Rental Cars Fraud: సొంత కార్లు అద్దెకు ఇస్తున్నారా! ఈ విషయాలు మరువకండి.. లాభాలకు ఆశపడితే నిండా మునిగిపోతారు…-renting out your car what you need to know before you start ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rental Cars Fraud: సొంత కార్లు అద్దెకు ఇస్తున్నారా! ఈ విషయాలు మరువకండి.. లాభాలకు ఆశపడితే నిండా మునిగిపోతారు…

Rental Cars Fraud: సొంత కార్లు అద్దెకు ఇస్తున్నారా! ఈ విషయాలు మరువకండి.. లాభాలకు ఆశపడితే నిండా మునిగిపోతారు…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 10:33 AM IST

Rental Cars Fraud: అధిక రాబడి ఆశతో కొత్త కార్లు, ఖరీదైన వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెకు ఇస్తే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఈఎంఐలపై వాహనాలను కొనుగోలు చేసి వాటిని రెంటల్ ఏజెన్సీలు, లాంగ్‌ డ్రైవ్‌లకు అద్దెకు ఇస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోండి..

రాబడి కోసం ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తే అంతే సంగతులు
రాబడి కోసం ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తే అంతే సంగతులు

Rental Cars Fraud: అదనపు ఆదాయం కోసం ఇంటి వద్ద ఖాళీగా ఉన్న ఖరీదైన కార్లను కిరాయికి ఇచ్చే ధోరణి ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇలా చేయడం వల్ల ఆదాయం రావడంతో పాటు ఏదో ఒక సమయంలో లాభం గూబల్లోకి రావడం కూడా ఖాయం…

ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని వాటిని విక్రయించడం, ఇతర ప్రాంతాల్లో అద్దెకు తిప్పడం వంటి మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువైంది. సిద్ధిపేటకు చెందిన ఓ యువకుడు ఇలాగే అద్దెకు ఇచ్చి వాటిని విడిపించుకోలేక కడపలో చావు దెబ్బలు తిన్నాడు. వైసీపీ ఎంపీ అనుచరులమంటూ నిందితుల ముఠా కార్ల యజమానిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేసింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కర్ణాటకలో తిరుగుతున్న కార్లను విడిపించి బాధితుడికి అప్పగించాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయి,.

సొంత కార్లకు అద్దె ఆశ చూపి టోకరా వేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఓ మహిళ రెండున్నర కోట్ల విలువ చేసే 21 కార్లను మాయం చేసింది. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసంఉండే జూపూడి ఉష డబ్బు కోసం రెంటల్ కార్ ఏజెన్సీ నాటకం ఆడింది.

షేక్‌పేట నాలాకు చెందిన డ్రైవర్ తుడుముల మల్లేష్‌తో కలిసి నగరంలో పలువురి వద్ద కార్లను అద్దెకు తీసుకున్నారు. వాటిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాగర్‌ పాటిల్, అనిల్ కుమార్‌లకు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలు తీసుకుని విక్రయించే వారు. యజమానులు కార్ల గురించి అడిగితే ఉష, మల్లేష్ మాయమాటలు చెప్పేవారు. వారిచేతిలో మోస పోయామని గ్రహించిన కార్ల యజ మానులు నవంబర్ 10న రాయదుర్గం పోలీసు లను ఆశ్రయించారు.

నిందితులకు ఓనర్లకు అద్దె చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకుని వేరే వారికి కార్లను ఇచ్చేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ కు కార్లను ఇస్తే నెలనెలా అద్దె చెల్లిస్తామంటూ తీసుకుని వాటిని లీజుకు ఇచ్చేస్తున్నారు. అసలు యజమానులకు మొదట్లో కొంత చెల్లించినా తర్వాత పత్తా లేకుండా పోయేవారు. క్రమంగా అసలు ఓనర్లకు అద్దె చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు.

ఈ కేసులో జూపూడి ఉష, తుడుముల మల్లేష్, సాగర్ పాటిల్, అనిల్ జమానేలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కర్ణాటక ప్రాంతంలో అద్దెకు ఇచ్చి అక్కడ తిప్పుతూ వారి నుండి నెలనెలా అద్దె వసూళ్లు చేస్తున్నారు. కార్ల అసలు ఓనర్లకు తమ కారు ఎక్కడ ఉందనే విషయం తెలియదు. నిందితుల వద్ద నుండి కార్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కార్లలో మహీంద్రా థార్, మారుతీ సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా, స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఇతర వాహనాలు ఉన్నాయి.

రెంటల్స్‌తో నష్టాలెన్నో…

  • రెంటల్ కార్లలో అద్దెకు ఇచ్చే కార్లలో వాహనం ప్రయాణించే దూరంపై నియంత్రణ లేకపోవడంతో అవి త్వరగా పాడైపోతాయి.
  • సాధారణంగా రోజుకు రూ.1500 నుంచి రూ.2వేల అద్దెకు కార్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో రోజుకు రూ.300 నుంచి 400 కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణిస్తే కార్ల జీవిత కాలం తగ్గిపోతుంది.
  • లాంగ్‌ డ్రైవ్ కార్లలో ఒక్కోసారి సగటున రోజుకు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు కూడా ఉంటారు.
  • ఒకటి రెండు రోజుల్లో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఇంజన్ సామర్థ్యం తగ్గిపోవడంతో దాని జీవిత కాలం, వారంటీలు త్వరగా పూర్తవుతాయి.
  • రెంటల్ కార్లుగా వినియోగించేందుకు అద్దెకు తీసుకునే వారు వాహనాలు మరమ్మతులకు గురైతే బాగు చేయించేందుకు నిరాకరిస్తున్న ఉదంతాలు ఎక్కువగా ఉంటున్నాయి.
  • వారు చెల్లించే అద్దెతో పోలిస్తే వాహనం రిపేర్లకు అయ్యే ఖర్చు భారీగా ఉంటోంది. చాలా సందర్బాల్లో లాంగ్‌ డ్రైవ్ అద్దెలకు ఇస్తున్న వాహనాలు కొనుగోలు చేసిన ఏడాదిలోపే గ్యారేజీకి వెళుతున్నాయి.
  • కార్లను అద్దెకు ఇచ్చేటపుడు వాటిని లీజుకు తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. ఇలా అద్దెలకు తీసుకున్న కార్లలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పోలీస్ కేసుల్లో చిక్కుకున్న వాహనాలను అయా సంస్థలు పట్టించుకోవడం లేదు.
  • కొత్త వాహనాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే సొంత డ్రైవర్లతో అద్దెకు తిప్పడం తప్ప థర్డ్‌ పార్టీ అప్లికేషన్లు, ఏజెన్సీలకు అప్పగిస్తే ఆ తర్వాత వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందేనని గుర్తుంచుకోవాలి.

Whats_app_banner