Sangareddy News : పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం, పరిమితవేగం సురక్షితం- ఎస్పీ చెన్నూరి రూపేష్
Sangareddy News : తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో రహదారులపై వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలంలో పరిమితవేగం సురక్షితమని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు.
Sangareddy News : పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరమని, చలికాలంలో పరిమితవేగం సురక్షితమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పొగ మంచుతో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు పరిమితవేగంతోనే వెళ్లి ప్రాణాలను రక్షించుకోవాలని ఎస్పీ సూచించారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయి, పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితులు ఏర్పడి, అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని, రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రత్తలు మరింత కనిష్ట స్థాయికి చేరి, జిల్లాను పొగమంచు కమ్మేసే అవకాశం ఉందన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడటం వలన ప్రయాణం ప్రమాదభరితంగా మారే అవకాశం ఉంటుందన్నారు. వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారుతుందని, వాహనానికి లైట్లు వేసుకున్నా.. కొంత దూరంలో ఉన్న వాహనాలు కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించవని, ఈ సమయంలో వేగంగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు చోటు చేసుకుంటాయన్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు అధికంగా ఉండటం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు నియంత్రించే అవకాశం
వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు . పొగమంచు సమయంలో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లినా చాలా దూరం వరకు చూడలేమన్నారు. డ్రైవింగ్ సమయంలో తక్కువ స్పీడ్‌లో ఉండడం వలన సడెన్‌గా ఏదైనా వాహనం కనబడితే బ్రేక్ వేసి నియంత్రణలోకి తీసుకోవచ్చన్నారు. అధిక వేగంలో ఉన్న వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. అందుకే చలికాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు వాహనాల హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్‌లైట్లు వేసుకోవాలని సూచించారు. వేగం కాదు ప్రాణాలే ముఖ్యమని ప్రతి వాహనదారుడు గుర్తించాలని అన్నారు.
పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. తక్కువ బీమ్‌పై హెడ్‌లైట్‌లను సెట్ చేయండి -వాయుకాలుష్యం కారణంగా ఎక్కువ దూరాన్ని చూడలేకపోతున్న ఈ రోజుల్లో పొగమంచు వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తక్కువ బీమ్‌లో హెడ్‌లైట్‌లను సెట్ చేసుకోవడం మంచిది. హై-బీమ్ హెడ్‌లైట్‌లను ఉపయోగించడం వలన పొగమంచు కాంతికి రిఫ్లెక్ట్ అవుతూ ప్రమాదాలకు దారి తీయవచ్చు. 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న వాహనాన్ని చూడలేని సమయంలో కారు ఫాగ్ ల్యాంప్‌ను ఆన్ చేయడం మంచిది.
2. శబ్దాలను విని, వాహనాల దూరాన్ని అంచనా వేయండి -పొగమంచు వాతావరణంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవులు చురుకుగా పనిచేయాలి. దట్టమైన పొగమంచు సమయంలో కళ్లతో చూడలేని వాటిని చెవులతో పసిగట్టాలి. వాహనాల టైర్ల, హారన్ల శబ్దాలను విని, కనిపించని వాహనాల దూరాన్ని అంచనా వేయగలగాలి. పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ సిస్టమ్ ఆపివేయడం మంచిది.
3. ఇండికేటర్స్ ఉపయోగించండి- పొగమంచుతో కూడిన రహదారిపై డ్రైవింగ్ చేస్తున్నపుడు వాహనాలు సరిగ్గా కనిపించవు, ఇతర డ్రైవర్లకు మనం ఎటు వైపు వెళ్లాలనుకుంటున్నామో ఇండికేషన్ సూచించడం చాలా ముఖ్యం. మలుపు తిరిగేటప్పుడు, కొంత సమయం వెనుక వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా కనీసం పది సెకన్ల పాటు ఇండికేటర్స్ వేయడం మంచిది. మీ వాహనం అద్దాలు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. కార్ హీటర్‌ను ఆన్ చేయడం ద్వారా దీన్ని సులభంగా క్లియర్ చేయవచ్చు.
4. ఓవర్ టేక్ చేయవద్దు-పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్‌లో సహనం కీలకం. ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎదుటి డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదానికి కారణం కావచ్చు. మీ వాహనానికి ముందున్న వాహనానికి మధ్య పరిమిత దూరన్ని పాటించడం చాలా ముఖ్యం . వాహనాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నప్పుడు అత్యవసర సమయంలో ప్రతిస్పందించడానికి తగినంత సమయం లేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి.
5. రహదారిపై దృష్టి కేంద్రీకరించండి-పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్ పై ఏకాగ్రత, అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యమైనవి . ప్రమాదం జరగడానికి ఒక సెకను కాలం పడుతుంది. అంటే పరధ్యానం వదిలిపెట్టి డ్రైవింగ్ పై దృష్టి కేంద్రీకరించండం ప్రతి డ్రైవర్ బాధ్యత.