Mulugu Crime : అడవి జంతువుల కోసం కరెంట్ ఉచ్చులు, తీగలు తగిలి రైతు మృతి!
Mulugu Crime : ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం దుండగులు అమర్చిన విద్యుత్ తీగల తగిలి రైతు ప్రాణాలు కోల్పోయాడు.
Mulugu Crime : వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు దుండగులు అమర్చిన విద్యుత్తు తీగలు ఓ రైతు ప్రాణాలు తీశాయి. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా.. వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలు తగిలి రైతు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా పెగడపల్లి శివారులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం...పెగడపల్లి గ్రామానికి చెందిన మీనుగు సాంబయ్య(42) దాదాపు రెండెకరాల భూమి ఉంది. అందులో సాంబయ్య వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. సాంబయ్య పొలానికి కొద్దిదూరంలో కొందరు దుండగులు అడవి జంతువుల కోసం ఉచ్చులు బిగించారు. వాటికి కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. కంటికి కనిపించకుండా ఏర్పాటు చేయడంతో సాంబయ్య వాటిని గమనించకుండా అలాగే ముందుకు వెళ్లాడు. దీంతో ఆయనకు కరెంట్ ఉచ్చులు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.
కరెంట్ షాక్ కొట్టి రైతు మృతి
కరెంట్ షాక్తో సాంబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన ఆయన భార్య భయాందోళనకు గురైంది. వెంటనే పరుగెత్తుకెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చి, వారిని ఘటనా స్థలానికి తీసుకొచ్చింది. దీంతో స్థానికులు ఉచ్చులు తొలగించేసరికి అప్పటికే సాంబయ్య స్పృహ కోల్పోయాడు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి, ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించగా.. ములుగు ఏరియా ఆసుపత్రి సిబ్బంది సాంబయ్యను వరంగల్ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సిందిగా రిఫర్ చేశారు. దీంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్చేసి ట్రీట్మెంట్అందించారు. అప్పటికే పరిస్థితి విషమించగా చికిత్స పొందుతూ సాంబయ్య బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సాంబయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.
పోలీసుల అదుపులో ఐదుగురు?
కరెంట్ ఉచ్చులు తగిలి రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న ములుగు సీఐ రంజీత్ కుమార్, ఎస్సై వేంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్ఏఈ సాయికృష్ణ, ఇతర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలను పరిశీలించారు. ములుగు అటవీ ప్రాంతంలో వణ్యప్రాణులకు వేటకు కరెంట్ ఉచ్చులు బిగుస్తున్నట్లు గుర్తించి, విచారణ చేపట్టారు. ఈ మేరకు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి పూర్తి వివరాలు సేకరించిన తరువాత అరెస్ట్ వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)