నిజామాబాద్‌లో అంతా రామజపమే.. వైభవంగా సీతారామ కళ్యాణం
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది.
అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంతా రామజపంతో మార్మోగింది. ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఉదయం నుంచి రామజపంతో భక్తులు పునీతమయ్యారు. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో చారిత్రక నేపథ్యం ఉన్న ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామ కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్బంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఖిల్లా శ్రీ రఘునాథ ఆలయంలో సీతారాములోరికి అభిషేకం, అర్చన, హోమం జరిపించారు. అనంతరం కన్నుల పండుగగా సీత -రాముల కళ్యాణం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లైవ్‌లో భక్తులతో కలిసి వీక్షించారు. సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ "ఈ రోజు ప్రపంచం అంత రామ నామ జపం చేస్తోంది. 500 ఏళ్లనాటి హిందువుల కల నేటితో సాకారం అయింది..’ అని అన్నారు.
రాబోయే రోజుల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచంలోనే మహా పుణ్యక్షేత్రం కాబోతుందని, సమస్త మానవాళికి రాముని జీవితం ఆదర్శం అని చెప్పారు. ఈ మహా పుణ్య కార్యాన్ని మనం చూడటం మన పూర్వ జన్మ సుకృతం అని, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు ఈ అవకాశం లభించిందని చెప్పారు. అయోధ్య రాములోరి కోసం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం నేడు ఫలించింది అని, వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరింది అని అన్నారు.
ఈ సందర్బంగా ఇందూరు నుండి అప్పటి కర సేవలో పాల్గొన్న కొందరిని ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివాఖర్ జీ తో కలిసి సన్మానించారు.