Karimnagar Municipal Corporation : నేతల మధ్య విభేదాలు.. తెరపైకి అధికారులు! కార్పొరేషన్ లో రాజకీయ రచ్చ
కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. పాలకపక్షంలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విబేధాలు అధికారుల వరకు చేరింది. మాజీ కార్పొరేటర్ పై ఫిర్యాదు చేయటంతో… అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కరీంనగర్ మున్సిపల్ యవ్వారం రాజకీయంగా దుమారం రేపుతోంది. మేయర్ వై.సునీల్ రావు అమెరికా టూర్ తో బహిర్గతమైన విభేదాలు కేసుల వరకు వెళ్ళింది. ముందస్తు సమాచారం లేకుండా ఎవరికి ఇన్ చార్జి బాద్యతలు అప్పగించకుండా మేయర్ అమెరికా వేళ్ళాడని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ పమేలా సత్పతి మేయర్ కు నోటీస్ జారీ చేయడంతో మేయర్ నెలరోజుల అమెరికా పర్యటనను 15 రోజుల కుదించుకొని హడావిడిగా 5న బయలుదేరి శుక్రవారం రాత్రి కరీంనగర్ కు చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ డిప్యూటీ మేయర్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సవాల్ ప్రతి సవాల్ వరకు చేరింది. వారి మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్ లా మారింది.
పోలీసులకు ఫిర్యాదు
మేయర్ సునీల్ రావు దళిత కార్పొరేటర్ లపట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపిస్తు 44 వ డివిజన్ కార్పోరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ పోలీసులకు పిర్యాదు చేశారు. దళిత మహిళా అయిన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
ఎస్సీ రిజర్వు డివిజన్ అయితే నిధులు కేటాయించాలా అంటూ అవమానపరిచేలా మాట్లాడారని.. మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్సీ డివిజన్ లకు 15 శాతం నిదులు అభివృద్ధి కేటాయించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ మేయర్ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో దళితుల పట్ల వివక్షత చూపుతున్నాని కార్పోరేటర్ దంపతులు ఆరోపించారు. మేయర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
టిపిఎస్ తో వాగ్వావాదం…!
తాజాగా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తీగలగుట్టపల్లి కి చెందిన మహిళ సుకన్య టౌన్ ప్లానింగ్ సమస్యపై టిపిఎస్(టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్) తేజస్విని కలిసి స్పీకింగ్ నోటీసులు ఇవ్వాలని కోరాడు. టీపిఎస్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు ఫైల్ విసిరి కొట్టాడు. ఆ వెంటనే చంద్రశేఖర్… కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. కట్ చేస్తే ఆయన కంటే ముందే టిపిఎస్ తేజస్విని…. కమిషన్ కలిసి కన్నీటి పర్యంతమై చంద్రశేఖర్ తీరుపై ఫిర్యాదు చేశారు. కమిషనర్ వద్దకు చంద్రశేఖర్ వెళ్ళగానే కమిషనర్ ఆగ్రహంతో గెట్ అవుట్ అని అగ్రహం వ్యక్తం చేశారు. తాను మాజీ కార్పొరేటర్ అని…. తన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ అని చంద్రశేఖర్ చెప్పడంతో కమిషనర్ కాస్త వెనక్కి తగ్గి స్వారీ చెప్పి పంపించేశారు.
గంటలోనే మారిన సీన్... చంద్రశేఖర్ అరెస్ట్
టిపిఎస్ తేజస్విని మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్ మద్య జరిగిన వాగ్వివాదంతో పాటు కమిషనర్ సారీ చెప్పడంతో సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ గంట వ్యవధిలోనే సీన్ మారిపోయింది.
చంద్రశేఖర్ వ్యవహరించిన తీరు మేయర్ దృష్టికి వెళ్ళడంతో కమిషనర్ టి పి ఎస్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ టిపిఎస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు దాడికి యత్నించాడని పేర్కొన్నారు. ఫైల్ ఎత్తుకెళ్ళాడని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ పై ఏడు సెక్షల క్రింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మేయర్ సునీల్ రావు ప్రోద్బలంతోనే చంద్రశేఖర్ పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని కార్పోరేటర్ మెండి శ్రీలత ఆరోపించారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని తెలిపారు. మేయర్ అక్రమాలను వివక్షతను ప్రశ్నించినందుకే కేసులు పెట్టి వేదిస్తున్నారని… కేసులకు భయపడేది లేదని న్యాయపరంగా పోరాటం చేసి మేయర్ బండారం బయటపెడుతామని శ్రీలత స్పష్టం చేశారు.
ఉద్యోగులు నిరసన ఆందోళన...
చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అటు అధికార పార్టీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్ అధికారులు చంద్రశేఖర్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. టీపిఎస్ పై దాడికి యత్నించి ఫైల్ ఎత్తుకెళ్ళిన చంద్రశేఖర్ పై చర్యలు తీసుకుని ఉద్యోగులకు భద్రత కల్పించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
లంచ్ టైమ్ లో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఉద్యోగుల నిరసనకు కమిషనర్ తో పాటు టిఎన్జీవోలు సంఘీభావం తెలిపారు. పాలక వర్గంలో నెలకొన్న విభేదాలతో ఉద్యోగులు సైతం రోడ్డెక్కె పరిస్థితి రావడంతో రాజకీయంగా కరీంనగర్ కార్పోరేషన్ హాట్ టాపిక్ గా మారింది.