Nagarjuna Sagar Water: సాగర్ ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు, రేపుఎడమ కాల్వకు నీటి విడుదల
Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం, వేసంగి సీజన్లను కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈ వానాకాలంపై ఆశలు పెట్టుకున్నారు.
Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం, వేసంగి సీజన్లను కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈ వానాకాలంపై ఆశలు పెట్టుకున్నారు. మొన్న మొన్నటి దాకా తాగునీటినైనా అందివ్వగలదా అన్న అనుమానాలు వ్యక్తమైన ఎగువున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతోంది. దీంతో ఎడమకాల్వ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎడమకాల్వకు శుక్రవారం (2వ తేదీ) నీటిని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి దిగువకు భారీగా వరద నీరు
తాజా సమాచారం మేరకు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరువస్తోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,42,026 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులు. శ్రీశైలం డ్యామ్పూ ర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుత 884.50 అడుగులకు నీటిమట్టం చేరింది. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు ఈ నీరంతా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి కూడా నుంచి కూడా దిగువకు నీరు విడుదల అవుతోంది.
సాగర్ కు ఇన్ ఫ్లో అన్యూహ్యంగా పెరగడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుత 532.40 అడుగులకు చేరకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 172.8700 టిఎంసిలకు చేరుకుంది.
ఆయకట్టు రైతుల్లో ... ఆనందం
సాగర్ జలాశయం శరవేంగా నిండుతుండడం, అనూహ్యమైన ఇన్ ఫ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కాల్వకు నీరు విడుదల చేయాలని నిర్ణయించడంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలతో పాటు, ఖమ్మం జిల్లాకూ సాగునీరు విడుదల కానుంది.
వాస్తవానికి నాగార్జున సాగర్ప్రా జెక్టు కుడి ఎడమ కాల్వల కింద 22.36 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందాలి. ఒక్క ఎడమ కాల్వ పరిధిలోనే నల్గొండ, ఖమ్మం, క్రిష్ణా జిల్లాలకు సాగుర్ అందుతోంది. నల్గొండ జిల్లా పరిధిలో 3.72 లక్షల ఎకరాలు, ఖమ్మం పరిధిలో 3.46 లక్షల ఎకరాలు, ఏపీలోని క్రిష్ణా జిల్లా పరిధిలో 4.04 లక్షల ఎకరాలు మొత్తంగా ఎడమ కాల్వ కింద 22,24,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ,పూర్తి ఆయకట్టుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీరు అందింది లేదు.
శుక్రవారం నీటి విడుదల
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తాజా గణాంకాల మేరకు 3,68,324 ఎకరాల ఆయకట్టు ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఎ.ఎం.ఆర్.పి) ఉంది.
సాగర్ ఎడమ కాల్వపై 42 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఎడమ కాల్వ కింద 2,81,6783 ఎకరాలు, 42 ఎత్తిపోతల కింద 86,641 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇక, ఎ.ఎం.ఆర్.పి కింద 99 డిస్టిబ్యూటరీలు, 90 దాకా చెరువులను నింపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయకట్టు రైతులంతా సాగర్ నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రాజెక్టులో నీరులేక కనీసం ఆరుతడి పంటలకు కూడా నీరు విడుదల కాలేదు.
నిన్న మొన్నటి వరకు కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీరు విడుదల చేశారు. ఇపుడు ప్రాజెక్టు సగానికపైగా నిండడంతో ఆయటకట్టుకు శుక్రవారం నీరు విడుదల చేయనున్నారు. అధికార యంత్రాంగం నుంచి అందుతున్న సమాచారం మేరకు జిల్లాకు చెందిన సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సాగునీటి విడదల కార్యక్రమానికి హాజరు కానున్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT ప్రతినిధి, ఉమ్మడి నల్గొండ )