BRS Niranjan: కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం.. అందుకే ఓటమి - మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Niranjan: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
BRS Niranjan: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం పని చేసిందని, కాంగ్రెస్ నాయకులు కసితో పని చేయడం వల్లే విజయం సాధించారన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశాన్ని సోమవారం హనుమకొండ నగరంలోని సీఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను పక్కాగా వాడుకుని దుష్ప్రచారం చేశారన్నారు.
కాంగ్రెస్ విష ప్రచారాన్ని ఖండించడం గానీ, తిప్పికొట్టడం గానీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేయలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల మధ్య తేడా కేవలం 1.85 శాతం మాత్రమేనని, రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతను ఓడగొట్టారని, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.
చాలా తక్కువ సమయంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమనేని, ఎన్ని గొప్ప పనులు చేసినా ప్రజలు సంతృప్తి పడలేదన్నారు.
ఉద్యోగుల ప్రేమ దక్కలేదు
ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టారని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ప్రేమను బీఆర్ఎస్ పొందలేకపోయిందని నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చిందని, బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాలతోనే అనేక ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. అయినా బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.
50 రోజులు కాకముందే దాడులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అందరం ఒకటి కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 9వ తేదీనే రైతుల అకౌంట్ లో రైతుబంధు డబ్బులు వేస్తామని చెప్పారని, ఇంతవరకు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పూర్తిగా విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విషప్రచారం చేసి గెలిచిందని, చిన్న చిన్న కారణాలతో నే ఓడిపోయామన్నారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్‌ఎస్సే అని, ఇదే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళదామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తన విజన్‌తో జనం గుండెల్లో నిలిచిన నేత కేసీఆర్ అని, అయినా దురదృష్టశాత్తూ ప్రభుత్వం ఏర్పడలేక పోయిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)