేయట్లేదు.
విదేశాలకు వెళ్లే సమయంలోనే చాలామంది అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులదీ ఇదే పరిస్థితి ఉంటోంది. ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం చివరి నిమిషంలో కార్యాలయానికి వస్తున్నారు. ఇలాంటి కారణాలపై ప్రతిరోజు దాదాపు 50 మంది వరకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోందని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం తెలిపింది.
పాస్‌పోర్ట్ రెన్యువల్‌తో పాటు కొత్త పాస్‌పోర్టుల జారీ కోసం నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుందని, అప్పటికప్పుడు పాస్‌పోర్టుల జారీ సాధ్యపడదని వివరించారు. ప్రణాళిక ప్రకారం అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.