TS Police Annual Report : తెలంగాణలో పెరిగిన నేరాలు - వార్షిక నివేదికలో కీలక విషయాలు
Telangana State Police Annual Report : తెలంగాణలో ఈ ఏడాది 2 లక్షల 13 వేల కేసులు నమోదైనట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికను ప్రకటించారు. గత ఏడాది కంటే 15 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయని తెలిపారు.
Telangana State Police Annual Report 2023 : తెలంగాణ వార్షిక నివేదికను విడుదల చేశారు డీజీపీ రవి గుప్తా. తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ ఏడాది 16,339 సైబర్ కేసులు నమోదు కాగా… హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్ కేసులు పెరిగాయని వివరించారు.
గత ఏడాది కంటే 15 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయని… మహిళలపై వేధింపులు 19,013 కేసులు నమోదైనట్లు తెలిపారు డీజీపీ రవి గుప్తా. నేరాలకు పాల్పడుతున్న 175 మందిపై పీడీయాక్ట్ నమోదు చేశామని వివరించారు. సమాజానికి డ్రగ్స్, సైబర్‌క్రైమ్ సవాలుగా మారాయన్న ఆయన…. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఈ ఏడాదిలో జీరో ఎఫ్‌ఐఆర్‌లు 1,108 నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1877 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో చూస్తే 2,52,60 కేజీల గంజాయి, 1240 గంజాయి మొక్కలను సీజ్ చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఆయా కేసుల్లో 2,583 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి, 182 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. 12 మంది ఫారెన్ అఫెండర్స్‌ను అరెస్ట్ చేసినట్టు వివరించారు. 536 మంది డ్రగ్స్ కంజూమర్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలపగా… ఈ ఏడాది 2426 పొక్సో కేసులు నమోదైనట్లు వివరించారు. ఒక నిందితుడికి మరణ శిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించినట్టు ప్రకటించారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20,699 కేసులు నమోదు కాగా… మొత్తం 6,788 మంది మృతి చెందినట్లు తెలిపారు.గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు.
ఇక ఇటీవలే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధికి సంబంధించిన వార్షిక నివేదికలు కూడా వచ్చాయి. దాదాపు అన్ని కమిషనరేట్ల పరిధిలోనూ నేరాల శాతం పెరిగింది.
సంబంధిత కథనం