MLC Kavitha Live News Updates : ఈడీ దర్యాప్తు అధికారికి కవిత లేఖ
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో వరుసగా రెండో రోజు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. లిక్కర్ పాలసీలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం పదిన్నర గంటల పాటు ప్రశ్నించారు.
Tue, 21 Mar 202303:52 PM IST
ముగిసిన కవిత ఈడీ విచారణ
దేశవ్యాప్తంగా సంచలనమైన దిల్లీ మద్యం లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవితను వరుసగా విచారణ చేసింది. దిల్లీలో వరుసగా రెండోరోజు ఈడీ అధికారులు సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ చేశారు. ఉదయం 11 గంటలకు మెుదలైన విచారణ.. రాత్రి 8.30 గంటల వరకూ సాగింది. దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. సౌత్ గ్రూప్, పిళ్లైకి సంబంధించి.. ఎక్కువ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది.
Tue, 21 Mar 202308:46 AM IST
ఈడీ దర్యాప్తు అధికారికి కవిత లేఖ
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. గత ఏడాది నవంబర్‌లోనే ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కవిత, ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Tue, 21 Mar 202305:57 AM IST
పాత ఫోన్లను ప్రదర్శించిన ఎమ్మెల్సీ కవిత
ఈడీ నోటీసుల నేపథ్యంలోల ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు బయల్దేరారు. నివాసం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత కారు నుంచి బయటకు వచ్చి గతంలో తాను వినియోగించిన మొబైల్ ఫోన్లను బయటకు చూపించారు. 2021-22 మధ్య కాలంలో 9 మొబైల్ ఫోన్లను కవిత మార్చారని ఈడీ ఆరోపించింది. సాక్ష్యాలు మాయం చేసేందుకు వాటిని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కవిత ఈడీ విచారణకు వెళ్లే క్రమంలో పాత ఫోన్లను మీడియాకు ప్రదర్శించారు.
Tue, 21 Mar 202304:37 AM IST
న్యాయ నిపుణులతో కవిత భేటీ
ఎమ్మెల్సీ కవిత న్యాయ సలహా కోసం ప్రముఖ న్యాయవాది నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి విచారణ కోసం ఈడీ పిలవడంతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో న్యాయ నిపుణులతో కవిత సంప్రదింపులు చేస్తున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగష్టు వరకు కవిత దాదాపు పది ఫోన్లు మార్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న వారిలో 36 మంది 171 ఫోన్లు మార్చారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
Tue, 21 Mar 202303:01 AM IST
వరుసగా మూడోసారి విచారణ
మార్చి 11న మెుదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ రోజున ఎనిమిది గంటలపాటు ఈడీ విచారణ చేసింది. ఆ తర్వాత తన న్యాయవాదితో ఈడీ కోరిన సమాచారం పంపించారు. మరోవైపు ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 24న కవిత పిటిసన్ విచారణకు రానుంది.
Tue, 21 Mar 202302:54 AM IST
అనుమానాస్పద లావాదేవీలపై ఆరా
కవిత గతంలో సమర్పించిన బ్యాంకు స్టేట్‌మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీల గురించి, కవిత నుంచి స్వాధీనపరుచుకున్న మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా ఈడీ కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మనీశ్‌సిసోడియాతో ఆమెకున్న రాజకీయ సంబంధాలు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌తో భేటీకి కారణాలపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్‌లో కవిత తన నివాసంలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రును కలుసుకున్న సందర్భం గురించి కూడా వారు ప్రశ్నించారు. కవిత ధ్వంసం చేసిన ఫోన్లకు సంబంధించిన సమాచారాన్నీ అడిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి, గతంలో విచారణ సందర్భంగా వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ మధ్యలో ఆమె అసౌకర్యానికి గురి కావడంతో .. వైద్యబృందాన్ని పిలిపించి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Tue, 21 Mar 202302:49 AM IST
సోమవారం సుదీర్ఘ విచారణ
ఢిల్లీ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్‌పిళ్లైతో కవితను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించాలని అధికారులు భావించినా, అందుకు పిళ్లై అంగీకరించ కపోవడంతో, పిళ్లైను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈడీ కస్టడీ ముగియడంతో జైలుకు పంపించారు. ఈ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలతో ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్, ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్ సమావేశాలకుసంబంధించిన పత్రాలను ఆమెకు చూపించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై సౌత్ గ్రూప్ తరఫున, కవిత తరఫున జరిపిన సంభాషణలనూ వారు ఆమెకు వినిపించి, ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
Tue, 21 Mar 202302:55 AM IST
అరెస్ట్ అవకాశాలు లేకపోలేదు…
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని కథనాలు వెలువడ్డాయి. సోమవారం అరెస్టు చేసే అవకాశాలు లేవని ఈడీ అధికారి ఒకరు ఉదయాన్నే మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. మంగళవారం విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని చెప్పలేనని అదే అధికారి పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి.