Instagram Harassments : ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులు, ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య-sangareddy karimnagar two students committed suicide instagram harassment on love ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Instagram Harassments : ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులు, ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

Instagram Harassments : ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులు, ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 05:01 PM IST

Instagram Harassments : ఇన్ స్టా గ్రామ్ లో వేధింపులు ఇద్దరు విద్యార్థినుల ప్రాణాన్ని తీశాయి. సంగారెడ్డి, కరీంనగర్ లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమైన యువకులు ప్రేమ పేరుతో వేధించడంతో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులు, ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య
ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులు, ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

Instagram Harassments : ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులకు ఇద్దరు యువతులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనలు సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపం చెందిన బీఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పరిధిలోని దోమడుగు గ్రామంలో వెలుగుచూసింది.

ఇంటిపై నుంచి దూకి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐదు నెలల క్రితం యువతికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరు చాటింగ్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి యువకుడు తనను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకోమని అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా యువతీ కుటుంబీకులను సైతం బెదిరింపులకు గురిచేశాడు. దీంతో మనస్థాపo చెందిన యువతి వేధింపులు తాళలేక ఇంటి నాల్గో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా ... ఆకతాయిల తీరులో ఎలాంటి మార్పు రావడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.

అసలేం జరిగింది?

గుమ్మడిదల మండలం దాచారం గ్రామానికి చెందిన రామారం రాజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కూతురు తేజస్విని (20) ఉన్నారు. కాగా దాచారం గ్రామం డీఆర్డిఓ సంస్థ అభివృద్ధి కోసం ఊరుని ఖాళీ చేసి పంపించడంతో బతుకుతెరువు కోసం రాజు కుటుంబం దోమడుగు గ్రామానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. తేజస్విని బీఫార్మసీ రెండో ఏడాది చదువుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడితో గత ఐదు నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరు చాటింగ్ ద్వారా మాట్లాడుకున్నారు. దీంతో నెల రోజుల నుంచి యువకుడు తనను ప్రేమిస్తున్నానని,పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులను, అన్నను సైతం వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేకపోయిన తేజస్విని మనస్థాపంతో గురువారం రాత్రి ఇంటి నాల్గో అంతస్థు పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో యువతి మృతి చెందింది. కూతురు మృతితో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తేజస్విని చదువులో చాలా చురుకుగా ఉండేదని, చుట్టుపక్కల వారితో చలాకీగా మాట్లాడేదని స్థానికులు తెలిపారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలోకి సోషల్ మీడియా ద్వారా ఏర్పడ్డ పరిచయం విషాదాన్ని నింపింది. ఆకతాయి వేధింపులకు గురిచేసిన యువకున్ని ఉరితీయాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

మరో ప్రాణం తీసిన ఇన్ స్టాగ్రామ్ వేధింపులు

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు.. చనువుగా ప్రవర్తించి ప్రేమ ఒలకబోశాడు. నమ్మిన యువతిని వేధించడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలో మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు. సహనం కోల్పోయిన యువతి పేరెంట్స్ కు చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఏపీకి చెందిన యువకుడి వేధింపులతో తెలంగాణ అమ్మాయి ప్రాణాలు కోల్పోయి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన మామిడి అఖిల ఆత్మహత్య సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. ఆత్మహత్యకు ఓ యువకుడితోపాటు ముగ్గురు వేధింపులే కారణమని స్పష్టమౌతుంది. ఎంఎల్టీ చదువుతున్న అఖిల హైదరాబాద్ లో ట్రైనింగ్ కు వెళ్లినప్పుడు విజయవాడకు చెందిన యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఇంటి వద్దే ఉంటున్న అఖిలను ఆ యువకుడు వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకర మాటలతో మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడంతో పేరెంట్స్ కు చెప్పుకోలేక కుమిలి పోయింది. గ్రామంలో హోటల్ నిర్వహించే తల్లిదండ్రులు హోటల్ వద్ద ఉండగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ సైతం రాసింది. విజయవాడకు చెందిన అంగోతు భరత్, అంగోతు కోటయ్య, అంగోతు విజయలు తనను ఫోన్లో వేధించడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఏడిపిస్తున్నారని నా చావుకు వారే కారణమని రాసింది. ఎదిగిన బిడ్డ తమకు ఆసరగా ఉంటుందనుకుంటే ప్రేమ పేరుతో వేధించి ప్రాణం తీశారని పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు.

బిడ్డ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు

మామిడి మొగిలి దంపతులకు ఇద్దరు బిడ్డలు కాగా చిన్న బిడ్డ అఖిల. గ్రామంలో హోటల్, ఆటో నడుపుతూ జీవనం సాగించే మొగిలి పెద్ద బిడ్డను ఇంజినీరింగ్, చిన్న బిడ్డను ఎంఎల్టీ చదివించాడు.‌ చేతికందిన బిడ్డలు ఇక జాబ్ తో తనకు ఆసరాగా ఉంటారనుకుంటే చిన్న బిడ్డ అఖిల వేధింపులకు బలికావడం ఆందోళన చెందుతున్నారు. ప్రేమ పేరుతో వేధించి ప్రాణం తీసిన వారు చావాల్సిందేనని పేరెంట్స్ డిమాండ్ చేశారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ తోపాటు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అఖిల రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా అఖిల ఆత్మహత్యపై ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీ యువకుల కోసం ఆరా తీస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమ పేరుతో వేధించి యువతి ప్రాణాలు తీసుకునేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను ఇన్ స్టాగ్రామ్ ను అతిగా ఉపయోగించడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుందనే విమర్శలు వెళ్తున్నాయి.

రిపోర్టింగ్ : మెదక్ రిపోర్టర్, కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం