Khammam : లోన్ కన్సల్టెన్సీపై వార్తలు..! విలేకరిపై రౌడీషీటర్ల హత్యాయత్నం
Khammam Crime News: ఖమ్మం సిటీలో ఓ జర్నలిస్టులపై రౌడీషీటర్లు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో జర్నలిస్టు తప్పించుకోవటంతో ప్రాణాలుతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు… ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
Khammam News: ఖమ్మం నగరంలో(Khammam ) ఒక ప్రముఖ దిన పత్రికలో క్రైం రిపోర్టర్ గా పని చేస్తున్న "నల్లి శ్యామ్" అనే విలేకరిపై రౌడీ మూక హత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం రాత్రి వేళ శ్యామ్ ఆఫీస్ లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు రౌడీ షీటర్లు అతని ద్వి చక్ర వాహనాన్ని కారుతో ఢీ కొట్టారు. కింద పడిపోయిన శ్యామ్ తేరుకుని పైకి లేచేలోపే అతన్ని కత్తులతో పొడవడానికి యత్నించారు. ప్రవీణ్ అనే దుండగుడితో పాటు మరో నలుగురు రౌడీ షీటర్లు దాడికి ప్రయత్నించగా వారి నుంచి శ్యామ్ తెలివిగా తప్పించుకున్నాడు. "చంపేసి నీ శవాన్ని కూడా దొరక్కుండా మాయం చేస్తాం."అంటూ రౌడీ షీటర్లు బెదిరిస్తూ విలేకరిపై జరిపిన దాడిలో అతనికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వారి నుంచి తప్పించుకుని బయటపడిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన స్పందించిన రెండో పట్టణ పోలీసులు రౌడీ మూకలను వెంబడించి పాలేరు సమీపంలో కారును అడ్డగించి పట్టుకున్నారు.
లోన్ కన్సల్టెన్సీపై వార్తలు రాసినందుకే..?
ఒక ప్రముఖ దిన పత్రికలో పని చేస్తున్న శ్యామ్ అంతకు ముందు రోజు ఖమ్మంలో అక్రమంగా, అడ్డగోలుగా నడుస్తున్న లోన్ కన్సల్టెన్సీపై అతను పని చేస్తున్న దిన పత్రికలో వార్తను ప్రచురించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ ముఠా రౌడీ షీటర్ల సాయంతో విలేకరిపై దాడి చేసేందుకు పథకం పన్నారు. ఇందులో ప్రవీణ్ అనే వ్యక్తి బ్యాంకులను తప్పుదోవ పట్టించి, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు శ్యామ్ రాసిన వార్తలో ప్రచురితమైంది. ఖమ్మం నగరం కేంద్రంగా లోన్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కథనం రాసినందుకే శ్యాం పై రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారన్న విషయం పోలీసులు గుర్తించారు. లోన్ ఆశ చూపి కొందరు అమాయకులే అస్త్రంగా వల విసురుతున్న కన్సల్టెన్సీ బాగోతాన్ని బయట పెట్టిన శ్యాం పై జరిగిన దాడిని తోటి జర్నలిస్టులు, యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.