NGT Fines Telangana : 3 నెలల్లోగా రూ. 900 కోట్లు కట్టండి - తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం
NGT Fines Telangana : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్.. మరోసారి భారీ జరిమానా విధించింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ… నష్టపరిహారం కింది రూ. 900 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
NGT Fines Telangana : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) మరోసారి షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వానికి రూ. 900 కోట్ల భారీ జరిమానా విధించింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను పర్యావరణ సహా ఇతర అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని... ఈ అంశంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంది. ఈ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వ్యయంలో 1.5 శాతం జరిమానా విధించింది. ఈ అంశంలో దాఖలైన పిటిషన్లపై పూర్తి విచారణ అనంతరం ఇవాళ చెన్నై ఎన్జీటీ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తప్పుపట్టిన ఎన్జీటీ బెంచ్... రూ. 900 కోట్ల జరిమానాను 3 నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద నష్టపరిహారం కింద జమ చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపడుతోందని ఆరోపిస్తూ.. కోస్గి వెంకటయ్య చెన్నై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలు వాసి చంద్రమౌళీస్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరు పక్షాల తరపున వాదనలు నమోదు చేసుకున్న ఎన్జీటీ ధర్మాసనం... గురువారం విచారణ ముగించి తీర్పు వెలువరించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్ట వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో రూ. 300 కోట్లు... పర్యావరణ నష్ట పరిహారం కింద.. పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో రూ. 528 కోట్లు... డిండి ప్రాజెక్టులో రూ. 92 కోట్లు చెల్లించాలని... తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నష్టపరిహారం చెల్లింపునకు ఎన్జీటీ 3 నెలల గడువు విధించిన నేపథ్యంలో.. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్జీటీ తీర్పుని కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరనుంది.
వ్యర్థాల నిర్వహణలో జారీ చేసిన ఆదేశాలు పాటించడం లేదంటూ .. గత అక్టోబర్ లో జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 3825 కోట్ల భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యం కాదంది. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం తప్పదని హెచ్చరించింది.