Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!
జగిత్యాల జిల్లాలో నవ వధువు సూసైడ్ చేసుకుంది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని అరచేతిపై మరణ వాంగూల్మం రాసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
పక్షం రోజుల క్రితమే మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచారు...! ఆలుమగలుగా మారారు...! నవ దంపతులు హైదరాబాద్ వెళ్ళి తిరిగొచ్చారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అరచేతిలో తన చావుకు ఎవరు కారణం కాదని మరణ వాంగ్మూలం రాసుకుంది. కలకలం సృష్టిస్తున్న ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
మల్యాల మండలం తంగళ్ళపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి మ్యాడంపల్లి కి చెందిన కిరణ్ తో ఆగష్టు 18న వివాహం జరిగింది. వివాహ అనంతరం కొద్ది రోజులు హైదరాబాద్ కు వెళ్ళారు. నవ దంపతులు విహారయాత్ర ముగించుకుని రెండు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చారు.
తల్లిగారి ఇంటికి వెళ్ళిన భాగ్యలక్ష్మి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ భాగ్యలక్ష్మీ మాత్రం కుడి చేయి అరచేతిలో "నేను ఎవరి కారణంగా చనిపోవడం లేదు.. నన్ను ఎవరు ఏమనలేదు.. నాకే ఈ7 లోకంలో ఉండడం ఇష్టం లేదు.. అందుకే వెళ్ళిపోతున్నా" అని రాసుకుంది.
ఎందుకు ఆత్మహత్య?...
పెళ్ళైన 18 రోజులకే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య కు గల కారణాలు గురించి ఆరా తీస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి, అందరూ ఇష్టంతో జరిపించిన వివాహం ఇలాంటి నేపథ్యంలో ఆనందంగా గడపాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం నోరు విప్పడం లేదు. పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృత దేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
చేతిరాతపై విచారణ.
తన చావుకు కారణం ఎవరు కాదని..తానే ఈలోకంలో ఉండలేక వెళ్ళిపోతున్నానని అరచేతిలో రాసుకున్న మ్యాటర్ ను బట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను విచారించి అసలు కారణం తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.