Kadem Project : కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
Kadem Project : నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేశాయి. కడెం ప్రాజెక్టులో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Kadem Project : నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు లోని వరద నీరు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
జిల్లాలోని ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయినందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చెరువులో వాగుల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. రోడ్లపై వాగులు ప్రవహిస్తున్న చోట్ల బారికేడ్ లు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గత ఏడాది ప్రాజెక్టు గేట్లు మూసుకుపోయి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఇంజినీర్ అధికారులు మంత్రికి వివరించారు.
కడం ప్రాజెక్ట్ కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా మారిపోయాయి. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు చేరుతుంది. వెంటనే అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 7.195 క్యూసెక్కులు, 700 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 7.603 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. ఇన్ ఫ్లో 61001 క్యూసెక్కుల చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో ఆదివారం నీటి మట్టం 6.414 టీఎంసీలుగా ఉంది. పది గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి నది తీర ప్రాంతంలో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకూడదని, నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాజెక్టు చేరుతున్న వరద నీటి ఉద్ధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, HT తెలుగు డెస్క్
సంబంధిత కథనం