MP Raghurama : ఎమ్మెల్యేలకు ఎరకేసులో ట్విస్ట్.. రఘురామకృష్ణకు నోటీసులు!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎరకేసును అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల(TRS MLAs) కొనుగోళ్ల విషయాన్ని సిట్ అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి.. ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని చెప్పారని సమచారం. ఆయన ఎందుకు ఇందులోకి వచ్చారు? రఘురామకు ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా బయటపడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అయితే దీనిపై స్పందించిన రఘురామ.. తనకు సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.
ఈ కేసులో తాజాగా బీఎల్ సంతోష్(BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు కూడా నోటీసులు వెళ్లాయి.
ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరుకాని వారికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు.. ప్రతాప్ ను అరెస్టు చేయోద్దని చెప్పింది. మరోవైపు శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్(SIT) అధికారులు సింహయాజీతో ఉన్న సంబంధాలపై ఆధారాలను ముందు పెట్టి అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్‌హౌస్‌లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని అతడు చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటికే అరెస్టయిన నందకుమార్‌తో కూడా శ్రీనివాస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఇంకోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో(MLAs Poaching Case) కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు(Telangana High Court). బుధవారం విచారించిన కోర్టు.. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్(BL Santhosh)కు మరోసారి నోటీసులివ్వాలని సిట్ ను ఆదేశించింది. నోటీసులిచ్చినా సిట్ దర్యాప్తునకు హాజరుకాని బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని సిట్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరాయి. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఈ నెల 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాయి. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని విచారణ ఆలస్యం అవుతుందనని ఏఏజీ.. హైకోర్టు(High Court) దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని ..అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల్ని ఎత్తివేయాలని కోరారు. అయితే ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. నిజానికి బీఎల్ సంతోష్‌కు మంగళవారమే నోటీసులు ఇచ్చామని కోర్టుకు సిట్ తరపు న్యాయవాదులు తెలిపారు. సిట్ జారీచేసిన నోటీసును ఢిల్లీ(Dlehi)లోని బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందజేశారని తెలిపారు. బీజేపీ(BJP) కార్యాలయంలో బీఎల్ సంతోష్ లేరని, గుజరాత్‌లో ఉన్నారని చెప్పారు. సిట్ నోటీసుల జారీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు అందజేసిన వివరాలను కోర్టుకు నివేదించారు. అయితే ఈ సారి నేరుగా ఆయనకే మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నోటీసులు అందించాలని హైకోర్టు ఆదేశించింది.