Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే, హామీ నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి!
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఉద్యోగం నీకే ఇస్తామని ఓ దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చనున్నారు. రేపటి ప్రమాణ స్వీకారానికి ఆమెకు ఆహ్వానం పంపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి ఉద్యోగం ఈ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు.
Revanth Reddy : తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే తెలంగాణలో మొదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఓ దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు.
తొలి ఉద్యోగం ఆమెకే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేట్ సెక్టార్ లో ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దిగ్యాంగురాలు రజినీ అనే అమ్మాయి రేవంత్ రెడ్డిని ఈ ఏడాది అక్టోబర్ నెలలో కలిసి తన ఆవేదనని వ్యక్తం చేసింది. రజినీ బాధను విన్న రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని,ఆ కార్యక్రమానికి మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వస్తారని....అదే సభలో వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం నీకే ఇస్తానని రజినీకి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయడంతో పాటు కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.
ఇక రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీకి ప్రత్యేక ఆహ్వానం పంపాలని రేవంత్ రెడ్డి కోరడంతో అధికారులు రజినీకి ఆహ్వానాన్ని పంపారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలి ఉద్యోగం దివ్యాంగురాలైన రజినీకి ఇవ్వనున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్