Online Trading Fraud : బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు-siddipet online trading fraud man cheated bank manager with 80 lakh rupees arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Online Trading Fraud : బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు

Online Trading Fraud : బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు

HT Telugu Desk HT Telugu
Sep 14, 2024 03:45 PM IST

Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపి ఓ బ్యాంకు మేనేజర్ ను రూ.80 లక్షలు చీటింగ్ చేశాడు సైబర్ నేరగాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సైబర్ నేరగాడు... ఓ లింక్ ద్వారా బ్యాంకు మేనేజర్ కు టోకరా వేశాడు.

బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు
బ్యాంకు మేనేజర్ కు టోకరా, రూ.80 లక్షలు దోచేసిన సైబర్ నేరగాడు (Pixabay )

Online Trading Fraud : ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా ఓ బ్యాంకు మేనేజర్ నే రూ. 80 లక్షలు మోసం చేసిన ఒక సైబర్ నేరస్తుడ్ని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సిద్దిపేట సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాకు చెందిన బీమిశెట్టి వెంకటరామ్ నాయుడు (45) హైటెక్ సిటీ మాదాపూర్ లో నివాసం ఉంటున్నాడు. సిద్దిపేట పట్టణంలో పనిచేసే ఒక బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్, మెయిల్ ద్వారా వెంకటరామ్ ఒక లింక్ పంపించాడు. ఇందులో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని బ్యాంకు మేనేజర్ ను నేరస్తుడు నమ్మించాడు. అది నమ్మిన బ్యాంకు మేనేజర్ గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా 25 రోజులలో పలు విడతలుగా రూ.80 లక్షలు పంపించాడు. అనంతరం నేరస్థులకు ఫోన్ చేయగా, అతడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు.

మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్

దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్ జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు నిందితుని బ్యాంకు ఖాతాలో రూ. 20 లక్షలు ఫ్రిజ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో టెక్నాలజీ సాయంతో నిందితున్ని శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. అతడి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, సెల్ ఫోన్, రెండు బ్యాంకులకు సంబంధించిన చెక్ బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని సిద్దిపేట సైబర్ సెల్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

సిద్దిపేటలో మరో ఘటన

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఇనుప స్వామి (47) మేస్త్రీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి, జల్సాలకు అలవాటు పడిన స్వామి, పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో బైక్ ల దొంగతనం మొదలుపెట్టాడు. గత 2 నెలల క్రితం సిద్దిపేటలో 2 మోటర్ సైకిల్ లను దొంగతనం చేసిన కేసులలో జైలుకు వెళ్లిన నిందితుడు 50 రోజులు జైలుకు వెళ్లి 11వ తేదీన తిరిగి వచ్చాడు.

అదేరోజు దొంగతనం

అదే రోజు సాయంత్రం సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసిన ఒక బైక్ దొంగతనం చేసి పెద్ద చీకోడ్ లోని ఇంటి వద్ద దాచిపెట్టాడు. మరల శుక్రవారం సిద్దిపేటలోని సందీప్ హాస్పిటల్ దగ్గర మరో బైక్ ని దొంగిలించాడు. ఆ బైక్ ని సిద్దిపేటలో ఎక్కడైనా అమ్ముదామని వస్తుండగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకొని విచారించారు. తాను నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకొన్నారు. అతడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు తెలిపారు.

సంబంధిత కథనం